ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం | AP government has started Uttarandhra Sujala Sravanti scheme works | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం

Published Mon, Jul 27 2020 3:16 AM | Last Updated on Mon, Jul 27 2020 8:02 AM

AP government has started Uttarandhra Sujala Sravanti scheme works - Sakshi

సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలు 63.20 టీఎంసీలను తరలించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. రెండో దశలో 106 కి.మీ. పొడవున ప్రధాన కాలువ (లిఫ్ట్‌ కెనాల్‌).. 60 కిలోమీటర్ల పొడవున కొండగండ్రేడు బ్రాంచ్‌ కాలువ పనులకు టెండర్లు పిలవాలని జలవనరుల శాఖను ఆదేశించింది. ఆ తర్వాత దశల వారీగా భూదేవి రిజర్వాయర్‌ (3.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్‌ (3.80 టీఎంసీలు), తాడిపూడి రిజర్వాయర్‌ (3.80 టీఎంసీలు)లను నిర్మించడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తుంది. తద్వారా ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడానికి, పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరాకు ప్రణాళిక రచించింది. ఈ పనులు చేపట్టేందుకు రూ.15,488 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఇందులో సివిల్‌ పనులకు రూ.5,442 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు రూ.1,775 కోట్లు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.8,271 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని  అధికారులు లెక్కకడుతున్నారు.

ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యం
► తొలి దశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్‌ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్‌ జల వనరుల శాఖకు దిశా నిర్దేశం చేశారు.
► రెండో దశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా ఎత్తిపోతలు, కాలువలు తవ్వే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.5,878 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో రూ.2,961 కోట్లు సివిల్‌ పనులు, రూ.785 కోట్లు ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు వ్యయమవుతాయని అంచనా. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీలకు రూ.2,132 కోట్లు అవసరం. పనులకు టెండర్లు పిలిచేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది.
► ఈ పథకం ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

సముద్రంలోకి వెళ్లే జలాల మళ్లింపు
► ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున.. 90 రోజుల్లో 63.20 టీఎంసీలను మళ్లించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి.. 1,300 క్యూసెక్కుల నీటిని 500 మీటర్ల మేర తవ్వే లింక్‌ కెనాల్‌ ద్వారా తరలించి.. అక్కడి నుంచి జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండు దశల్లో ఎత్తిపోసి.. 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌కు తరలిస్తారు.

► మిగిలిన 6,700 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల పొడవున తవ్వే లింక్‌ కెనాల్‌ ద్వారా తరలిస్తారు. పాపాయపాలెం వద్ద నీటిని ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్‌ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేస్తారు. లిఫ్ట్‌ కాలువలో 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి.. కోటగండ్రేడు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు.

► లిఫ్ట్‌ కెనాల్‌లో 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్‌ను నింపుతారు. లిఫ్ట్‌ కెనాల్‌ 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్‌ను నింపుతారు. 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్‌ ద్వారా నీటిని తరలించి.. 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌ను నింపుతారు.

► వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో అప్పట్లోనే టెండర్లు పిలిచారు. అయితే మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠన్మరణంతో ఆ టెండర్లు రద్దయ్యాయి. 

► ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు ప్రజల్ని ఏమార్చే ఎత్తుగడలో భాగంగా.. పథకం తొలి దశ పనులకు రూ.2,022.2 కోట్ల వ్యయంతో పరిపాలన అనుమతి ఇచ్చి, వాటిని రెండు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement