ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు | CM YS Jagan Plans On Irrigation Projects In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు

Published Sat, Sep 19 2020 10:54 AM | Last Updated on Sat, Sep 19 2020 11:08 AM

CM YS Jagan Plans On Irrigation Projects In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్‌లు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్మాణంలో ఉన్న వాటిని రూ.84092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి రూ.72458 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తుంది.

ఓ వైపు పోలవరం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు చేయిస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఇతర ప్రాజెక్ట్లపైన అదే విధంగా దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్ట్లో కుడి, ఎడమ కాలువులు గతంలోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తయ్యాయి. ప్రధాన జలాశయ నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తుండడంతో గతంలో పనిచేసిన సంస్థను ప్రభుత్వం రద్దు చేసి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)కు అప్పగించిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి దాకా మొత్తం ప్రాజెక్ట్లో 71.46 శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ లలో ఎంఈఐఎల్ పనిచేపట్టిన తరువాత 2.80 లక్షల ఘనపు మీటర్ల పని ఆరు నెలల కాలంలో జరిగింది. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం గోదావరికి వరదలు ఉన్నప్పటికీ పనులు ఆగకుండా స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు. వరద తగ్గిన తరువాత అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలతో పాటు స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్లను గ్యాప్ - 1,2,3 పనులను ఎంఈఐఎల్ ఏకకాలంలో చేపడుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ర్టంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్ట్ లను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు.

ప్రాజెక్ట్ల పూర్తికి నిధుల కొరత ప్రధాన అవరోధం కానుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎసస్పీవీలను ఏర్పాటు చేశారు. అందులో ఎస్పీవీ-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39980కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ-2 కింది ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తిచేయడానికి ఐదేళ్ల కాలంలో రూ. 8787 కోట్లు ఖర్చు చేస్తారు. ఎస్పీవీ - 3 ద్వారా ఏపి రాష్ర్ట నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12702 కోట్లు ఐదేళ్ల కాలంలో సమీకరించనున్నారు. ఎస్పీవీ-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా - పెన్నాల అనుసంధానం కోసం రూ.7636కోట్లు ఐదేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు. ఎస్పీవీ-5 కార్యక్రమం క్రింద కృష్ణా-కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3356 కోట్లు సమీకరిస్తారు. సాగునీటి ప్రాజెక్ట్లకు నిధుల సమీకరణకు ఎస్పీవీలు ఏర్పాటు చేయడం అరుదైనది కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టుదల వల్ల వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లను పరుగులు పెట్టించి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఐదేళ్ళలో రూ. 39980 ఖర్చు..
ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు పరుగులు పెట్టించాలన్నారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని అలాగే ఆ ప్రాజెక్ట్ ల్లో నీరు నిండితే ఆయా ప్రాంత రైతులు ఉపయోగకరం అన్న విషయంపై రైతులకు నచ్చచెప్పి, అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని, ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తయిందని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగించేలా పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి..
ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నరు. వంశధార–నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని పట్టుదలతో ఏపి ప్రభుత్వం ఉంది. వంశధార స్టేజ్‌–2 సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో చర్చించాల్సి ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే 24,600 ఎకరాలకు నీరందుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు  అధికారులు తెలిపారు. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు.  సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement