• దక్షిణ కాలువ ఆధునీకరణ టెండర్లలో గోల్‌మాల్
• రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా ‘ముఖ్య’నేత మంత్రాంగం
• టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాక బిడ్ కెపాసిటీ పెంచుతూ ఉత్తర్వులు
• రూ.101.61 కోట్ల అంచనాలు రూ.421.87 కోట్లకు పెంపు
• రూ.320.26 కోట్లు కొట్టేయడానికి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి
అయినవారి కోసం ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, ప్రజా ధనాన్ని పంచడంలో ఆ ముఖ్య నేతది పెద్ద చేయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల పేరుతో ‘కోటరీ’కి పెద్ద ఎత్తున సంపాదించి పెట్టిన ఆయన ఇప్పుడు వంద కోట్ల ప్రాజెక్టును 400 కోట్లకు పైగా పెంచేసి, మరోసారి ప్రజాధనాన్ని ఓ రాజ్యసభ సభ్యుడి జేబులో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే అనంతపురం జిల్లాలోని మధ్య పెన్నార్ దక్షిణ కాలువ అభివృద్ధి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే కొంత వరకు పూర్తయ్యాయి. రూ. 101 కోట్ల విలువైన పనులు మిగిలాయి. కానీ, ఈ పనులను తన వారికి కట్టబెట్టడానికి పాత కాంట్రాక్టర్లను తొలగించి, నిబంధనలు కూడా మార్చేసి, అంచనాలను మూడున్నర రెట్లు పెంచి, టెండర్లు పిలిచారు. సోమవారం ఉదయం 11 గంటలకు టెండర్ల షెడ్యూళ్ల దాఖలు గడువు ముగిసింది. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు టెక్నికల్ బిడ్, 25న సాయంత్రం ఐదు గంటలకు ప్రైస్ బిడ్ తెరవడం.. రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు కట్టబెట్టడం.. కమీషన్లు పంచుకోవడమే ఇక తరువాయి.
ఖర్చు పెరగకపోయినా, అంచనా పెరిగిపోయింది
మధ్య పెన్నార్ దక్షణ కాలువ ఆధునీకరణ పనులు 2007లో ప్రారంభమయ్యాయి. 43వ ప్యాకేజీ పనులను రూ.66.43 కోట్లకు ఈసీఐ–బీజేసీఎల్(జేవీ), 44వ ప్యాకేజీ పనులను రూ.50.45 కోట్లకు జీహెచ్‌ఆర్‌ఏ–కేఆర్‌సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. 43వ ప్యాకేజీలో రూ.8.15 కోట్లు, 44వ ప్యాకేజీలో రూ.7.07 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. ఈ రెండిట్లో కలిపి రూ.101.61 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఇక్కడే ప్రభుత్వ పెద్దలు మంత్రాంగానికి తెర తీశారు. పాత కాంట్రాక్టర్లపై వేటు వేశారు. రూ.58.28 కోట్లతో పూర్తయ్యే 43వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.237.23 కోట్లకు, రూ.43.33 కోట్ల విలువైన 44వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.184.64 కోట్లకు పెంచేస్తూ మళ్లీ టెండర్లు పిలిచారు.
ఈ రెండు ప్యాకేజీల అంచనా వ్యయం ఇప్పుడు 421.87 కోట్లకు పెరిగింది. అంటే అంచనా వ్యయం రూ. 320.26 కోట్లు పెరిగింది. పైగా, గతంతో పోలిస్తే ఇప్పుడు స్టీల్, సిమెంట్ ధరలు తగ్గాయి. డీజిల్, పెట్రోల్ ధరల్లోనూ పెద్దగా మార్పు లేదు. ఇప్పుడు ఇసుక ఉచితంగానే లభిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకొంటే ఖర్చులో మార్పేమీ ఉండదు. అయినా అంచనా వ్యయాన్ని మూడున్నర రెట్లు పెంచారంటే దీని వెనుక ఉన్న కమీషన్ల బాగోతాన్ని అర్థం చేసుకోవచ్చు.
కోటరీలోని ఎంపీ కోసమే..!
అధికార పార్టీ కోటరీలోని ఓ రాజ్య సభ సభ్యునికి టెండర్ కట్టబెట్టడానికే ఈ తతంగమంతా నడిచినట్లు విశ్వసనీయ సమాచారం. ముందస్తు వ్యూహంలో భాగంగా తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడికి చెందిన సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ) అధికారులను ఆ ముఖ్య నేత ఆదేశించారు. దీంతో అన్ని నిబంధనాలూ మారిపోయాయి. వాస్తవానికి కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేలా టెండర్ నియమావళిలో ప్రధానమైన బిడ్ కెపాసిటీని ఏఎన్2–బీ నుంచి ఏఎన్3–బీకి పెంచుతూ నెల కిత్రమే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ ఉత్తర్వులు జారీ చేస్తే మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునీకరణ పనులకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీపడే అవకాశం ఉంది.
ఇదే జరిగితే పనులు ఎంపీకి చెందిన సంస్థకు దక్కకపోవచ్చు. దీంతో బిడ్ కెపాసిటీని పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ పెద్దలు నిలిపివేయించారు. మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునీకరణ టెండర్ నోటిఫికేషన్‌ను ఈ నెల 6న జారీ చేశారు. ఆ తర్వాత అంటే.. ఈ నెల 10న బిడ్ కెపాసిటీని పెంచుతూ ఉత్తర్వులు (జీవో నం.13)ను జారీ చేశారు. దీనివల్ల దక్షిణ కాలువ పనులు ఎంపీకి చెందిన సంస్థకు దక్కేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల పనులను జాయింట్ వెంచర్ సంస్థలే చేస్తున్నాయి. కానీ, మధ్య పెన్నార్ కాలువ ఆధునీకరణ పనులకు వచ్చేసరికి జాయింట్ వెంచర్ సంస్థలకు అర్హత లేదని నిబంధన పెట్టారు. నిర్మాణ రంగం కుదేలవడం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ (సీడీఆర్), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్‌డీఆర్)లను అమలు చేశాయి. కానీ, సీడీఆర్, ఎస్‌డీఆర్‌లను అమలు చేసిన సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేదని తిరకాసు పెట్టారు. దీని ద్వారా ప్రముఖ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనే అర్హత కోల్పోయాయి.
ఇదేమి మతలబు?
దక్షిణ కాలువ ఆధునీకరణ పనుల టెండర్లలో ప్రభుత్వం విధించిన మరో నిబంధన అధికారులనే కంగు తినిపించింది. రూ.237.23 కోట్ల విలువైన 43వ ప్యాకేజీ పనులను 42 నెలల్లో పూర్తి చేయడానికి నిర్మాణ సంస్థకు బ్యాంకులో రూ.17 కోట్లు నగదు నిల్వ ఉంటే చాలట! రూ.184.64 కోట్ల విలువైన 44వ ప్యాకేజీ పనులను 42 నెలల్లో పూర్తి చేయడానికి మాత్రం బ్యాంకులో రూ.23.01 కోట్లు నగదు నిల్వ ఉండాలట! ఎక్కువ విలువైన పనులకు తక్కువ మొత్తంలో బ్యాంకు నిల్వలు, తక్కువ విలువైన పనులకు ఎక్కువ నగదు నిల్వలు ఉండాలన్న నిబంధన సర్కారు చిత్రమైన వైఖరికి నిదర్శనమని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.