సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకిస్తూ అక్కడి భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 63.20 టీఎంసీలను తరలించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు ఆ ప్రాంత పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,411.40 కోట్లు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా గుర్తించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి దశ పనులను రూ.954.09 కోట్లతో రెండు ప్యాకేజీలుగా, రెండో దశ పనులను రూ.5,134 కోట్లతో రెండు ప్యాకేజీలుగా కాంట్రాక్టర్లకు అధికారులు అప్పగించారు. రెండో దశలో మిగతా నాలుగు ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు.
పనులకు శ్రీకారం
► తొలి దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా 18.90 కి.మీ. మేర కాలువ, రెండుచోట్ల ఎత్తిపోతలు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టారు.
► రెండో దశలో పాపయ్యపల్లె ఎత్తిపోతలతోపాటు 121.62 కి.మీ. పొడవున కాలువ తవ్వకం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు.
భూసేకరణకు సమాంతరంగా పనులు
తొలి దశ పనులు చేపట్టడానికి 3,822 ఎకరాల భూమి అవసరం. రెండో దశ పనులు చేపట్టడానికి 12,214.36 ఎకరాలు వెరసి 16,036.36 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో ప్రస్తుతం కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు చేపట్టడానికి వీలుగా భూసేకరణ చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులు దిశానిర్దేశం చేశారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం
Published Mon, May 9 2022 4:01 AM | Last Updated on Mon, May 9 2022 6:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment