Uttarandra Sujala Sravanthi
-
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకిస్తూ అక్కడి భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 63.20 టీఎంసీలను తరలించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు ఆ ప్రాంత పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,411.40 కోట్లు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి దశ పనులను రూ.954.09 కోట్లతో రెండు ప్యాకేజీలుగా, రెండో దశ పనులను రూ.5,134 కోట్లతో రెండు ప్యాకేజీలుగా కాంట్రాక్టర్లకు అధికారులు అప్పగించారు. రెండో దశలో మిగతా నాలుగు ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. పనులకు శ్రీకారం ► తొలి దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా 18.90 కి.మీ. మేర కాలువ, రెండుచోట్ల ఎత్తిపోతలు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టారు. ► రెండో దశలో పాపయ్యపల్లె ఎత్తిపోతలతోపాటు 121.62 కి.మీ. పొడవున కాలువ తవ్వకం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. భూసేకరణకు సమాంతరంగా పనులు తొలి దశ పనులు చేపట్టడానికి 3,822 ఎకరాల భూమి అవసరం. రెండో దశ పనులు చేపట్టడానికి 12,214.36 ఎకరాలు వెరసి 16,036.36 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో ప్రస్తుతం కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు చేపట్టడానికి వీలుగా భూసేకరణ చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులు దిశానిర్దేశం చేశారు. -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలు 63.20 టీఎంసీలను తరలించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. రెండో దశలో 106 కి.మీ. పొడవున ప్రధాన కాలువ (లిఫ్ట్ కెనాల్).. 60 కిలోమీటర్ల పొడవున కొండగండ్రేడు బ్రాంచ్ కాలువ పనులకు టెండర్లు పిలవాలని జలవనరుల శాఖను ఆదేశించింది. ఆ తర్వాత దశల వారీగా భూదేవి రిజర్వాయర్ (3.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్ (3.80 టీఎంసీలు), తాడిపూడి రిజర్వాయర్ (3.80 టీఎంసీలు)లను నిర్మించడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తుంది. తద్వారా ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడానికి, పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరాకు ప్రణాళిక రచించింది. ఈ పనులు చేపట్టేందుకు రూ.15,488 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఇందులో సివిల్ పనులకు రూ.5,442 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులకు రూ.1,775 కోట్లు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.8,271 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని అధికారులు లెక్కకడుతున్నారు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యం ► తొలి దశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ జల వనరుల శాఖకు దిశా నిర్దేశం చేశారు. ► రెండో దశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా ఎత్తిపోతలు, కాలువలు తవ్వే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.5,878 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో రూ.2,961 కోట్లు సివిల్ పనులు, రూ.785 కోట్లు ఎలక్ట్రో మెకానికల్ పనులకు వ్యయమవుతాయని అంచనా. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీలకు రూ.2,132 కోట్లు అవసరం. పనులకు టెండర్లు పిలిచేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ► ఈ పథకం ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లే జలాల మళ్లింపు ► ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున.. 90 రోజుల్లో 63.20 టీఎంసీలను మళ్లించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి.. 1,300 క్యూసెక్కుల నీటిని 500 మీటర్ల మేర తవ్వే లింక్ కెనాల్ ద్వారా తరలించి.. అక్కడి నుంచి జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండు దశల్లో ఎత్తిపోసి.. 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ► మిగిలిన 6,700 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల పొడవున తవ్వే లింక్ కెనాల్ ద్వారా తరలిస్తారు. పాపాయపాలెం వద్ద నీటిని ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేస్తారు. లిఫ్ట్ కాలువలో 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి.. కోటగండ్రేడు బ్రాంచ్ కెనాల్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు. ► లిఫ్ట్ కెనాల్లో 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్‌ను నింపుతారు. లిఫ్ట్ కెనాల్ 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్‌ను నింపుతారు. 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించి.. 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌ను నింపుతారు. ► వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో అప్పట్లోనే టెండర్లు పిలిచారు. అయితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠన్మరణంతో ఆ టెండర్లు రద్దయ్యాయి. ► ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు ప్రజల్ని ఏమార్చే ఎత్తుగడలో భాగంగా.. పథకం తొలి దశ పనులకు రూ.2,022.2 కోట్ల వ్యయంతో పరిపాలన అనుమతి ఇచ్చి, వాటిని రెండు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మోక్షం
రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి వరద జలాలను తరలించి.. వాటిని సస్యశ్యామలం చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని గాడినపెట్టి ఆ కలను సాకారం చేసేందుకు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ పథకాన్ని దశల వారీగా కాకుండా ఒకేసారి చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని.. దాన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీంతో సుమారు రూ.16,546 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చి, టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఇది పూర్తయితే.. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 63.20 టీఎంసీల గోదావరి జలాలను ఉత్తరాంధ్రలోని ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే, 1,200 గ్రామాల్లోని 30 లక్షల మందికి తాగునీరు అందించడానికి వీలు కలుగుతుంది. –సాక్షి, అమరావతి వైఎస్ హఠాన్మరణంతో గ్రహణం కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకాన్ని జనవరి 2, 2009న చేపట్టారు. దీనిని వడివడిగా పూర్తిచేసేందుకు అప్పట్లో టెండర్లు కూడా పిలిచారు. కానీ.. సెప్టెంబర్ 2, 2009న ఆయన హఠాన్మరణం చెందడంతో అనంతరం ఆ టెండర్లను రద్దుచేశారు. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశ పనులకు రూ.2,022.20 కోట్లతో పరిపాలన అనుమతిచ్చిన టీడీపీ ప్రభుత్వం.. వాటిని రెండు ప్యాకేజీలుగా విభజించి 4.85 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. అధిక టెండర్లవల్ల ఖజానాపై భారీఎత్తున భారంపడటంతో వాటిని రద్దుచేయాలని ఆదేశించారు. ఇదీ పథకం.. - ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి.. సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. ఈ కాలువ 162.409 కి.మీల నుంచి రోజుకు సుమారు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున విశాఖ జిల్లా అనకాపల్లికి సమీపంలోని పాపయ్యపాలెం వరకు 23 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. - పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, 106 కి.మీల పొడువున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకూ తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ ద్వారా తరలిస్తారు. - ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువలో 14 కి.మీ నుంచి తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లీ తరలిస్తారు. భూదేవి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. - 49.50 కి.మీ. నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. వీఎన్ పురం వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్‌లోకి మళ్లీ ఎత్తిపోస్తారు. - 73 కి.మీ. వద్ద నుంచి తవ్వే ఇంకో లింక్ కెనాల్ మీదుగా తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. - ఇక 102 కి.మీ నుంచి తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. కొండగండేరుడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జవలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు. - మొత్తం మీద ఈ పథకం ద్వారా విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షలు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
'ప్రాజెక్టు పూర్తికి 5వేల ఏళ్లు పడుతుంది'
ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాలు తీరాలంటే 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ అన్నారు. దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టు పురోగతిలో ఎలాంటి ముందడుగు పడలేదని అన్నారు. 2014, 2015, 2016ల్లో ప్రాజెక్టుకు ఏడాదికి మూడు కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను నిర్మాణానికి ఉపయోగించలేదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి రూ.7,214 కోట్ల అంచనా వ్యయం కాగా.. సంవత్సరానికి మూడు కోట్లు విడుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఐదు వేల ఏళ్లు పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీరుకు నోచుకుని 15 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. 16 చిన్న, మధ్య తరహా నదుల ఉన్న ఈ ప్రాంతంలో ఏటా 207 టీఎంసీ నీరు లభ్యమవుతుండగా.. కేవలం 100 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నామని ప్రాజెక్టు పూర్తయితే మిగతా 107 టీఎంసీలను వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి వెంటనే టెండర్లు పిలిచి సంవత్సరానికి కనీసం రూ.5,000 కోట్లయినా ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.