
కోడిగుడ్ల టెండర్లలో గోల్‌మాల్
- తక్కువ రేటుకు ఇస్తామన్న వారికి మొండిచేయి
- అధిక రేటుకు టెండర్ ఖరారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి
చిత్తూరు(టౌన్): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలోని అంగన్‌వాడీ కేం ద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఖరారు చేసిన టెండర్లలో గోల్‌మాల్ చోటుచేసుకుంది. తక్కువ ధరకు గుడ్లు సరఫరా చేస్తామని ముందుకొచ్చిన వారికి కాదని అధిక ధర వసూలు చేసే వారికే కాంట్రాక్ట్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
అధికారుల నిర్ణ యంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్ల లో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమ లు చేస్తోంది. జిల్లాలోని21 సీడీపీవో (చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్)ల పరిధిలోని 4,768 అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు మంగళవారం టెం డర్లు పిలిచారు. అదేరోజు రాత్రి పది గంటల తర్వాత వాటిని ఖరారు చేశారు.
ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు సీల్డ్ కవర్లలో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర స్థాయి లో ఎవరైనా టెండర్లలో పాల్గొనవచ్చని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు నెక్ (నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ) రేటుపై అదనంగా 20 పైసలకు గుడ్లు సరఫరా చేస్తామని తెలిపారు.
వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చి న వారు 24 పైసలు అదనంగా సరఫరా చేస్తామన్నారు. స్థానిక కాంట్రాక్టర్లు వారిని అడ్డుకోవడంతో తిరుగుముఖం పట్టారు. అనంతరం స్థానిక కాంట్రాక్టర్లు సిండికేట్ అయి నెక్ రేటుకున్నా అదనంగా 55 పైసలు కోడ్ చేసినా వారికే టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ ఖజానాకు గండి..
జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధిపొందుతున్న వారు 4,44,057 మంది ఉన్నారు. వీరిలో 0- 6 ఏళ్లలోపు పిల్లలు 2,87,500 మంది, కిశోర బాలికలు 87,757 మంది, సూపర్ వైజరీ ఫీడింగ్ కింద 6 వేల మంది, గర్భిణులు 62,800 మంది ఉన్నారు. వీరికి నెలకు 59,30,712 కోడిగుడ్లు అందివ్వా ల్సి ఉంది. గుడ్డు ధరకన్నా అదనంగా 37 పైసల చొప్పున మదనపల్లె డివిజ న్‌కు, 55 పైసల చొప్పున తిరుపతి, చిత్తూరు డివిజన్ల పరిధిలోని అంగన్‌వాడీలకు సరఫరా చేసేందుకు టెండర్లను ఖరారు చేశారు. అనంతపురం వారు ఇస్తామన్న 20పైసలకు తీసుకోకపోవడం వల్ల నెలకు రూ.20.76 లక్షలు, ఏడాదికి రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
నాణ్యతపైనా అనుమానాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండరుదారులు సరఫరా చేయాల్సిన కోడిగుడ్డు బరువు 45 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. ఇప్పటివరకు ఏ కాంట్రాక్టరూ అలా సరఫరా చేయలేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మూడు నాలుగు మండలాలకు నిర్దేశించిన కాలవ్యవధిలో గుడ్లను సరఫరా చేయలేని కాంట్రాక్టర్లు నేడు ఏడేసి సీడీపీవోల పరిధిలోని అంగన్‌వాడీలకు ఎలా సరఫరా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ కాంట్రాక్టరు సరఫరా చేయకపోతే మన పరిస్థితేంటనే ఆందోళన సీడీపీవోలను వెంటాడుతోంది.
గత ఏడాదికంటే తక్కువ రేటుకే టెండర్లు ఖరారు చేశాం
గత ఏడాది టెండర్లతో పోల్చుకుంటే ఈసారి తక్కువ ధరకే ఖరారు చేశాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చిన విషయం నాకు తెలియదు. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. నాణ్యత విషయం లో రాజీలేకుండా చర్యలు తీసుకుంటాం.
- ఉషాఫణికర్, ఐసీడీఎస్ పీడీ