సాక్షి, విజయవాడ: ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. గతంలో ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు పవన్‌ను మేము ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలుగు వారి ఆత్మగౌరవం మరో మారు ఢిల్లీలో తాకట్టుపెట్టారు. ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. 41.5 ఎత్తులో మీటర్లకు నీటిని పరిమితం చేయడం అన్యాయం. 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టు ప్రయోజనం ఉంటుంది. ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నించారు. పవన్‌ను మేం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?.
వైఎస్ జగన్ కేంద్రం ఒత్తిడికి తలొంచి ఉంటే 12,500 కోట్లు పోలవరానికి ఎప్పుడో వచ్చేవి. కానీ, పోలవరానికి అన్యాయం జరగకూడదని జగన్ ఒప్పుకోలేదు. కేంద్రంలో చంద్రబాబు ప్రభావమేమీ లేదు. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి. దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మాతో కలిసి రండి. పోలవరం హక్కులను సాధించుకోలేకపోతే మీరంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారు. అమరావతి విషయంలో కూటమి నేతలు ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అమరావతికి 15వేల కోట్లు ముష్టివేశారు. ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి అమరావతికి అప్పు తెచ్చారు.
ఉత్తర భారత అహంకారం నశించాలన్న మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా?. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గొంతు చించుకున్నారు. యువతకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నవాళ్లు ఆంధ్రా ద్రోహులే. ఉత్తర భారత బీజేపీ పార్టీ మనకు తీరని ద్రోహం చేస్తోంది. తెలుగు జాతి ఇప్పటికైనా మేలుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment