తెలంగాణ, మహారాష్ట్రలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శనివారం ప్రాణహితకు వరద భారీగా చేరి గోదావరిలో కలవడంతో కాళేశ్వరం వద్ద 7.9 మీటర్ల ఎత్తున ప్రవాహం తరలిపోతోంది. – కాళేశ్వరం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో కాళేశ్వరం బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల పనులకు ఆటంకాలు ఎదురవుతున్నా ఎల్లంపల్లి బ్యారేజీకి గోదావరి జలాలు పోటెత్తుతుండటంతో దిగువన పనులు ఊపందుకున్నాయి. వర్షాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు ఆలస్యమైనా ఎల్లంపల్లికి చేరుతున్న నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ఇప్పటికే 10 టీఎంసీల నిల్వలు ఉండగా.. ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నుంచి కాళేశ్వరం లోని ప్యాకేజీ–6 మోటార్ల ద్వారా మేడారం రిజర్వాయర్‌కు, అటునుంచి ప్యాకేజీ–7, 8ల ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించేలా నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది.
కౌంట్‌డౌన్ మొదలు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు ఎత్తిపోసేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్ వరకు సమయం పట్టే అవకా శం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్ మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారుల అంచనా.
సెప్టెంబర్‌లో మేడారం రిజర్వాయర్‌కు..
ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిదమయ్యాయి. ఆగస్టు చివరికి మరొకటి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక్కో మోటార్‌కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటి ని తరలించేలా పనులు సాగుతున్నాయి. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఇంకా సిద్ధం కావాల్సి ఉండటంతో డ్రై రన్ జరుగ లేదు. సబ్‌స్టేషన్ ఈ నెలాఖరుకు సిద్ధం కానుండటం తో ఆగస్టు 15కి డ్రై రన్ చేయాలని మంత్రి హరీశ్‌రావు గడువు విధించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఎల్లంపల్లి నుంచి 1.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు.
లైనింగ్ పూర్తయితే లైన్ క్లియర్
ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో 13 మీటర్ల పనే మిగిలింది. లైనింగ్ పనులు సెప్టెంబర్ చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను ఆగస్టు చివరికి సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావి టీ కెనాల్ పూర్తయితే మిడ్ మానేరుకు నీరు తరలించవచ్చు. ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ–6 ద్వారా నీరు తరలించేందుకు ఇబ్బంది లేకున్నా ప్యాకేజీ– 7లో టన్నెల్ లైనింగ్ పనులు పూర్తయితేనే ప్యాకేజీ–8 ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించడం సులభమని ప్రాజెక్టు వర్గాలు చెబు తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ తొలివారంలో ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతల ఆరంభం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఆరంభం అవుతుందని చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment