
జూన్‌లో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలిస్తామన్న సీఎం చంద్రబాబు
9 నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తని దుస్థితి
2024–25 బడ్జెట్‌లో రూ.79.97 కోట్లు కేటాయింపు
ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని వైనం
పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కులతో చేపట్టిన వైఎస్సార్
2009 జనవరి 2న ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అంకురార్పణ
ఆయన హఠాన్మరణంతో కదలని పనులు
2019 ఎన్నికలకు ముందు తొలి దశ పనులు చేపట్టకుండానే చేతులెత్తేసిన టీడీపీ సర్కార్
రూ.17,411 కోట్లతో 2022లో పనులు చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్
రెండు దశల పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత.. డిజైన్‌లన్నీ 2023 నాటికే ఆమోదం
పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు.. కూటమి ప్రభుత్వం రాగానే గ్రహణం
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తిని తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి గ్రహణం పట్టింది. తొమ్మిది నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ పథకం పనులకు 2024–25 బడ్జెట్‌లో రూ.79.97 కోట్లు కేటాయించినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు.
ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అప్పట్లో టెండర్లు కూడా పిలిచారు. కానీ.. వైఎస్సార్ హఠాన్మరణంతో ఆ పథకం పనులు ముందుకు సాగలేదు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2019 ఎన్నికలకు ముందు ఈ పథకం తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టి, 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ రూ.17,411 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు.
తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కి.మీ నుంచి 23 కి.మీల పొడవున కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.954.09 కోట్లతో, రెండో దశలో పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కి.మీల పొడవున ప్రధాన కాలువ, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు.
వీటికి అనుబంధంగా నిర్మించాల్సిన భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్‌ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనులు చేపట్టడానికి అవసరమైన డిజైన్‌లు అన్నింటినీ 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. దాంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులు చేపట్టేందుకు 3,822 ఎకరాలు, రెండో దశ పనులు చేపట్టేందుకు 12,214.36 ఎకరాల సేకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చారు.
ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు నిలిచిపోయాయి. 2025 జూన్ నాటికే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలిస్తామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో ప్రకటించారు. 2024–25 బడ్జెట్లో ఈ పథకానికి రూ.63.02 కోట్లు తొలుత కేటాయించారు. ఆ తర్వాత సవరించిన బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.79.97 కోట్లు కేటాయించారు.
కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తొమ్మిది నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2025–26 బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.605.75 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయని నేపథ్యంలో.. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేస్తారా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా..
» వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 162.409 కి.మీ నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లా పాపయ్యపాలెం వరకు 23 కి.మీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
» పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, 106 కి.మీల పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 14 కి.మీ నుంచి తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
» ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ (వీరనారాయణ) పురం వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
» ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
» ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు. మొత్తంమీద ఈ పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షలు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment