సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల శివారులోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా 12.03 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. మల్కపేట వద్ద రూ.504 కోట్లతో మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లోకి 30 మెగావాట్ల పంపుతో సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోశారు.
మే 23న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. తాజాగా రెండో పంపు వెట్‌రన్‌ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు ప్రారంభించి 1.40 గంటల వరకు కొనసాగించారు. ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రకటించారు. రెండో పంపు ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో మంత్రి కె.తారక రామారావు ఇంజనీర్లను అభినందించారు. దీంతో కాళేశ్వరం 9 ప్యాకేజీ తొలి దశ పూర్తయిందని అధికారు లు తెలిపారు.
సిరిసిల్ల మధ్యమానేరు జలాశయం నీరు 12 కిలోమీటర్లు సొరంగం ద్వారా ప్రయాణించి ధర్మారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌కు చేరాయి. ఆ నీటిని రెండో పంపు ద్వారా మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, 9వ ప్యాకేజీ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ జి.శ్రీనివాస్‌రెడ్డి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు
మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కాళేశ్వరం 9వ ప్యాకేజీలో రెండు పంపుల వెట్‌రన్ విజయవంతం కావడంతో ఈ పంపులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 –20 రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా 9వ ప్యాకేజీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ఎల్లారెడ్డిపేటలో ప్రకటించారు.
దీంతో మధ్యమానేరు నుంచి ఏడాదిలో 120 రోజులపాటు 11.635 టీఎంసీల నీటిని రెండు మోటార్లతో ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్‌ను నింపి.. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సింగసముద్రం మీదుగా బట్టల చెరువు, నర్మాల ఎగువమానేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చనున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉండే వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతారు.
ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 96,150 ఎకరాలకు సాగునీరు అందనుంది. వానాకాలంలో 12వేల ఎకరాలకు మల్కపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని భావిస్తున్నారు. 9 డి్రస్టిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment