
సవరణ అంచనాలకు ఆమోదం
రూ.13,445 కోట్లతో దేవాదుల, రూ.2,121 కోట్లతో తుపాకులగూడెం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల సమర్థ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని దేవాదుల, తుపాకులగూడెం, ఎస్సారెస్పీ స్టేజ్–2 ప్రాజెక్టుల్లో చేసిన మార్పులకు అనుగుణంగా అంచనా వ్యయాలను సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో దేవాదుల అంచనాను రూ.9,427.73 కోట్ల నుంచి రూ.13,445.44 కోట్లకు సవరించారు. తొలుత ఈ ప్రాజెక్టు కింద గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని తీసుకుని వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్ణీత ఆయకట్టుకు అందించేందుకు 38 టీఎంసీలు సరిపోవంటూ కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచింది. ఆ స్థాయి నీటి నిల్వలకు సరిపోయేందుకు కొత్తగా రూ.3,170 కోట్లతో మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. దాంతో పాటు మరిన్ని మార్పులు, చేర్పులు, పెరిగిన రేట్లతో అంచనా వ్యయం రూ.13,445.44 కోట్లకు చేరింది.
ఇక కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపా కులగూడెం బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఓకే చెప్పింది. మారిన ప్రతిపా దనలతో తుపాకులగూడెం బ్యారేజీ అంచనాలను కొత్తగా రూ.2,121 కోట్లతో సిద్ధం చేశారు. అయితే కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ విధివిధానాలను అనుసరించి 2012–13 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ల (ఎస్‌ఎస్‌ఆర్)తో నిర్మాణ పనులను చేస్తా మంటూ ఆ కాంట్రాక్టు సంస్థ ముందుకు రావడంతో.. వారికే అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎస్సీరెస్పీ స్టేజ్–2లో జీవో 146 అమలు చేయడం, కొన్ని నిర్మా ణాలు అదనంగా చేరడంతో అంచనా వ్య యాన్ని రూ.1,220.41 కోట్లకు పెంచుతూ అనుమతులు మంజూరు చేశారు.