41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ఏ పనులు చేస్తారు?.. ఖర్చెంత?
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం (41.15 మీటర్ల కాంటూర్) స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు, వాటికి ఎంత ఖర్చవుతుంది, ఎప్పుడు ఎంత విడుదల చేయాలో సమగ్ర ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది.
పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో చర్చించి ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ ఇటీవల లేఖ రాశారు. - సాక్షి, అమరావతి
నాడు మోకాలడ్డిన చంద్రబాబు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు, విభాగాల వారీగా పరిమితి విధించకుండా బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేసేందుకు విభాగాల వారీగా విధించిన పరిమితి ఎత్తేశారు. తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు అంగీకరించారు.
తొలి దశ పూర్తికి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో తొలి దశ పనులు పూర్తి, చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ధ్వంసమైన గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. ఈ క్రమంలో పోలవరం తొలి దశ వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జల్ శక్తి శాఖ ఖరారు చేసింది. 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్లు పోనూ రూ.25,706.24 కోట్లు ఇవ్వాలని నిర్ధారించింది.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో రెండో దశ కింద చేపట్టిన పనులకు రూ.1,597.56 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు పోనూ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని తేల్చింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది.
అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్‌డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్ ఆగస్టు 28న ఆమోదం తెలిపింది.
నిధుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన వైఎస్ జగన్
విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో 2016 సెప్టెంబరు 7న సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం మాత్రమే ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించారు.
బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న ప్రతిపాదనకూ తలూపారు. 2013–14 ధరల ప్రకారం పాజెక్టు వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా లెక్కగట్టి.. 2024 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిజానికి 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లు. ఇందులో భూసేకరణ, పునరవాసానికే నికే రూ.33,168.23 కోట్లు అవసరం. కానీ.. రూ.15,667.9 కోట్లు ఇస్తే చాలు ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో లోగుట్టు కమీషన్లే. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు విధ్వసం చేయడమే కాదు.. నిధుల సంక్షోభంలోకి కూడా నెట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులను పరుగులు పెట్టించారు.
ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్వాకాలను కేంద్రానికి వివరించారు. తాజా ధరల ప్రకారం నిధులిస్తేనే పోలవరాన్ని పూర్తి చేయడానికి సాధ్యమవుతుందన్న వైఎస్ జగన్ ప్రతిపాదనతో ప్రధాని మోదీ ఏకీభవించారు. ఇలా తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా నిధుల సంక్షోభం నుంచి పోలవరాన్ని వైఎస్ జగన్ గట్టెక్కించారు.
» గతేడాది జూన్ 5నే తొలి దశ, డయాఫ్రం వాల్‌కు రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
» ఈ వివరాలను సమగ్రంగా పీపీఏ ద్వారా పంపండి
» అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్‌డీఏలో చేరిన చంద్రబాబు చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేస్తాం
» పోలవరానికి ఆ నిధులిస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని విన్నపం
» రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడి
» దాంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్
» రూ.12,157.53 కోట్లు విడుదలకు మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జలశక్తి శాఖ ప్రతిపాదన
» అదే ప్రతిపాదనపై ఆగస్టు 28న ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment