ఇరిగేషన్ టెండర్లలో గోల్‌మాల్!
Published Sat, Aug 10 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
పలమనేరు, న్యూస్‌లైన్: వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదనే చందంగా తయారైంది పలమనేరు ఇరిగేషన్ అధికారులు తీరు. నిబంధనలను పక్కనబెట్టి టెండర్ల ప్రక్రియను గోప్యంగానే పూర్తి చేసి, తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం పనులు వచ్చేలా అధికారులే మేనేజ్ చేసేశారు. రూ.75 లక్షల పనులకు జరిగిన టెండర్ల ప్రక్రియ గోల్‌మాల్ అయ్యిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమను టెండర్లలో పాల్గొననీయకుండా ఇంత రాజకీయం చేయాల్సిన అవసరమేమిటంటూ కొందరు కాంట్రాక్టర్లు స్థానిక అధికారులను నిలదీయడంతో ఈ విషయం శుక్రవారం వెలుగుచూసింది.
పలమనేరు ఇరిగేషన్ శాఖ పరిధిలోని వి.కోట మండలంలో రూ.75 లక్షల పనులకు ఆ శాఖ గత నెలలో టెండర్లు పిలిచింది. ఈ నిధులతో చెరువు కట్టల అభివ ృద్ధి, సప్లై చానెళ్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండడం, ఆపై సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో ఈ ప్రక్రియను సంబంధిత అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. మూడు రోజుల క్రితం టెండర్లు వేయాల్సిందిగా ప్రకటన జారీ చేశారు. 10 పనులకు సంబంధించి 41 మంది టెండర్లు వేశారు. అంచనాలు తక్కువగా కోడ్ చేసిన పది మందికి టెండర్లు ఓపెన్‌చేసి ఈ పనులను రెండ్రోజుల క్రితం అప్పగించారు.
ఈ పది మంది కాంట్రాక్టర్లు ఎవరో కూడా నోటీస్ బోర్డులో తెలుపనే లేదు. ఇదిలావుండగా వి.కోట మండలానికి చెందిన మరికొందరు కాంట్రాక్టర్లు తాము టెండర్లు వేస్తామంటూ స్థానిక ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ కాళ్లావేళ్లాపడ్డారు. ఆయన స్పందిస్తూ ఈ ప్రక్రియ ముగిసిందని తేల్చేశారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో టెండర్ల ప్రక్రియ ముగిసిందని ఆ శాఖ ఈఈ పేర్కొనడంతో వీరంతా ఆయనతో వాగ్వాదానికి దిగారు. ‘మీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం మీరే దగ్గరుండి ఫిక్సింగ్‌లు జరిపించి, మాకు అన్యాయం చేస్తారా’ అంటూ వాగ్వాదానికి దిగారు. శుక్రవారం ఆ కాంట్రాక్టర్లు శ్రీని వాసులు, మునెప్ప, శీన తదితరులు కార్యాలయంలో జరుగుతున్న టెండర్ల అక్రమాలను విలేకరులకు వివరించారు.
మరోవైపు రూ.లక్షకు పైన అంచనా విలువ గల ప్రభుత్వ పనులను ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవాల్సి ఉంది. సీల్డ్ కవర్ టెండర్లు పిలవడం, రహస్యంగా ప్రకటన చేసి ప్రక్రియ ముగించడం చూస్తుంటే వ్యవహారం వెనుక అధికారుల హస్తం ఉందనే విషయం తెలుస్తోంది. దీనిపై ఆ శాఖ ఈఈ సత్యనారాయణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. బంద్ కారణంగా ఈ పనులను త్వరగా చేపట్టాలనే ఉద్దేశంతో ముగించేశామన్నారు. ఇందులో గోల్‌మాల్ ఏమీ లేదని చెప్పారు.
Advertisement
Advertisement