ఇంద్రకీలాద్రి, న్యూస్‌లైన్ : దుర్గగుడిలో నిర్వహించే దసరా ఉత్సవాలు కొందరు కాంట్రాక్టర్లకు వరంగా మారుతున్నాయి. నియమ నిబంధనలను తుంగలో తొక్కి బినామీలు, అర్హత లేని వారికి పనులు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కేసుల్లో ఉన్న వ్యక్తులతో పాటు దేవస్థానాలకు ఎన్నడూ భోజన ప్యాకెట్లు సరఫరా చేసిన అనుభవం లేనివారికి కాంట్రాక్టు కేటాయించడం వివాదాస్పదమైంది.
ఈ ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వహించే పోలీసులు, హోంగార్డులు, దేవాదాయ శాఖ డెప్యూటేషన్ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి పంపిణీ చేసే భోజన ప్యాకెట్ల కాంట్రాక్టు వ్యవహారం ఆదివారం కొత్త మలుపు తిరిగింది. దేవస్థానం ఈ నెల12న టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లకు అర్హతల్లేవనే సాకుతో ఆ టెండర్లను ఆలయ అధికారులు రద్దు చేశారు. మళ్లీ శనివారం నాటికి షార్టు టెండర్లు పిలవగా మొత్తం 10 మంది కాంట్రాక్టర్లు దాఖలు చేశారు.
శనివారం తెరవాల్సిన టెండర్లను ఆలయ అధికారులు పలు కారణాలను సాకుగా చూపించి ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం టెండరు బాక్స్‌ను తెరిచిన అధికారులు నిబంధనలను తోసిరాజని అనర్హులకు కాంట్రాక్టు అప్పగించారు. గతంలో ఏ కారణాలతో టెండరును రద్దు చేశారో.. ఇప్పుడు వాటినే విస్మరించారు. అంతేకాదు, తాజాగా మార్పు చేసిన నిబంధనలను గాలికి వదిలేశారు. టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు తమతమ స్థాయిల్లో ఈవోపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ టెండర్లను మూడు సెక్టార్లుగా పిలిచారు. ఓ హోటల్ పేరుతో బినామీ వ్యక్తికి, పోలీసు కేసు ఉన్న ఆలయ కాంట్రాక్టర్‌కు టెండరు కట్టబెట్టారు. సెక్టార్-1లో పోలీసు అధికారులు, హోంగార్డులకు భోజన ప్యాకెట్లు సరఫరా చేసేందుకు నగరంలోని ఓ హోటల్ పేరుతో టెండరు దాఖలు చేసిన వ్యక్తి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలిసింది. ఇందుకు ఆలయ అధికారులపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఉన్నతాధికారి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆలయంలో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వ్యక్తికే మరో సెక్టార్‌లో టెండర్ మంజూరు చేశారు. ఇటీవలే ఆయనపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది.
అయితే ఆ స్టేషన్ అధికారులే ఆ కాంట్రాక్టర్‌కు మద్దతుగా నిలవడం విశేషం. టెండర్ల పక్రియ అంతా నీకిది... నాకిదీ అనే పద్ధతిలో కొనసాగినట్లు తెలుస్తుంది. మొదటి సెక్టార్‌కు గ్రీన్ పార్కు హోటల్, రామిశెట్టి ప్రసాద్, వంశీధర్‌లు టెండర్లు దాఖలు చేశారు. సెక్టార్-2కు కె. లక్ష్మణరావు, సాయిదుర్గ టెండర్లు దాఖలు చేశారు. మూడో సెక్టార్‌కు రవికుమార్, రామిశెట్టి ప్రసాద్, వంశీధర్‌లు టెండర్లు వేశారు. మొదటి సెక్టార్‌కు గ్రీన్ పార్కు హోటల్ పేరుతో టెండరు దాఖలు చేసిన కాంట్రాక్టర్ షెడ్యూల్ ఫారమ్‌పై సంతకాలు చేయనప్పటికీ..టెండర్లు తెరిచిన సమయంలో ఆలయ అధికారుల సమక్షంలోనే పోలీసాఫీసరు సంతకాలు చేయించడం విశేషం. ఇక సెక్టార్-2 కె. లక్ష్మణరావుకు, సెక్టార్-3ని రవికుమార్‌కు కేటాయించారు. భోజన ప్యాకెట్‌కు రూ. 111.90కు టెండరు దాఖలు చేయగా, దానిని తగ్గించాలని ఆలయ అధికారులు కోరడంతో రూ. 111.50లకు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు.
నాణ్యత ప్రమాణాల పై అనుమానం
దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఆహార ప్యాకెట్లు అందించడ ంలో దేవస్థానం పలుమార్లు అపహస్యం పాలైంది. తక్కువ రేటుకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టులు భోజనాన్ని సరిగా పంపిణీ చేయలేదు. దీంతో నాసిరకం టిఫెన్లు, భోజనం పంపిణీ చేస్తున్నారంటూ సిబ్బంది ఆహారం మొత్తాన్ని పారవేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. చివరకు ఆలయ ఈవో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. టెండర్లు జారీ చేసేటప్పుడే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఉత్సవాల్లో సిబ్బంది పస్తులు ఉండాల్సిన అవసరం తలెత్తకపోచ్చు!
బినామీలకు దసరా ‘పండగ’
Published Mon, Sep 23 2013 12:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement