సాక్షి, అమరావతి: ‘అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటారు. వాటికి సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని కోరితే మాత్రం స్పందించరు. కేవలం ఫిర్యాదులు స్వీకరించడానికే బోర్డు ఉందనుకుంటున్నారా?..’ అంటూ తెలుగు రాష్ట్రాలపై గోదావరి నదీ జలాల బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీపీఆర్‌లు ఇచ్చిన తర్వాతే అనుమతి లేని ప్రాజెక్టులపై చర్చిస్తామని స్పష్టం చేసింది. బోర్డు ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఇరు రాష్ట్రాలు వారం రోజుల్లోగా డీపీఆర్‌లు సమర్పిస్తామని హామీ ఇచ్చాయి. ఛైర్మన్ హెచ్‌కే సాహూ నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు సమావేశమైంది. పునర్విభజన చట్టం మేరకు గోదావరిపై ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే గోదావరి బోర్డు లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, అయితే ఎలాంటి అనుమతి లేకుండానే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాలు బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.
కొత్త ప్రాజెక్టులుగా ఎందుకు పరిగణించరు?
రీ–ఇంజనీరింగ్ పేరుతో తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులు చేపడుతూ వాటి సామర్థ్యాలను పెంచేస్తోందని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలను చేపట్టారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల సామర్థ్యం 33 టీఎంసీలైతే తాజాగా రీ–ఇంజనీరింగ్ పేరుతో సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచారని వివరించారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల కింద గతంలో 3.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 6.74 లక్షల ఎకరాలకు పెంచారని పేర్కొన్నారు. అప్పట్లో రెండు ఎత్తిపోతల పథకాల వ్యయం రూ.3,505 కోట్లయితే ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకం వ్యయమే రూ.13,384.80 కోట్లకు చేరుకున్నందున కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినందున దాన్ని పాత ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించాలని నిలదీశారు.
అవి ఉమ్మడి హయాంలో ప్రాజెక్టులే
ఆంధ్రప్రదేశ్ వాదనలపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తమ అవసరాలకు అనుగుణంగా రీ–ఇంజనీరింగ్ చేశామన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పలు ప్రాజెక్టులను చేపడుతోందని ఫిర్యాదు చేశారు.
ఒక్కటైనా డీపీఆర్ ఇచ్చారా?
ఇరు రాష్ట్రాల వాదనలను సావధానంగా విన్న బోర్డు ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను కోరుతున్నా ఇప్పటివరకూ ఒక్కటి కూడా ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. డీపీఆర్‌లు ఎప్పుడు ఇస్తే అప్పుడే వాటిపై చర్చిద్దామని స్పష్టం చేశారు. దీంతో వారం రోజుల్లోగా డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డుకు హామీ ఇచ్చారు. డీపీఆర్‌లు అందాక మరోసారి సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది.
గోదావరి బోర్డు భేటీలో నిర్ణయాలు
– గోదావరి జలాల వినియోగం లెక్కలు తేల్చేందుకు ఇరు రాష్ట్రాల్లోనూ 120 ప్రాంతాల్లో టెలీమీటర్ల ఏర్పాటు.
– తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం బ్యారేజీ, తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో 8 ప్రదేశాల్లో టెలీమీటర్ల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అంగీకారం.
– గోదావరి ఉప నది ఇంద్రాంతిపై మధ్య కొలాబ్ ప్రాజెక్టు ద్వారా తమకు కేటాయించిన నీటిని వినియోగించుకుంటామన్న ఒడిశా సర్కార్ వినతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకారం.
– మధ్య కొలాబ్ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇచ్చేందుకు బోర్డు ఆమోదం.
Comments
Please login to add a commentAdd a comment