పోలవరం ఎడమకాలువ పనుల వేదికగా మళ్లీ టెండ‘రింగ్’ ఆరంభం
ముఖ్యనేత కనుసన్నల్లో టెండర్ నోటిఫికేషన్‌కు ముందే పనుల పంపిణీ
రూ.293.66 కోట్ల విలువైన ఐదో ప్యాకేజీ పనులు వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యే సంస్థకు!
రూ.317.77 కోట్ల విలువైన ఆరో ప్యాకేజీ పనులుమిత్రపక్ష ఎంపీ కుమారుడికి
రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన రెండు ప్యాకేజీ పనులు ఇద్దరు ఆస్థాన కాంట్రాక్టర్లకు
నాలుగు ప్యాకేజీ పనులకూ అంచనా విలువ కంటే అధిక ధరకు కట్టబెట్టేందుకు స్కెచ్
యథాప్రకారం ఖజానాపై భారం మోపి కమీషన్ల వసూలుకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.
పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు.
6న ఫైనాన్స్ బిడ్
పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.
ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.
ఖజానా దోపిడీకి రంగం సిద్ధం
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment