తవ్విన కొద్దీ... బోరుబావులు, పంపుసెట్ల సబ్సిడీలో అవినీతి లోతు విస్మయం కలిగిస్తోంది. ప్రధానంగా కోరుట్లలో ఉన్న తాండ్య్రాల ఎస్‌బీహెచ్ బ్రాంచి కేంద్రంగా ఈ దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. జిల్లా మొత్తంలో ఎస్సీ కార్పొరేషన్ 190 యూనిట్లు గ్రౌండింగ్ చేస్తే... ఈ ఒక్క బ్రాంచి నుంచే 120 యూనిట్లకు రుణం మంజూరు కావ డం గమనార్హం. ఇవన్నీ కథలాపూర్ మండలంలోనే పంపిణీ కావడం... పది రోజుల్లోనే ఈ బోర్లన్నీ తవ్వి... పంపుసెట్లు బిగించినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడింది. దీంతో భారీ మొత్తంలో సబ్సిడీ సొమ్ము స్వాహా అయిందని తెలిసిపోతోంది.
- సాక్షిప్రతినిధి, కరీంనగర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి గత ఏడాది ఈ యూనిట్ల పేరుతో సబ్సిడీలను స్వాహా చేసినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ గోల్‌మాల్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో.. రాష్ట్ర కార్యాలయం నుంచి అయిదుగురు ఎగ్జిక్యూటివ్ అధికారుల బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. భారీ మొత్తంలో సబ్సిడీ సొమ్ము దుర్వినియోగమైనట్లు అభియోగాలున్న కథలాపూర్ మండలంలో పర్యటించింది.
ముందుగా కోరుట్లలో ఉన్న తాండ్య్రాల ఎస్‌బీహెచ్ బ్యాంకు మేనేజర్ ప్రభుసింగ్‌ను కలిసి.. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన లబ్ధిదారుల వివరాలను బృందం సభ్యులు తీసుకున్నారు. కథలాపూర్ మండలంలో పది రోజుల్లోనే 120 బోర్లు వేసినట్లు రికార్డులో ఉన్న విషయాన్ని తనిఖీకి వచ్చిన అధికారులు బ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో విచారణ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేసింది.
తనిఖీల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన బి.ఆనంద్‌కుమార్, డి.సర్వయ్య, కె.ఆర్.నరేశ్, పీవీ.రమేష్, వై.బాబన్న ఈ బృందంలో ఉన్నారు. బ్యాంకులో రికార్డుల పరిశీలన అనంతరం కథలాపూర్ మండలంలోని భూషణ్‌రావుపేట గ్రామానికి వెళ్లారు. లబ్ధిదారుల వివరాలు సేకరించి వారి ఇళ్ల వద్ద పరిస్థితి, బోర్లు ఎక్కడ వేశారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి జరగాల్సి ఉంటుందని, జాబితాలో ఉన్న లబ్ధిదారులకున్న భవనాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ బృందం వెనుకాలే.. పంపుసెట్ల గోల్‌మాల్‌లో కీలక పాత్ర పోషించిన డీలర్ సైతం అదే గ్రామానికి వెళ్లడం గమనార్హం. మరోవైపు కథలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సంబంధించిన ఫైళ్లు మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఫైళ్లు కనిపించడం లేదని కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల గుర్తింపు మొదలు మంజూరీ, లబ్ధిపొందిన వారి వివరాలన్నీ మండల పరిషత్ కార్యాలయంలోనే భద్రపరచాలి. గతంలో ఈ సెక్షన్‌కు బాధ్యత వహించిన సూపరింటెండెంట్ కె.ప్రభు గత నెలలో కోరుట్ల ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన రికార్డులను కథలాపూర్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌కు అప్పగించినట్లు చెప్పారు. అదే విషయంపై ‘సాక్షి’ వివరణ కోరితే.. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన ఫైళ్లు ఆ బీరువాల్లో వెతికినా కనిపించడం లేదన్నారు. ఓవైపు సబ్సిడీల గోల్‌మాల్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఆ ఫైళ్లు లేవని కార్యాలయ సిబ్బంది బదులివ్వడం గమనార్హం. మరోవైపు పది రోజుల్లో లెక్కకు మించి బోర్లు, పంపుసెట్లకు అడ్డగోలుగా రుణాలు పంపిణీ చేసిన ఎస్‌బీహెచ్ బ్యాంకు తాండ్య్రాల బ్రాంచి మేనేజర్ తీరు చర్చనీయాంశంగా మారింది.
తవ్వితే.. అవినీతి
Published Wed, Dec 18 2013 3:25 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM
Advertisement
Advertisement