రాజీ కుదిర్చిన కీలకనేత మనిషి
రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో చర్చలు
పెద్ద చేపలు చిక్కకుండా యత్నాలు
రికవరీ చేసేందుకు రంగం సిద్ధం
తలా కొంత చెల్లించేందుకు అంగీకారం
కమిషనర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మొత్తం మీద ఒంగోలులోని ఎలైట్ మాల్స్‌లో రూ.2.35 కోట్ల గోల్‌మాల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా సరికొత్త డ్రామాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అధికార టీడీపీకి చెందిన కీలక నేత రంగప్రవేశం చేసి రమణ ఎపిసోడ్‌కు ముగింపు పలికేందుకు తెరవెనుక మంత్రాంగం జరుపుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఎక్సైజ్ శాఖలో రూ.2.35 కోట్ల ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన దొంగలెవరో తేల్చకుండానే కేసు నీరుగారిపోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జిల్లా తెలుగు దేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక నాయకుడి తరఫున టంగుటూరు నుంచి వచ్చిన పెద్ద మనిషి రెండు రోజులుగా ఇక్కడే తిష్టవేసి జిల్లాలోని పలువురు ఎక్సైజ్ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిసింది.
పోయిన సొమ్మును రికవరీ చేయడం ద్వారా ఎవరి చేతులకు మట్టి అంటకుండా బయటపడేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. కేసు నమోదైతే రమణ మాత్రమే కాకుండా అతడికి సహకరించిన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, సేల్స్‌మెన్లకు కూడా శిక్ష పడడం ఖాయమని నచ్చ చెప్పారు. ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఈ కేసు నుంచి బయటపడేందుకు తలా ఒక చేయి వేసేలా ఒప్పందం కుదిర్చారు.
ఈ రాజీ ప్రకారం కేసులో ప్రధాన నిందితుడైన రమణ 60 శాతం డబ్బులు చెల్లించేలా, మిగతా సొమ్మును ఇంతకు ముందు ఇక్కడ పనిచేసివెళ్లిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి, సేల్స్‌మెన్లు వేసుకొని చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు ఎక్సైజ్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలతో సదరు పెద్ద మనిషితో కలసి కొందరు మంగళవారం ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్‌ను కలిసేందుకు విజయవాడ వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ ఆయనను కలిసేందుకు కుదరకపోవడంతో కమిషనర్ కార్యాలయంలో ఇతర అధికారులను కలిసి మాట్లాడి వచ్చినట్లు చెబుతున్నారు. రేపో మాపో కమిషనర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలిసి రికవరీ చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తలా పాపం తిలా పిడికెడు...
ముందు నుంచి అనుకున్నట్లే భారీ మొత్తంలో ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ మీద పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కేసులో ప్రధాన పాత్రధారిగా చెప్పుకుంటున్న రమణ పరారైనా ఉలుకు లేదు పలుకు లేదు. అతను పరారీలో ఉన్నాడని చెబుతున్నారే కానీ పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ఈ కేసులో రమణతోపాటుగా మిగిలిన ఉద్యోగుల పాత్రపై విచారణ చేసినట్లు కూడా కనిపించలేదు. రమణ భాగోతంపై ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసిన సేల్స్‌మెన్లు కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేశారు. రమణను అరెస్టు చేయాలని వారు ఆందోళన చేసినా అధికారుల నుంచి పెద్దగా స్పందనలేదు.
పెద్ద చేపల సంగతేంటి...
ఈ కేసు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్సైజ్ శాఖలో చిరుద్యోగి అయిన కానిస్టేబుల్ రమణ ఒక్కడే ఈ అక్రమానికి పాల్పడడం అంత సులువుకాదని తెలుస్తోంది. పెద్ద చేపల ప్రోత్సాహంతోనే ఆయన కోట్ల రూపాయల స్కాంకి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎస్‌ఐ, సీఐల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. నిబంధనలకు మించి స్టాకు సరఫరా చేసిన డిపో మేనేజర్ గురించి కూడా అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసు నమోదైతే వారందరూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందన్న భయంతోనే ఎక్సైజ్ శాఖ ఉన్నతోద్యోగులంతా ఒక్కటయ్యారు. తలా కొంచెం వేసుకొని గట్టుమీద పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment