
పెట్ డాగ్‌ను పెంచుకోవాలనే కోరిక ఇటీవల బాగా పెరుగుతోంది. అయితే పెట్‌కి ఎంత ఆహారం పెట్టాలనే కొండంత సందేహం పెట్‌పేరెంట్‌ని (పెట్ యజమాని) వెంటాడుతూనే ఉంటుంది. దానికి సమాధానం ఒక్కటే... దాని ఆకలిని బట్టి అది తినగలిగినంత పెట్టడమే. శునకాన్ని పెంచుకోవాలనుకునే వాళ్లు ముఖ్యంగా దానిని ఏ వయసులో పెంపకానికి తెచ్చుకోవాలనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండు నెలల లోపు కుక్కపిల్లను పెంపకానికి తెచ్చుకోకూడదు. అప్పటి వరకు అది తల్లిపాలు తాగాల్సిందే. ఆ తర్వాత పెంపకానికి తెచ్చుకుని మామూలు ఆహారం పెట్టవచ్చు.
పెరిగే దశ రెండు నెలల నుంచి ఏడాది లోపు కాలాన్ని పెట్ గ్రోత్ పీరియడ్. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో పెట్‌కి ఆకలి, అల్లరి రెండూ ఎక్కువే. రెండు నెలలు నిండిన పప్పీకి రోజుకు ఆరుసార్లు ఆహారం ఇవ్వాలి. ఆరు నెలల వయసుకు వచ్చేటప్పటికి మూడుసార్లు పెడితే సరిపోతుంది. ఎనిమిది నెలలు నిండేటప్పటికి రోజుకు రెండుసార్లు తినేటట్లు అలవాటు చేయవచ్చు. ఇది ప్రధానంగా అనుసరించే ఆహారపు వేళలు. అయితే పిల్లలు ఎలాగైతే అందరూ ఒకేలాగ ఉండరు, ఒకేలాగ తినరో... అలాగే పెట్‌లో కూడా ఒకదానికీ మరొకదానికీ కొద్దిపాటి మార్పులు ఉంటాయి. కుక్కపిల్లను పెంచుకునేటప్పుడు దానికి– యజమానికి మధ్య అనుబంధం పెరుగుతుంది. దాంతో దానికి ఆకలి అయ్యే సమయం, దాని పొట్ట ఎంత పడుతుంది... వంటివన్నీ ‘పెంపుడు’ తల్లిదండ్రులకు అర్థమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment