ఏవీపీ డ్యాం నుంచి మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి తరలుతున్న నీరు
సాక్షి, కాకినాడ/సాక్షి, హైదరాబాద్ /రాజమండ్రి/సీలేరు/విశాఖపట్నం/అమరావతి/బాపట్ల: కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏజెన్సీలో కొండవాగులు పొంగుతుండటంతో మారుమూల గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీలేరు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డొంకరాయి రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. బలిమెల రిజర్వాయర్‌లోకి ప్రవాహ జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు గోదావరిలో వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ఇదిలావుంటే.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఈనెల 31వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో సగటు వర్షపాతం 33.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇదే జిల్లాలోని గోకవరంలో అత్యధికంగా 96 మిల్లీమీటర్లు, పి.గన్నవరం, సఖినేటిపల్లి మండలాల్లో అత్యల్పంగా 9 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. సీలేరు నదికి భారీగా వరద రావడంతో డొంకరాయి డ్యామ్ నుంచి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద జల్లివారిగూడెం వాగు పొంగి రహదారి మీదుగా ప్రవహించడంతో చింతూరు, వీఆర్ పురం మండలాల నడుమ, చింతూరు మండలం ఏజీ కోడేరు, మల్లెతోట, ఉలుమూరు గ్రామాలకు ఆదివారం ఉదయం రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి.
ఇదే మండలం కంసులూరు, గవళ్లకోట నడుమ సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో రోజైన ఆదివారం కూడా చదలవాడ పంచాయతీ పరిధిలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో సుద్దగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు కోనసీమలో పల్లపు ప్రాంతాలు జలమయ మయ్యాయి. విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జల్లులు పడుతూనే ఉన్నాయి.
ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న గోదావరి జలాలు
రిజర్వాయర్లకు జలకళ
నీరులేక వెలవెల బోయిన జోలాపుట్, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్లు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా వీటిలోకి భారీగా ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండటంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా.. ఈ వర్షాలతో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జెన్‌కో అధికారులు అప్రమత్తమై శనివారం అర్ధరాత్రి రెండు గేట్లు ఎత్తి 4,400 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అక్కడి జల విద్యుత్ కేంద్రంలోని ఏవీపీ డ్యాం పూర్తిగా నిండిపోవడంతో మరో రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మోతుగూడెం రిజర్వాయర్‌లోకి పంపిస్తున్నారు. మోతుగూడెం జల విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లలో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
బలిమెలకు 13 వేల క్యూసెక్కులు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేసే బలిమెల రిజర్వాయర్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇప్పటికి 13 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరింది. జోలాపుట్ రిజర్వాయర్‌లోకి 7,800 క్యూసెక్కుల నీరు చేరింది. వర్షాలు కొనసాగితే మరో రెండు రోజుల్లో జోలాపుట్, బలిమెల రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవచ్చని జెన్‌కో వర్గాలు వెల్లడించాయి.
గోదావరికి స్వల్ప వరద ఉధృతి
ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఒకటి రెండు రోజుల్లో కాటన్ బ్యారేజి వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం రాత్రి బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 10.70 అడుగులుగా నమోదైంది. బ్యారేజి నుంచి 69,003 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.73 మీటర్లు, భద్రాచలంలో 16.50 అడుగులు, కూనవరంలో 7.32 మీటర్లు, పోలవరంలో 6.15 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.88 మీటర్ల మేర గోదావరిలో నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
జూరాల వైపు కృష్ణమ్మ పరుగు
మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం సాయంత్రానికి 45వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ఆదివారం అర్ధరాత్రికి లేక సోమవారం ఉదయానికి ఆల్మట్టి గేట్లు ఎత్తే వీలుందని సమాచారం. నారాయణపూర్ నుంచి ఇప్పటికే నీటి విడుదల మొదలైంది.
వర్షాలకు కొట్టుకుపోయిన ఎండు చేపలు
వర్షాలు మత్స్యకారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఫారెస్ట్ భూమిలో 20 రోజుల క్రితం వేటాడిన చేపలను ఎండబెట్టగా.. వర్షాల కురవడంతో అవన్నీ తడిసి కాలువల గుండా కొట్టుకుపోయి సముద్రంలో కలిశాయి. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వీటిని లారీలకు ఎక్కించి సొమ్ము చేసుకుందామనుకున్న మత్స్యకారుల ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలావుంటే.. వర్షంతోపాటు అలల ఉధృతి పెరగటంతో సముద్రంలో లంగర్ వేసిన పడవలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.
31 నాటికి అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం తీరం దాటింది. మరోవైపు ఇక్కడే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. దీనివల్ల ఈనెల 31 నాటికల్లా అల్పపీడనం ఏర్పడనుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోస్తాంధ్రలో నైరుతి రుతు పవనాలు చురుకుదనం సంతరించుకున్నాయి. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులపాటు కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా వర్షం కురవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది.
రాయలసీమలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. మరోవైపు పశ్చిమ దిశ నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రాపురంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూనవరంలో 8, ప్రత్తిపాడు, వేలేరుపాడులో 6, కుకునూరు, పెద్దాపురంలో 5, పోలవరంలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment