Godavari waters
-
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కాళేశ్వరం ఖర్చు రూ.93,872.07 కోట్లు ..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశారు. మొత్తం రూ.1,27,872.28 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు రూ.93,872.07 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ద్వారా సమీకరించిన రూ.61,665.20 కోట్ల రుణాలతోపాటు రూ. 32,206.87 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందులో ఉన్నాయి. కాళేశ్వరం కింద 18,64,970 ఎకరాల మిగులు ఆయకట్టును 2028–29 నాటికి అభివృద్ధి చేసేందుకు గత ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై మంత్రుల బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు అర్ధంతరంగా విరమించుకున్నారు? ఆ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచి్చంది? వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, నిధుల సమీకరణ, విద్యుత్ అవసరాల విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలేంటి? మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో తలెత్తిన లోపాలు, సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలతో నీటిపారుదల శాఖ పీపీటీని సిద్ధం చేసింది. వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు ఇప్పటివరకు తీసుకున్న రుణంలో అసలు రూ.4,696.33 కోట్లు మాత్రమే చెల్లించగా, గత ఐదేళ్లలో వడ్డీలు రూ.16,201.94 కోట్లు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి రూ.21,157.87 కోట్లు చెల్లించా రు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైనపాలమూరు–రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్రూ.7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గత మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించగా, అసలు చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు. 17.08 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజ్–1కి సంబంధించిన పాత ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్–2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పాత ఆయకట్టుకు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించారు. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రులకు నివేదించనుంది. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ–1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ 2020–21 రబీ నుంచి 2023–24 ఖరీఫ్ వరకు కుందెల్లి వాగు, హల్దివాగు, 66 చెక్‌డ్యామ్‌ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు. -
అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?
సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాటను చెప్పకనే చెప్పుకున్నారు. నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తిపోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్‌పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? అసలు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు. బేసిన్లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్‌చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలాలతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు చేరింది. కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భాల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది. డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పుబెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది. నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వరమని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలాంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయాల్సిందే. పట్టిసీమకు పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీపై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. దీన్ని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు అప్పుడూ, ఇప్పుడూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్కరించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు. -
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్‌గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
గోదావరి నికర జలాల్లో మిగులే లేదు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది నికర జలాల్లో మిగులు లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి న నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఎలా చేపడతారని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖల అధికారులు నిలదీశారు. గోదావరి బేసిన్లో రెండు రాష్ట్రాల్లో పూర్తయిన, నిర్మాణం , ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకే 306 టీఎంసీల మేర నికర జలాల కొరత ఉందని సీడబ్ల్యూసీ తేల్చి న అంశాన్ని ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తరలిస్తే రాష్ట్రాల్లో ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ స్పందిస్తూ.. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేని మాట వాస్తవమేనని అంగీకరించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపడతామని చెప్పడంతో ఛత్తీస్‌గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మా కోటా నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని తేల్చిచెప్పారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 71వ పాలక మండలి సమావేశం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందరసింగ్ వోరా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, సీఈ రమేశ్, అంతర్రాష్ట్ర విభాగం డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుసంధానానికి సిద్ధమన్న ఎన్‌డబ్ల్యూడీఏ గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీ లను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించడానికి రూపొందించిన గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. ఇందులో తెలంగాణకు 45, ఏపీకి 44, తమిళనాడుకు 40, కర్ణాటకకు 9.9, పుదుచ్చేరికి 2.1 టీఎంసీలు ఇస్తామని పేర్కొన్నా రు. దీనిపై ఇప్పటికే నాలుగుసార్లు రాష్ట్రాలతో సంప్రదింపు లు జరిపామని.. అనుసంధానం పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ చెప్పడంతో ఏపీ, తెలంగా ణ, ఛత్తీస్‌గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుసంధానానికి అంగీకరించమన్న ఛత్తీస్‌గఢ్ కోటా నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతున్నామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మీరు ప్రాజెక్టులు కట్టేలోగా మహానది నుంచి గోదావరికి జలాలను తరలిస్తామని.. వాటిని కావేరికి తీసుకెళ్తామని ఛత్తీస్‌గఢ్ అధికారులకు ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ సర్దిచెప్పబోగా ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానది నుంచి గోదావరికి జలాలను తెల్చి నా సరే.. రెండు రాష్ట్రాల అవసరాలు తీర్చాకే కావేరికి గోదావరిని తరలించాలని తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కల్పించేలా చేపట్టే గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు జారీ చేసిన తర్వాతే నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్ సమ్మతి తర్వాతే... అన్ని రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి రాతపూర్వక సమ్మ తి తీసుకున్న తర్వాతే అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని, అనంతరం డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఖరారు చేసి సంబంధిత రాష్ట్రాలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. -
మల్కపేట రెండో పంపు వెట్‌రన్ సక్సెస్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల శివారులోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా 12.03 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. మల్కపేట వద్ద రూ.504 కోట్లతో మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లోకి 30 మెగావాట్ల పంపుతో సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోశారు. మే 23న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. తాజాగా రెండో పంపు వెట్‌రన్‌ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు ప్రారంభించి 1.40 గంటల వరకు కొనసాగించారు. ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రకటించారు. రెండో పంపు ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో మంత్రి కె.తారక రామారావు ఇంజనీర్లను అభినందించారు. దీంతో కాళేశ్వరం 9 ప్యాకేజీ తొలి దశ పూర్తయిందని అధికారు లు తెలిపారు. సిరిసిల్ల మధ్యమానేరు జలాశయం నీరు 12 కిలోమీటర్లు సొరంగం ద్వారా ప్రయాణించి ధర్మారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌కు చేరాయి. ఆ నీటిని రెండో పంపు ద్వారా మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, 9వ ప్యాకేజీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ జి.శ్రీనివాస్‌రెడ్డి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కాళేశ్వరం 9వ ప్యాకేజీలో రెండు పంపుల వెట్‌రన్ విజయవంతం కావడంతో ఈ పంపులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 –20 రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా 9వ ప్యాకేజీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ఎల్లారెడ్డిపేటలో ప్రకటించారు. దీంతో మధ్యమానేరు నుంచి ఏడాదిలో 120 రోజులపాటు 11.635 టీఎంసీల నీటిని రెండు మోటార్లతో ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్‌ను నింపి.. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సింగసముద్రం మీదుగా బట్టల చెరువు, నర్మాల ఎగువమానేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చనున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉండే వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతారు. ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 96,150 ఎకరాలకు సాగునీరు అందనుంది. వానాకాలంలో 12వేల ఎకరాలకు మల్కపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని భావిస్తున్నారు. 9 డి్రస్టిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. -
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్/అచ్చంపేట: కృష్ణా, గోదావరి, వంశ ధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగు తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,44,414 క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 35,199 క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15.18 అడుగు లకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరి కను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,362 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 14 వేలు, హంద్రీ– నీవా నుంచి 1,688, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వచేస్తూ మిగులు జలాలు 3,17,460 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత పెరగనుంది. ► నాగార్జునసాగర్‌లోకి 3,13,500 క్యూసెక్కులు చేరుతోంది. ప్రధాన కేంద్రంలో 16 గేట్లను 5 అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,60,316 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 584.9 అడుగుల్లో 297.14 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,093 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.55 అడుగుల్లో 37.72 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరదకు పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 3,36,032 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 3.22 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగు తోంది. భద్రాచలం నుంచి పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,53,414 క్యూసెక్కులు చేరుతుండగా 14,44,414 క్యూసెక్కులను 165 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధారలో పెరిగిన వరద ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు గొట్టా బ్యారేజ్‌లోకి 36,925 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 35,199 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకిస్తూ అక్కడి భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 63.20 టీఎంసీలను తరలించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు ఆ ప్రాంత పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,411.40 కోట్లు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి దశ పనులను రూ.954.09 కోట్లతో రెండు ప్యాకేజీలుగా, రెండో దశ పనులను రూ.5,134 కోట్లతో రెండు ప్యాకేజీలుగా కాంట్రాక్టర్లకు అధికారులు అప్పగించారు. రెండో దశలో మిగతా నాలుగు ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. పనులకు శ్రీకారం ► తొలి దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా 18.90 కి.మీ. మేర కాలువ, రెండుచోట్ల ఎత్తిపోతలు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టారు. ► రెండో దశలో పాపయ్యపల్లె ఎత్తిపోతలతోపాటు 121.62 కి.మీ. పొడవున కాలువ తవ్వకం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. భూసేకరణకు సమాంతరంగా పనులు తొలి దశ పనులు చేపట్టడానికి 3,822 ఎకరాల భూమి అవసరం. రెండో దశ పనులు చేపట్టడానికి 12,214.36 ఎకరాలు వెరసి 16,036.36 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో ప్రస్తుతం కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు చేపట్టడానికి వీలుగా భూసేకరణ చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులు దిశానిర్దేశం చేశారు. -
కరువు నేల పరవశం!
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: కరువు నేల పరవశిస్తోంది. పడావు పడ్డ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల తండ్లాటను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చింది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ దాకా గోదావరి జలాలు ఉరకలు వేస్తున్నాయి. మండుటెండల్లోనూ చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. వర్షం వస్తేనే పారే కూడవెల్లి, హల్దీ వాగులు ఇప్పుడు కొత్త నడక నేర్చుకున్నాయి. ఇన్నాళ్లూ వలసలు పోయిన రైతులు.. తిరిగి సొంతూళ్లకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు గ్రామాల్లో ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి విశేషాలెన్నో బయటపడ్డాయి. ఈ అంశాలతో ప్రత్యేక కథనం.. సిద్దిపేట జిల్లా బూర్గుపల్లిలో గోదావరి జలాల డిస్ట్రిబ్యూటరీ కెనాల్ గోదావరి పరుగులతో.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు.. వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా రంగనాయసాగర్కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్‌కు చేరుతున్నాయి. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని 2.2 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా చెరువులను నింపుతున్నారు. దుబ్బాక కెనాల్ ద్వారా తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని 36 చెరువులకుగాను ఇప్పటికే 18 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. మరో 18 చెరువులు మూడు, నాలుగు రోజుల్లో నిండనున్నాయి. ఇక 32 చెక్ డ్యాంలకు గాను రెండు పూర్తిగా నిండగా, మరో 30 వారం రోజుల్లో నిండే అవకాశముంది. ఈ చెరువులు, చెక్ డ్యాంల నుంచి చిన్నకాల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందుతోంది. చెరువులు నిండుగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గతంలో ఎండకాలం మొదలవుతుందంటేనే బోర్లు,బావులు ఎండిపోయేవని.. ఇప్పుడు బాగా నీళ్లు ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలతో.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదని.. ఇప్పుడు గోదావరి నీళ్లు రావడంతో రెండు పంటలను సాగు చేస్తున్నామని స్థానిక రైతులు చెప్తున్నారు. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ మధ్య ఉన్న 11 (ఇమాంబాద్, గాడిచర్లపల్లి, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఎన్సాన్పల్లి, వెంకటాపూర్, తడ్కపల్లి, బండారుపల్లి, ఘన్పూర్, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్) గ్రామాల్లో 2019–20 యాసంగిలో 6,134 ఎకరాల్లో సాగు జరగగా.. ఈసారి 9,389.25 ఎకరాలు సాగైంది. గతంలో కంటే దిగుబడి సైతం పెరిగిందని రైతులు అంటున్నారు. కొండపోచమ్మ దారిలో.. మల్లన్నసాగర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ వరకు కాల్వల ద్వారా గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ కాల్వ వెంట ప్రధానంగా మంగోల్, తిప్పారం, రాంచంద్రాపూర్, కొడకండ్ల, రిమ్మనగూడ, దాతర్పల్లి, కోనాపూర్, అక్కారం, శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, పాతూరు, పాములపర్తి, మర్కూక్ గ్రామాలు ఉన్నాయి. కొడకండ్ల బ్రిడ్జి వద్ద ఆనకట్ట కట్టి నీటిని వదులుతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సాగుకు నీళ్లు అందిస్తున్నారు. కూడవెల్లి, హల్దీకి కొత్త కళ గోదావరి జలాల పుణ్యామాని సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి, హల్దీవాగులు మండువేసవిలోనూ పరవళ్లు తొక్కుతున్నాయి. కూడవెల్లి వాగు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో 80 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ వాగుపై మర్కుక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, జగదేవ్‌పూర్, ఇటిక్యాల, అలిరాజపేట, తీగుల్, గజ్వేల్ మండలం అక్కారం, కొడకండ్ల, బూర్గుపల్లి, రిమ్మనగూడ సింగాటం, అహ్మదీపూర్ గ్రామాల పరిధిలో చెక్‌డ్యామ్‌లు, రాచకట్ట రిజర్వాయర్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ వాగు పరిధిలో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతూ వచ్చాయి. గతేడాది వేసవిలో కొండపోచమ్మ సాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో వాగు జలకళ సంతరించుకుంది. పంటలకు కష్టం తప్పింది. అదే తరహాలో ఈసారి ఈ నెల 19న నీటిని విడుదల చేశారు. ►గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రామాయంపేట మండలాల మీదుగా ప్రవహించి మంజీరా నదిలో కలిసే మరో ప్రధాన వాగు హల్దీ. దీనిపై ఖాన్ చెరువు వద్ద జలాశయాన్ని నిర్మించారు. వేలూరు పుష్పల వాగు వద్ద, అంబర్‌పేట, నాచారం, యావాపూర్, కిష్టాపూర్, ఇస్లాంపూర్, నాగులపల్లి, తూప్రాన్, నాచారం, వేలూరు, తున్కిఖాల్సా తదితర ప్రదేశాల్లో 20 వరకు చెక్‌డ్యాంలను నిర్మించారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద ఉన్న కొండపోచమ్మసాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో.. హల్దీవాగు జలకళను సంతరించుకుంది. ఇసొంటి రోజు వస్తదనుకోలే.. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. బోరు వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక బీడుగా వదిలేయాల్సి వచ్చింది. కొండపోచమ్మసాగర్ వచ్చాక మా బతుకు మారిపోయింది. పొలానికి కాల్వలతో నీళ్లు వస్తున్నయ్. ఎకరంలో స్వీట్‌కార్న్, మిగతా భూమిలో మిర్చి, టమాటా సాగు చేసిన. రూ.లక్షా 40 వేల దాకా ఆదాయం వస్తది. పంట మంచిగ పండితే బిడ్డ పెండ్లి చేయాలనుకుంటున్న. –దాసరి రాములు, రైతు గంగాపూర్, మర్కూక్ మండలం బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్ గతంలో ఎండాకాలం వస్తే బోర్లలో నీళ్లు ఉండేవి కాదు. కూరగాయలు పండించేవాళ్లం. నీళ్లు లేక తిప్పలయ్యేది. గత ఏడాది నుంచి ఆ బాధ పోయింది. బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్. నాకు ఆరున్నర ఎకరాల భూమి ఉంటే.. కాల్వ కోసం 3 ఎకరాలు తీసుకున్నరు. నా భూమి పోయినా నలుగురికి మంచి జరిగిందని అనుకున్నా. మిగిలిన భూమిలో బీన్స్,మిర్చి పంటలు సాగుచేస్తున్న. – అన్నెబోయిన కొండయ్య, రైతు,రామచంద్రాపూర్, జగదేవ్‌పూర్ మండలం ఇప్పుడు మొత్తం భూమి సాగు చేసుకుంటున్నా.. గతంలో ఎండాకాలంలో వ్యవసాయ బోరు పావు గంట నీళ్లు వస్తే.. మళ్లీ రెండు, మూడు గంటల పాటు నీళ్లు ఊరేదాకా బంద్ చేసేవాళ్లం. కాళేశ్వరం నీళ్లతో మా ఊరి చెరువు నింపుతుండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో రెండెకరాలకే నీళ్లు సరిపోయేవి కావు. ఇప్పుడు నాకున్న మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. దిగుబడి కూడా పెరిగింది. – శంకర్, ఎన్సాన్పల్లి ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే.. నేను 50 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న.. ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే. రెండేళ్ల నుంచి సాగునీటికి కరువే లేదు. మా భూమిలో ఉన్న బావి, బోరు ఎండకాలం వస్తుందనగానే ఎండిపోయేవి. కాలం కాకపోతే తిండి గింజలకూ ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడా బాధ తప్పింది. – చెత్తిరి బాలయ్య, ఎల్లారెడ్డిపేట -
‘బీజేపీ నేతలు అడ్డంపొడుగు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు’
గజ్వేల్: కాళేశ్వరం ద్వారా కొత్తగా ఒక ఎకరాకైనా నీరు పారిందా? అని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, కళ్లముందు పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నా...కళ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలోని కొండపోచమ్మసాగర్ కాల్వ ద్వారా కూడవెల్లి వాగు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండిచెరువుకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తాగునీటికి కూడా కటకట ఉండేదన్నారు. ఇప్పడు సీఎం కేసీఆర్ సమృద్ధిగా తాగు, సాగు నీరు ఇస్తుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. మండుటెండల్లోనూ వాగులను పారిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నీళ్లు రావడం ఇష్టం లేక.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి జరిగిందని కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సైతం అడ్డంపొడుగు మాట్లాడుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరెంట్, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలున్నాయా..? అంటూ ప్రశ్నించారు. రైతులకు సాగునీటితోపాటు ఎరువులు, కరెంట్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీజేపీ ప్రజలకు చేసిన ఒక్క మంచి పనేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువుల బస్తాలకోసం చెప్పుల లైన్లు... కాంగ్రెస్ పాలనలో ఎరువుల బస్తాల కోసం చెప్పులతో లైన్ కట్టాల్సిన పరిస్థితులను ప్రజలు మరచిపోతారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. నేడు రిజర్వాయర్లకు దేవుళ్ల పేరు పెట్టుకుంటే కూడా తట్టుకోలేకపోతున్నారన్నారు. రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ పాల్గొన్నారు. హుటాహుటిన ఫామ్‌హౌస్‌కు ఇదిలా ఉండగా మంత్రి హరీశ్‌రావు కొడకండ్ల కార్యక్రమంలో పాల్గొనే ముందే ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్న అత్యవసరభేటీకి హాజరుకావాలని సీఎం నుంచి పిలుపురావడంతో ఇక్కడ త్వరగా ముగించుకొని ఆయన హుటాహుటిన వెళ్లిపోయారు. వర్గల్లో హల్దీవాగులోకి నీటి విడుదల, సిద్దిపేటలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
Sitarama Lift Irrigation Project: అయ్యో .. ‘రామా’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలానికల్లా సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న హామీ నీరుగారినట్లే కనబడుతోంది. పూర్తికాని భూసేకరణ, నిధుల లేమి, కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ కలిసి ఆశలకు గండికొడుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లు సిద్ధం చేసినా, ఆయకట్టుకు నీరిచ్చే సత్తుపల్లి ట్రంక్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. మూడు పంప్‌హౌస్‌లు సిద్ధమైనా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామను చేపట్టారు. మూడున్నరేళ్ల కింద మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. రెండు పంప్‌హౌస్‌ల్లో ఆరు మోటార్లను గతేడాదే పూర్తి చేయగా, మూడో పంప్‌హౌస్‌లో 7 మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండగా.. విద్యుత్ సరఫరా చేస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉన్నా ఆయకట్టు మాత్రం లేదు. ఈ ప్రధాన కాల్వ పనులకు సంబంధించే రూ.450 కోట్ల మేర బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రాజెక్టులో భాగంగా మూడో పంప్‌హౌస్ దిగువన 116 కిలోమీటర్ల పొడవునా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీనిద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ వానాకాలానికే సుమారు లక్ష ఎకరాలకు నీరివ్వాలని ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు భూసేకరణకు గానీ, జరిగిన పనులకు గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. ముందుకు సాగని పనులు కెనాల్ తవ్వేందుకు 1,650 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 500 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.40 కోట్లు చెల్లించారు. మరో 214 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర పరిహారంగా చెల్లించాలని రైతులు కోర్టుకు వెళ్లడంతో సేకరణ ఆగిపోయింది. ఇక మిగతా భూమిలో కొంతమేర అవార్డు చేసినా, ప్రభుత్వం చెల్లించా ల్సిన రూ.60 కోట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కాల్వ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అటవీ శాఖ నుంచి బదలాయించిన 1,202 ఎకరాల భూమి పరిధిలోనే ప్రస్తుతం కాల్వ తవ్వకం జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికే..! 116 కిలోమీటర్ల కెనాల్ తవ్వకానికి 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని చేయాల్సి ఉండగా, ఇంతవరకు 52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. సుమారు 25 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పూర్తయినా, మిగతా పనుల పూర్తికి భూసేకరణ జరగకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి తోడు తవ్విన పనులకు సంబంధిం చిన రూ.45 కోట్ల బిల్లులు ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నిధుల విడుదలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రధాన కాల్వ పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలే ఇక్కడా పనిచేస్తుండగా.. నిధుల విడుదల లేకపోవడంతో సంస్థలు పనివేగాన్ని తగ్గించుకుంటున్నాయి. యంత్రాలను ఇతర ప్రాజెక్టుల పనులకు తరలిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇతర ప్రాధాన్యత శాఖలకు నిధుల వెచ్చింపు ఎక్కువగా చేస్తుండటంతో వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
‘మల్లన్న’ చెంతకు గోదారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్ పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. రంగనాయక్‌సాగర్ టు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఈ ఏడాది జూన్ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్‌సాగర్‌లోని నీటిని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్‌సాగర్‌లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్‌మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్ నింపనున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. ►కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది. ►కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు. ►ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్‌లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. ►మొత్తంగా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. ►ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ►మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్‌కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఏర్పాటు చేశారు. -
రేడియల్ గేట్ల ద్వారా గోదావరి జలాలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ రేడియల్ గేట్ల ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా దిగువకు చేరుతున్నాయి. స్పిల్‌వే క్లస్టర్ ఎత్తు 25.72 మీటర్లు కాగా.. నీటిమట్టం అంతకుమించి పెరగడంతో 10 రేడియల్ గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ ఏడాది ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులు పూర్తిచేసి స్పిల్‌వే మీదుగా గోదావరి వరద నీటిని మళ్లించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కాఫర్‌డ్యామ్ ఎగువ భాగాన నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షం నీరు నదిలో కలుస్తుండటంతో స్పిల్‌వే క్లస్టర్ వద్ద నీటిమట్టం శుక్రవారం నాటికి 26.2 మీటర్ల ఎత్తుకు పెరిగింది. క్లస్టర్ లెవెల్ దాటడంతో రేడియల్ గేట్ల ద్వారా నీరు స్పిల్ చానల్లోకి చేరుతోంది. అక్కడి నుంచి పైలట్ చానల్ వద్ద మహానందీశ్వర స్వామి ఆలయం దిగువన గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తోంది. -
దిగుబడులు వరించాయ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ధాన్యాగారంగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు ఈ రబీలో సాగునీటి ఇబ్బందులను అధిగమించి మంచి దిగుబడులు సాధించారు. రెండో పంట విరగ పండటంతో రైతుల మోములో ఆనందం తొణికిసలాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగమైన కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం ఈ సారి అఖండ గోదావరి దిగువన రబీకి క్రాప్ హాలిడే ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే.. రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. అదే సందర్భంలో గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరాలని ఆదేశించారు. గోదావరిలో సహజ ప్రవాహ జలాలు నిండుకున్నా ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేశారు. ప్రణాళిక ఫలించి ఎకరాకు 48 నుంచి 50 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విషమ పరీక్ష పెట్టినా.. రబీ ప్రారంభంలో అఖండ గోదావరిలో సహజ జలాలు నిండుకున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సాగునీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. ఒక పక్క కాఫర్ డ్యామ్ నిర్మాణ అంశం, మరో పక్క తగ్గిన గోదావరి ఇన్‌ఫ్లోతో సాగు నీటిఎద్దడి ప్రభుత్వానికి తొలుత విషమ పరీక్ష పెట్టాయి. ముందస్తు ప్రణాళికతో స్వల్ప వ్యవధిలో చేతికొచ్చే వరి రకాలు సూచించి.. వెదజల్లు సాగు విధానాన్ని ప్రోత్సాహించారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు వెదజల్లు పద్ధతికి ముందుకొచ్చారు. అనుకున్నట్టుగానే దిగుబడిలో కూడా సక్సెస్ అయ్యారు. గత రబీతో పోల్చుకుంటే ఈసారి దిగుబడి ఎకరాకు 75 కిలోలు అధికంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్షలో స్పష్టం చేశారు. రైతు పొలంలో ధాన్యం దిగుబడి శాతం లెక్కిస్తున్న వ్యవసాయ అధికారులు ఫలించిన ప్రణాళిక ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు సరఫరా అవుతుంది. మూడు డెల్టాల్లో రబీ వరికి కనీసం 94 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, గోదావరి నదిలో సహజ జలాలు 46.21 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సీలేరు నుంచి 62.756 టీఎంసీలను గోదావరి నదిలోకి రప్పించి రబీ, తాగునీటి అవసరాల కోసం 98.216 టీఎంసీల నీటిపి విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20 వరకూ సాగునీరు విడుదల చేసి ప్రతి ఎకరాకు అందించారు. శివారు భూములకు సైతం నీరందడంతో రైతులంతా ఇబ్బందులు లేకుండా గట్టెక్కారు. ప్రభుత్వ కృషితో విజయవంతం ప్రభుత్వ కృషితో రబీ వరి సాగు విజయవంతమయ్యింది. నీటి ఎద్దడి తలెత్తిన సమయంలో సీలేరు నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించగలిగాం. ప్రతి ఎకరాకు నీరిచ్చాం. తొలుత మార్చి నెలాఖరు నాటికి కాలువలను మూసివేయాలని నిర్ణయించినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి విడుదల కాలాన్ని పొడిగించింది. సమష్టి కృషితో రబీని విజయవంతం చేయగలిగాం. – ఆర్.శ్రీరామకృష్ణ, ఎస్ఈ, ధవళేశ్వరం సర్కిల్ పంట దక్కుతుందనుకోలేదు ఈ ఏడాది దాళ్వా తొలి దశలోనే తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. తడారిపోతున్న పొలాలను చూసి ఈ పంట దక్కదేమో అనుకున్నాం. శివారు భూముల్లోని రైతుల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించి సీలేరు జలాలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకున్నారు. మద్దతు ధర కూడా దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో సంతోషంగా ఉంది. – నరాల నాగేశ్వరరావు, దుగ్గుదూరు, కాజులూరు మండలం నీరివ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం మా గ్రామంలో ఈ పంటకు నీరు అందదేమోనని ఆందోళన పడ్డాం. వ్యవసాయ అధికారులు ముందునుంచీ హెచ్చరిస్తున్నా దేవుడి మీద భారం వేసి ముందుకెళ్లాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజంగానే మా పాలిట దేవుడిగా వరమిచ్చారు. సీలేరు నుంచి నీరు తీసుకుని వచ్చి మా పంటలను కాపాడారు. 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. –మావిరెడ్డి సుబ్బారావు, రైతు, చోడవరం, రామచంద్రపురం మండలం -
మా అవసరాలను తీర్చాకే.. కావేరికి గోదావరిని తరలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవసరాలు పూర్తిగా తీర్చాకనే గోదావరి జలాలను కావేరి(గ్రాండ్ ఆనకట్ట) నదికి మళ్లించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ అనుసంధానంలో ఇచ్చంపల్లి, జానంపేటతోపాటు పోలవరం నుంచి తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా అధ్యక్షతన సోమవారం జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌బ్ల్యూడీఏ) సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానంపై వాటి బేసిన్ల పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ జలవనరుల శాఖ అధికారులతో కేంద్రమంత్రి ఈ సందర్భంగా సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. మా అవసరాలు తీర్చాకనే.. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. 1.ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట), 2.అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట) 3.జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట). గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలని ప్రతిపాదించింది. ఇక జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలంది. అయితే ఏపీలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల మా రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాల్ని మళ్లించాలని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేనేలేవన్నారు. లేని మిగులు జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్కలు తేల్చాలని సూచించారు. ప్రస్తుతం సముద్రంలో కలుస్తున్న జలాల్లో అధిక భాగం ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో వినియోగించుకోనివేనన్నారు. ఈ నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలన్నారు. కాగా, పోలవరం ఎగువ నుంచి గోదావరి–కృష్ణా–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్–పెన్నా–కావేరి అనుసంధానం ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నారాయణరెడ్డి సూచించారు. దీనివల్ల నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించవచ్చునన్నారు. ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. -
ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల'
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తరలించి.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం ద్వారా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి రోజుకు ఎనిమిదివేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.20 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టింది. తొలిదశలో రూ.2,022 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రభుత్వం రెండోదశలో రూ.6,265 కోట్లతో రెండు ప్యాకేజీల కింద పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. అనంతరం దశలవారీగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి, గాదిగెడ్డ రిజర్వాయర్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. మొత్తం రూ.15,448 కోట్ల వ్యయమయ్యే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టడానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ, జాతీయ ఆర్థికసంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి.. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయడానికి ప్రణాళిక రచించింది. మహానేత వైఎస్ మానసపుత్రిక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడువేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువ నుంచి 63.20 టీఎంసీలను తరలించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. కానీ.. అంతలోనే మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగునపడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఇదీ.. ► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 500 మీటర్ల లింకు కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటిని తరలించి.. జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండుదశల్లో ఎత్తిపోసి 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ► ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 23 కిలోమీటర్ల లింక్ కాలువ ద్వారా 6,700 క్యూసెక్కులు తరలిస్తారు. ► పాపాయపాలెం వద్ద ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్‌కు సరఫరా చేస్తారు. ► లిఫ్ట్ కాలువ 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి కోటగండ్రేడు బ్రాంచ్ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు. ► లిఫ్ట్ కెనాల్ 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్, 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్, 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్ ద్వారా తరలించి 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే తాడిపూడి రిజర్వాయర్ నింపుతారు. ► తొలిదశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ జలవనరులశాఖకు దిశానిర్దేశం చేశారు. ► రెండోదశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా 23 కి.మీ.ల లింక్ కెనాల్, 106 కి.మీ.ల లిఫ్ట్ కెనాల్, 60 కి.మీ.ల కోటగండ్రేడు బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టడానికి రూ.6,265 కోట్లు అవసరం. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనులకు రూ.2,344 కోట్లను వెచి్చంచాల్సి ఉంటుంది. రూ.3,921 కోట్లతో లింక్ కెనాల్, లిఫ్ట్ కెనాల్, బ్రాంచ్ కెనాల్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ► రెండోదశలో తొలి ప్యాకేజీకి రూ.2,539 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,382 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ పనులకు సమాంతరంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్లు నిరి్మంచడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార బిల్లులు కూడా చెల్లించని టీడీపీ సర్కార్ 2019 ఎన్నికలకు ముందు ఓట్లకోసం టీడీపీ సర్కార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశను చేపడుతున్నట్లు ప్రకటించి 2018 నవంబర్ 15న శంకుస్థాపన చేసింది. ఆరోజున రూ.1,94,00,404 వెచ్చించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో ప్రచారం చేసుకుంది. కానీ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. ప్రచార ప్రకటనల బిల్లులూ చెల్లించలేదు. ఆ బిల్లులను ఫిబ్రవరి 7న ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. -
తగ్గుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత రెండు రోజులుగా భారీ వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం రాత్రికి తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద 17.75 లక్షల క్యూసెక్కుల కంటే తగ్గనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటలకు 19.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో 22,40,194 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 150.7 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 702.07 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లోనూ అన్నిచోట్లా వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. తూర్పు గోదావరి జిల్లా పెదకందలపాలెంలో వరదనీటిలో పిల్లలను మోసుకెళ్తున్న దృశ్యం సహాయక చర్యలు ముమ్మరం ► వరద ప్రభావిత గ్రామాల్లో లాంచీలు, ఇంజన్ బోట్ల ద్వారా బాధితులకు పాలు, బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కొవ్వొత్తులు, ఇతర నిత్యావసరాలను యుద్ధప్రాతిపదికన అందిస్తున్నారు. ► తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని నాలుగు విలీన మండలాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలుగు మండలాల్లో 16 గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకోగా 74 గ్రామాల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో 3,846 కుటుంబాలకు చెందిన 11,036 మందిని 59 పునరావాస కేంద్రాలకు తరలించారు. గర్భిణులతోపాటు అత్యవసర వైద్యసేవలు అవసరమైన 149 మందిని చింతూరు ఏరియా ఆస్పత్రి, కూనవరం పీహెచ్‌సీలకు పంపారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో 71 గ్రామాల్లో 10 వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని అధికారులు అంచనా వేశారు. వారి కోసం 26 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 5 వేల మందికి చోటు కల్పించారు. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ► ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు. ► ముంపులో ఉన్న విలీన మండలాల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా సరుకులను మోస్తూ అందజేశారు. ► కమ్యూనికేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తూ వైద్యులు, పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ► ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు.. పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు.. చిర్ల జగ్గరెడ్డి, పొన్నాడ సతీశ్‌కుమార్, తెల్లం బాలరాజు, అధికారులు పర్యటించారు. ► ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. శ్రీశైలంలోకి 3.63 లక్షల క్యూసెక్కులు కృష్ణా, తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం చేరుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3,63,772 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ సీజన్లో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రికి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరుకోనుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 877.50 అడుగుల్లో 176 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తడానికి అధికారులు నిర్ణయించారు. ► తుంగభద్ర డ్యామ్ నిండిపోవడంతో 20 గేట్లను ఎత్తి 77 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► శ్రీశైలం నుంచి 42,378 క్యూసెక్కులు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 255.82 టీఎంసీలకు చేరుకుంది. ► మూసీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వరద ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 13.32 టీఎంసీలకు చేరింది. ► ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి 1.13 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టాకు వదలగా మిగిలిన 1.05 లక్షల క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
అనుసంధానం పనులు ‘ఎస్పీవీ’కి
సాక్షి, అమరావతి: సముద్రం పాలయ్యే గోదావరి వరద జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన పోలవరం – బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం పనులను నాలుగేళ్లలో పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనికి నిధుల సేకరణ, పర్యవేక్షణకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ(ఆసియా అభివృద్ది బ్యాంకు), జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ), ఎఫ్ఎఫ్సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్), నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) తదితరాల నుంచి ఎస్పీవీ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు సమీకరించాలని నిర్ణయించారు. ఈ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించకుండా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు మాత్రమే వెచ్చించనున్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా ఎస్పీవీకే అప్పగించనున్నారు. మార్చి లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనుసంధానం పనులను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి.. ధవళేశ్వరం నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా బేసిన్‌లోని దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించారు. వ్యాప్కోస్ నివేదికపై ఈనెల 20న సమీక్షించిన సీఎం జగన్ తక్కువ వ్యయంతో గోదావరి వరద జలాలను గరిష్టంగా తరలించడంపై అధ్యయనం చేసి అంచనాలు (ఎస్టిమేట్లు) తయారు చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ద్వారా అంచనాలు ప్రభుత్వానికి చేరాక పరిశీలించి పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతి మంజూరు చేయనున్నారు. అనంతరం పనులను ప్యాకేజీలుగా విభజించి జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ‘ఈ–ఆక్షన్’ (రివర్స్ టెండరింగ్) ద్వారా తక్కువ ధరకు పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఈ ప్రక్రియను మూడు నెలలలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. -
జలదిగ్బంధంలో ఎడ్జెర్ల
మరిపెడ రూరల్: మబ్బు పట్టలేదు.. వర్షం కురవలేదు.. కానీ ఆ గ్రామం రాత్రికి రాత్రే జలమయమైంది. తెల్లవారేసరికి ఏ వీధిలో చూసినా సెలయేరులా నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఇదీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని పరిస్థితి. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇటీవల ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా మండలానికి గోదావరి జలాలను విడుదల చేసింది. అయితే ఎడ్జెర్ల గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువును నింపేందుకు జేసీబీతో తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వుతున్నారు. ఈ క్రమంలో కాల్వ సగం తవ్విన తర్వాత మధ్యలో ఓ రైతు తన పంట పొలం నుంచి కాల్వ తవ్వడానికి కుదరదని అడ్డుకున్నాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం రాత్రి పది గంటల సమయంలో గ్రామ సమీపం నుంచి ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ కాల్వకు గండి పెట్టి తాత్కాలికంగా తవ్విన కాల్వలోకి నీటిని వదిలారు. ఆ నీరంతా పల్లపు ప్రాంతంలోని గ్రామంలోకి చేరింది. వీధులు, ఇళ్లచుట్టూ నీరు చేరడంతో రాత్రంతా ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గ్రామాన్ని నీరు ముంచెత్తడంతో సర్పంచ్ ఆదివారం స్థానిక రైతులతో కలసి వెళ్లి ఎస్సారెస్పీ కాల్వకు పెట్టిన గండిని పూడ్చారు. దీంతో గ్రామంలోకి నీటి ప్రవాహం ఆగిపోయింది. -
వాన వెల్లువ
సాక్షి, కాకినాడ/సాక్షి, హైదరాబాద్ /రాజమండ్రి/సీలేరు/విశాఖపట్నం/అమరావతి/బాపట్ల: కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏజెన్సీలో కొండవాగులు పొంగుతుండటంతో మారుమూల గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీలేరు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డొంకరాయి రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. బలిమెల రిజర్వాయర్‌లోకి ప్రవాహ జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు గోదావరిలో వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ఇదిలావుంటే.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఈనెల 31వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో సగటు వర్షపాతం 33.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇదే జిల్లాలోని గోకవరంలో అత్యధికంగా 96 మిల్లీమీటర్లు, పి.గన్నవరం, సఖినేటిపల్లి మండలాల్లో అత్యల్పంగా 9 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. సీలేరు నదికి భారీగా వరద రావడంతో డొంకరాయి డ్యామ్ నుంచి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద జల్లివారిగూడెం వాగు పొంగి రహదారి మీదుగా ప్రవహించడంతో చింతూరు, వీఆర్ పురం మండలాల నడుమ, చింతూరు మండలం ఏజీ కోడేరు, మల్లెతోట, ఉలుమూరు గ్రామాలకు ఆదివారం ఉదయం రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఇదే మండలం కంసులూరు, గవళ్లకోట నడుమ సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో రోజైన ఆదివారం కూడా చదలవాడ పంచాయతీ పరిధిలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో సుద్దగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు కోనసీమలో పల్లపు ప్రాంతాలు జలమయ మయ్యాయి. విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జల్లులు పడుతూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న గోదావరి జలాలు రిజర్వాయర్లకు జలకళ నీరులేక వెలవెల బోయిన జోలాపుట్, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్లు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా వీటిలోకి భారీగా ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండటంతో జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా.. ఈ వర్షాలతో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జెన్కో అధికారులు అప్రమత్తమై శనివారం అర్ధరాత్రి రెండు గేట్లు ఎత్తి 4,400 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అక్కడి జల విద్యుత్ కేంద్రంలోని ఏవీపీ డ్యాం పూర్తిగా నిండిపోవడంతో మరో రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మోతుగూడెం రిజర్వాయర్‌లోకి పంపిస్తున్నారు. మోతుగూడెం జల విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లలో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బలిమెలకు 13 వేల క్యూసెక్కులు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేసే బలిమెల రిజర్వాయర్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇప్పటికి 13 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరింది. జోలాపుట్ రిజర్వాయర్‌లోకి 7,800 క్యూసెక్కుల నీరు చేరింది. వర్షాలు కొనసాగితే మరో రెండు రోజుల్లో జోలాపుట్, బలిమెల రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవచ్చని జెన్కో వర్గాలు వెల్లడించాయి. గోదావరికి స్వల్ప వరద ఉధృతి ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఒకటి రెండు రోజుల్లో కాటన్ బ్యారేజి వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం రాత్రి బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 10.70 అడుగులుగా నమోదైంది. బ్యారేజి నుంచి 69,003 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.73 మీటర్లు, భద్రాచలంలో 16.50 అడుగులు, కూనవరంలో 7.32 మీటర్లు, పోలవరంలో 6.15 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.88 మీటర్ల మేర గోదావరిలో నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. జూరాల వైపు కృష్ణమ్మ పరుగు మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం సాయంత్రానికి 45వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ఆదివారం అర్ధరాత్రికి లేక సోమవారం ఉదయానికి ఆల్మట్టి గేట్లు ఎత్తే వీలుందని సమాచారం. నారాయణపూర్ నుంచి ఇప్పటికే నీటి విడుదల మొదలైంది. వర్షాలకు కొట్టుకుపోయిన ఎండు చేపలు వర్షాలు మత్స్యకారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఫారెస్ట్ భూమిలో 20 రోజుల క్రితం వేటాడిన చేపలను ఎండబెట్టగా.. వర్షాల కురవడంతో అవన్నీ తడిసి కాలువల గుండా కొట్టుకుపోయి సముద్రంలో కలిశాయి. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వీటిని లారీలకు ఎక్కించి సొమ్ము చేసుకుందామనుకున్న మత్స్యకారుల ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలావుంటే.. వర్షంతోపాటు అలల ఉధృతి పెరగటంతో సముద్రంలో లంగర్ వేసిన పడవలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. 31 నాటికి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం తీరం దాటింది. మరోవైపు ఇక్కడే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. దీనివల్ల ఈనెల 31 నాటికల్లా అల్పపీడనం ఏర్పడనుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోస్తాంధ్రలో నైరుతి రుతు పవనాలు చురుకుదనం సంతరించుకున్నాయి. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులపాటు కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా వర్షం కురవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. రాయలసీమలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. మరోవైపు పశ్చిమ దిశ నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రాపురంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూనవరంలో 8, ప్రత్తిపాడు, వేలేరుపాడులో 6, కుకునూరు, పెద్దాపురంలో 5, పోలవరంలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
28న జల వివాదాలపై చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న తొలి దశలో రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావులు నిర్ణయం తీసుకుని మరోసారి భేటీ అయ్యి వివాదాలకు తెరదించాలని భావిస్తున్నారు. విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రకు బాధ్యతల అప్పగింత కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడకు వచ్చారు. అదే రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. గోదావరి జలాల గరిష్ట వినియోగంతోపాటు నదీ జలాల వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకునే అంశంపై ఇద్దరు సీఎంలూ చర్చించుకున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంలోనూ ఇదే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు జల వివాదాలతోపాటు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలులోని 142 సంస్థల ఆస్తుల పంపకాలపై సమస్యలను పరిష్కరించుకోవడానికి తొలి దశలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై చర్చించనున్నారు. కృష్ణా నీటి పంపకాలపై చర్చ కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. విభజన నేపథ్యంలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా నదీ జలాలను నాలుగు నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జలాల పునఃపంపిణీకి నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. కానీ ఇప్పటివరకూ విచారణ పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం ద్వారా కేసులు ఉపసంహరించుకుని, వివాదాలను పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా నీటిలో 14 టీఎంసీలు మహారాష్ట్ర, 21 టీఎంసీలు కర్ణాటక, మిగతా 45 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీ అదనంగా వినియోగించుకోవచ్చునని గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల.. కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ 2015 నుంచి ప్రతిపాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం 240 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలిస్తోందని.. అందుకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరుతూ వస్తోంది. ఈ వివాదాలన్నిటిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య 28న చర్చ జరగనుంది. శ్రీశైలానికి గోదావరి నీటి తరలింపుపై చర్చలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా మలి దఫా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలిస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలతో, ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీళ్లు అందించొచ్చు. తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాత పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకూ గోదావరి నీటిని తరలించొచ్చని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపితే అవసరాన్ని బట్టి నాగార్జునసాగర్‌కు తరలించి.. సాగర్ ఆయకట్టునూ కృష్ణా డెల్టానూ సస్యశ్యామలం చేయవచ్చునని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారు. -
దసరాకు ముందే కాళేశ్వరం ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం పథకం నుంచి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దసరా కంటే ముందే అధికారికంగా కాళేశ్వరం పంపులను ఆరంభించడం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6 పంప్‌హౌజ్‌లోని రెండు మోటార్ల ద్వారా గోదావరి నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి మేడారం రిజర్వాయర్‌కు ఈ నెలాఖరుకల్లా తరలించాలని.. దసరా నాటికి ప్యాకేజీ–7 టన్నెల్ వ్యవస్థ, ప్యాకేజీ–8లో ఇప్పటికే సిద్ధమైన మరో రెండు మోటార్ల ద్వారా మేడారం నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లుగా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాల ద్వారా తెలిసింది. సిద్ధమైన పంపులు, మోటార్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకోవడం, స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఈ నెలలోనే నీటిని ప్యాకే జీ–6 ద్వారా మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా ప్రాజెక్టు అధికారులు చర్యలు చేప ట్టారు. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిద్ధమయ్యాయి. ఇందులో ఒక మోటార్‌కు శుక్రవారం డ్రై రన్ నిర్వహించగా అది విజయవంతమైంది. ఈనెల 5న రెండో మోటార్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఒక్కో మోటార్‌కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో పంపు డ్రైరన్ పూర్తి కాగానే ఈనెల 25 నాటికి ఎల్లంపల్లి నుంచి 0.78 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు. అక్టోబర్ రెండో వారం వరకు.. ఇక ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో అత్యంత క్లిష్టమైన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. 5 మీటర్ల మేర హెడింగ్, బెంచింగ్ పనులు చేయడంతోపాటు, 8 కిలోమీటర్ల టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎడమ వైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటినైనా మళ్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులు పూర్తయ్యేందుకు అక్టోబర్ రెండో వారం వరకు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను మరో 15 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావిటీ కెనాల్ పూర్తయితే మిడ్ మానేరుకు నీరు తరలించవచ్చు. దసరాకు ముందే ప్యాకేజీ–7 పూర్తి చేసి నీటిని మిడ్‌మానేరు తేవాలని నిర్ణయించారు. మిడ్‌మానేరుకు నీటి తరలించి.. అక్కడ కనీస మట్టాలకు నీరు చేరిన వెంటనే దిగువ ప్యాకేజీల ద్వారా మల్లన్నసాగర్ కాల్వలకు నీటిని తరలించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా నీటిపారుదల మంత్రి హరీశ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. -
శ్రీశైలానికి భారీగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/హొసపేటె: నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండటంతో భారీ ఎత్తున వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 1.76 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.. గురువారం సాయంత్రం 800.30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 804.70 అడుగులకు చేరుకుంది. ఒక్క రోజులోనే 4.40 అడుగులు పెరగగా.. జలాశయంలోకి 2.2663 టీఎంసీల నీరు వచ్చి చేరగా 31.3963 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇది నిండాలంటే 185 టీఎంసీలు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దులో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువన జలాశయాలు నిండిపోయాయి. వరద ఇదే రీతిలో కనీసం 10 రోజులు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనాల నేపథ్యంలో మరో పది పదిహేను రోజుల్లో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో కూడా వరద రోజు రోజుకూ పెరుగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 70,416 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 94.09 టీఎంసీలకు చేరింది. దీంతో 22 గేట్లు రెండు అడుగుల మేర తెరిచి 63,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారానికి ఈ వరద జలాలు సుంకేసుల బ్యారేజీకి చేరనున్నాయి. సుంకేసుల బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలే. 24 గంటల్లో బ్యారేజీ నిండుతుంది. దాంతో ఆదివారం సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. కృష్ణా మరో ప్రధాన ఉప నది బీమా. గతేడాది బీమా నది నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీఎత్తున జలాలు వచ్చాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులో ప్రస్తుతం 72.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా 16,197 క్యూసెక్కులు ఆ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఇది నిండాలంటే మరో 44 టీఎంసీలు అవసరం. ఉజ్జయిని నిండితే బీమా ప్రవాహం కూడా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలాన్ని చేరుతాయి. ఈ ఏడాది పుష్కలంగా నీటి లభ్యత? శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 875 అడుగులకు చేరుకుంటే ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి.. దిగువకు అంటే నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తారు. సాగర్‌లో ప్రస్తుతం 133.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగార్ నిండాలంటే.. 178.67 టీఎంసీలు అవసరం. పులిచింతల ప్రాజెక్టు నిండాలంటే 43 టీఎంసీలు కావాలి. తెలుగు గంగ ప్రాజెక్టు కింద వెలిగోడు, సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్.. గాలేరు–నగరి పథకం కింద గండికోట, పైడిపలెం, వామికొండ, హంద్రీ–నీవా పథకం కింద కృష్ణగిరి, జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు నిండాలంటే 215 టీఎంసీలు అవసరం. తెలంగాణలోని బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులతో కలిపి మొత్తం 675 టీఎంసీల నీటి కొరత ఉంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు 40 టీఎంసీలు అవసరం. మొత్తం మీద 715 టీఎంసీలు అవసరం. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణమ్మ శ్రీశైలాన్ని చేరడం, తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటి లభ్యత ఈ ఏడాది ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోదావరి జలాలు సముద్రంపాలు గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి శుక్రవారం 3,85,922 క్యూసెక్కుల ప్రవాహం రాగా 8,400 క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి మిగతా 3,78,922 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. దాంతో 24 గంటల్లోనే 32.73 టీఎంసీలు కడలి పాలైనట్లు అయ్యింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ 302.597 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు మొత్తం 10,301 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అలాగే, వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీకి 4325 క్యూసెక్కులు రాగా.. 1220 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 3,105 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. నాగావళిలో వరద తగ్గడంతో తోటపల్లి బ్యారేజీ గేట్లును మూసివేశారు. నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో తోటపల్లి బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. రాష్ట్రంలో అన్నీ నదులు జలకళతో కళకళలాడుతుంటే వర్షాభావం వల్ల పెన్నా నది మాత్రం వెలవెలబోతోంది. -
ఎల్లంపల్లిలో నీరు.. కాళేశ్వరం జోరు!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో కాళేశ్వరం బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల పనులకు ఆటంకాలు ఎదురవుతున్నా ఎల్లంపల్లి బ్యారేజీకి గోదావరి జలాలు పోటెత్తుతుండటంతో దిగువన పనులు ఊపందుకున్నాయి. వర్షాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు ఆలస్యమైనా ఎల్లంపల్లికి చేరుతున్న నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ఇప్పటికే 10 టీఎంసీల నిల్వలు ఉండగా.. ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నుంచి కాళేశ్వరం లోని ప్యాకేజీ–6 మోటార్ల ద్వారా మేడారం రిజర్వాయర్‌కు, అటునుంచి ప్యాకేజీ–7, 8ల ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించేలా నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. కౌంట్‌డౌన్ మొదలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు ఎత్తిపోసేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్ వరకు సమయం పట్టే అవకా శం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్ మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారుల అంచనా. సెప్టెంబర్‌లో మేడారం రిజర్వాయర్‌కు.. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిదమయ్యాయి. ఆగస్టు చివరికి మరొకటి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక్కో మోటార్‌కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటి ని తరలించేలా పనులు సాగుతున్నాయి. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఇంకా సిద్ధం కావాల్సి ఉండటంతో డ్రై రన్ జరుగ లేదు. సబ్‌స్టేషన్ ఈ నెలాఖరుకు సిద్ధం కానుండటం తో ఆగస్టు 15కి డ్రై రన్ చేయాలని మంత్రి హరీశ్‌రావు గడువు విధించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఎల్లంపల్లి నుంచి 1.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు. లైనింగ్ పూర్తయితే లైన్ క్లియర్ ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో 13 మీటర్ల పనే మిగిలింది. లైనింగ్ పనులు సెప్టెంబర్ చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను ఆగస్టు చివరికి సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావి టీ కెనాల్ పూర్తయితే మిడ్ మానేరుకు నీరు తరలించవచ్చు. ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ–6 ద్వారా నీరు తరలించేందుకు ఇబ్బంది లేకున్నా ప్యాకేజీ– 7లో టన్నెల్ లైనింగ్ పనులు పూర్తయితేనే ప్యాకేజీ–8 ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించడం సులభమని ప్రాజెక్టు వర్గాలు చెబు తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ తొలివారంలో ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతల ఆరంభం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఆరంభం అవుతుందని చెబుతున్నాయి. -
మేమున్నది ఫిర్యాదులు తీసుకోవటానికేనా?
సాక్షి, అమరావతి: ‘అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటారు. వాటికి సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని కోరితే మాత్రం స్పందించరు. కేవలం ఫిర్యాదులు స్వీకరించడానికే బోర్డు ఉందనుకుంటున్నారా?..’ అంటూ తెలుగు రాష్ట్రాలపై గోదావరి నదీ జలాల బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీపీఆర్‌లు ఇచ్చిన తర్వాతే అనుమతి లేని ప్రాజెక్టులపై చర్చిస్తామని స్పష్టం చేసింది. బోర్డు ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఇరు రాష్ట్రాలు వారం రోజుల్లోగా డీపీఆర్‌లు సమర్పిస్తామని హామీ ఇచ్చాయి. ఛైర్మన్ హెచ్‌కే సాహూ నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు సమావేశమైంది. పునర్విభజన చట్టం మేరకు గోదావరిపై ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే గోదావరి బోర్డు లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, అయితే ఎలాంటి అనుమతి లేకుండానే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాలు బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ప్రాజెక్టులుగా ఎందుకు పరిగణించరు? రీ–ఇంజనీరింగ్ పేరుతో తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులు చేపడుతూ వాటి సామర్థ్యాలను పెంచేస్తోందని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలను చేపట్టారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల సామర్థ్యం 33 టీఎంసీలైతే తాజాగా రీ–ఇంజనీరింగ్ పేరుతో సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచారని వివరించారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల కింద గతంలో 3.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 6.74 లక్షల ఎకరాలకు పెంచారని పేర్కొన్నారు. అప్పట్లో రెండు ఎత్తిపోతల పథకాల వ్యయం రూ.3,505 కోట్లయితే ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకం వ్యయమే రూ.13,384.80 కోట్లకు చేరుకున్నందున కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినందున దాన్ని పాత ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించాలని నిలదీశారు. అవి ఉమ్మడి హయాంలో ప్రాజెక్టులే ఆంధ్రప్రదేశ్ వాదనలపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తమ అవసరాలకు అనుగుణంగా రీ–ఇంజనీరింగ్ చేశామన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పలు ప్రాజెక్టులను చేపడుతోందని ఫిర్యాదు చేశారు. ఒక్కటైనా డీపీఆర్ ఇచ్చారా? ఇరు రాష్ట్రాల వాదనలను సావధానంగా విన్న బోర్డు ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను కోరుతున్నా ఇప్పటివరకూ ఒక్కటి కూడా ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. డీపీఆర్‌లు ఎప్పుడు ఇస్తే అప్పుడే వాటిపై చర్చిద్దామని స్పష్టం చేశారు. దీంతో వారం రోజుల్లోగా డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డుకు హామీ ఇచ్చారు. డీపీఆర్‌లు అందాక మరోసారి సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది. గోదావరి బోర్డు భేటీలో నిర్ణయాలు – గోదావరి జలాల వినియోగం లెక్కలు తేల్చేందుకు ఇరు రాష్ట్రాల్లోనూ 120 ప్రాంతాల్లో టెలీమీటర్ల ఏర్పాటు. – తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం బ్యారేజీ, తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో 8 ప్రదేశాల్లో టెలీమీటర్ల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అంగీకారం. – గోదావరి ఉప నది ఇంద్రాంతిపై మధ్య కొలాబ్ ప్రాజెక్టు ద్వారా తమకు కేటాయించిన నీటిని వినియోగించుకుంటామన్న ఒడిశా సర్కార్ వినతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకారం. – మధ్య కొలాబ్ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇచ్చేందుకు బోర్డు ఆమోదం.