డ్యూటీఫుల్ పేరెంటింగ్
సింగిల్స్.. డబుల్ రోల్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్దలకు ఓ సమస్యగా ఉంటే తమ కెరియర్‌ను వృద్ధి చేసుకుంటూనే పిల్లలను పెంచడం ఒంటరి తల్లులకు అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నదని దాదాపు 70 శాతం ఒంటరి తల్లిదండ్రులు తమ ఉద్యోగావకాశాలను వదులుకోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేసింది న్యూయార్క్ కెరీర్ మైండ్స్ అధ్యయనం.
గ్లోబల్‌వైజ్‌గా టెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించే ఈ సంస్థ తమ ఇంటర్వ్యూలలో పాల్గొనే సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం ఉద్యోగాలను వదులుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది.
ఒంటరి తల్లిదండ్రులు తమ కెరియర్‌ను కాపాడుకుంటూనే పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సూచనలు ఇస్తున్నారు.ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టమైన టాస్క్. ముఖ్యంగా ఒంటరి తల్లుల్లో భావోద్వేగ సమతుల్యత తప్పనిసరి. క్రమశిక్షణలో ఉంచాలా? లేక ప్రేమ, ఆప్యాయతలను చూపాలా.. అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఒంటరి తల్లులు అప్పటికే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు.
కఠినమైన శిక్షణ కూడదు
నేను కరెక్ట్‌గా ఉంటేనే నా పిల్లలను బాగా పెంచగలను అనుకునే దోరణిలో పేరెంటింగ్ కూడా సవాల్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల తరచూ భయాందోళనకు లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ‘సూపర్ ఉమన్’లాగా ఉండాలనుకోవడం అన్ని సందర్భాలలో కుదరదు. శారీరకంగానూ, మానసికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని, తమ పెద్దవారి మద్దతు తీసుకోవడం అవసరం. కఠినమైన క్రమశిక్షణ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
సమతుల్యత తప్పనిసరి
ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్‌ని పిల్లల ముందుకు తీసుకురాకూడదు. సింగిల్‌గా ఉండటం వల్ల పెద్దలు ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ‘తామేదో కోల్పోతున్నాం’ అనే భావనలో ఉంటారు. పిల్లలు పెద్దలను గమనిస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. ‘అమ్మకు నాకన్నా ఫోన్ లేదా వర్క్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అనే ఆలోచన పిల్లల్లో రానీయకూడదు.
అభిప్రాయాలను తీసుకోవాలి
పిల్లలు చిన్నవాళ్లు కదా అనుకోకుండా వాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇంటి నిర్ణయాల్లో వారిని పాలుపంచుకోనివ్వాలి. దీనివల్ల తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించినా బయట వెతుక్కుంటారు.
తమ మాటే వినాలనుకోవద్దు
ఒంటరి తల్లుల పెంపకంలో పిల్లలు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువ. పిల్లలు నా మాట వినాలనే ఆలోచనతో పూర్తిగా పిల్లలు చెప్పినట్టు వినడం...లేదంటే తాము ఒక రూలర్‌గా ఉండాలను కుంటారు. టీనేజ్ దశలో ఈ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధానం వల్ల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో పెద్దవాళ్లకు తెలియడం లేదు. కానీ, పెద్దలను ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు బాగా తెలుసు. పిల్లలు ఇద్దరుంటే వారిద్దరినీ సమానంగా చూడాలి. వీలున్నప్పుడల్లా వారిద్దరికీ టైమ్ కేటాయించి వారి ప్రతి అవసరాన్నీ తీర్చాలి.
నమ్మకం ముఖ్యం
పిల్లల అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంతవరకు వాటిని పూర్తి చేయాలి. పిల్లల ఆలోచనా విధానాన్ని పంచుకునే విధానం ఇంట్లో ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరనంలో రోజులో కనీసం పది నిమిషాలైనా పిల్లల కోసం సమయం కేటాయించాలి. తమ పని గురించి చెబుతూనే పిల్లల విషయాలనూ పట్టించుకోవాలి. అప్పుడే ఏదో కోల్పోతున్నామనే భావన పిల్లల్లో కలగకుండా పెరుగుతారు.
-ప్రొఫెసర్ జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్ ట్రెయినర్
తల్లిగా ఉండటమే గొప్ప
ఇద్దరు అమ్మాయిలను ఒంటరితల్లిగా పిల్లలను పెంచుతూనే, తన కెరియర్‌నూ బిల్డ్ చేసుకుంటున్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్ స్ఫూర్తిదాయకమైన విషయాలనూ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ‘ప్రతిరోజూ ఒక తల్లిగా నన్ను నేను భుజం తట్టుకునే పని ఏం చే యాలనేది ముందే నిర్ణయించుకుని, అది పూర్తి చేస్తాను. నా పిల్లలకన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకోను. వారి ద్వారా కూడా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనొక కళాకారిణిగా కన్నా తల్లిగా ఉండటమే గొప్పగా భావిస్తాను. ఆ రోజంతా ఎన్ని పనులు చేసినా పిల్లల వద్దకు వస్తూనే అన్నీ దులిపేసుకొని వారి ముందు ప్రేమగా ఉంటాను.’
– సుస్మితాసేన్
Comments
Please login to add a commentAdd a comment