గోదారి గుండెల్లో కాలుష్యం గునపాలు | Pollution in Godavari waters reaches high level | Sakshi
Sakshi News home page

గోదారి గుండెల్లో కాలుష్యం గునపాలు

Published Thu, Feb 27 2025 5:30 AM | Last Updated on Thu, Feb 27 2025 5:30 AM

Pollution in Godavari waters reaches high level

గోదావరి జలాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం 

ప్రమాణాలకు మించి బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, బ్యాక్టీరియా 

నదిలోకి యథేచ్ఛగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు 

పొలాల్లో రసాయన ఎరువులు, మందుల వాడకమూ కారణమే 

అడ్డగోలుగా గనుల తవ్వకం, అడవుల నరికివేత కూడా కాలుష్యకారకం 

కేంద్ర జల సంఘం, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త అధ్యయనంలో వెల్లడి 

శుద్ధి చేయని గోదావరి జలాలు తాగడం శ్రేయస్కరం కాదని సూచన

సాక్షి, అమరావతి: జీవ నది గోదావరికి మానవుడే శాపమయ్యాడు. అనేక రకాల వ్యర్థాలు, రసాయనాలను నదిలో కలిపేసి జలాలను కలుషితం చేసేస్తున్నాడు. దీంతో ఒకప్పుడు నదిలోకి దిగి దోసిటలో తీసుకొని తాగే నీరు ఇప్పుడు శుద్ధి చేయకుండా తాగకూడదన్న దశకు చేరుకుంది. గోదావరి జలాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) హెచ్చరిస్తున్నాయి. 

ఈ రెండు సంస్థలు కలిసి గోదావరి జలాలపై అధ్యయనం చేయగా.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డర్స్‌ (బీఐఎస్‌) నిర్దేశించిన ప్రమాణాలకంటే అధికస్థాయిలో కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది.  పశి్చమ కనుమల్లో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌ వద్ద పర్వత శ్రేణుల్లో జన్మించే గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,465 కిమీల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, ప్రవర, మంజీర, మానేరు ప్రధాన ఉప నదులు కలుస్తాయి.

 గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్‌) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్‌ 9.5 శాతం. దేశంలో అతి పెద్ద నదుల్లో గోదావరి రెండో స్థానంలో ఉంది. ఇంత పెద్ద నదినీ మానవుడు కలుషితం చేసేస్తున్నట్లు వెల్లడైంది.

పారిశ్రామిక వ్యర్థాలు, క్రిమిసంహారక మందుల వల్లే
సీడబ్ల్యూసీ, సీపీసీబీ నివేదిక ప్రకారం.. గోదావరి బేసిన్‌లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సాగు భూమి విస్తీర్ణమూ ఎక్కువే. పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరి, ఉప నదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు. పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటితో ఈ ఎరువులు, మందులు గోదవరిలో కలిసిపోతున్నాయి. 

గోదావరి బేసిన్‌లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీటిని శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలేస్తుండటం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవులను నరికివేస్తుండటం వల్ల భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండటం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది. ఇలా మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారింది.  

నేరుగా తాగితే రోగాలు కొనితెచ్చుకోవడమే 
బీఐఎస్‌ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ఫీకల్‌ కోలీఫామ్‌ (ప్రమాదకర బ్యాక్టీరియా) ఆనవాళ్లు ఉండకూడదు. కానీ.. గోదావరి జలాల్లో ఫీకల్‌ కోలీఫామ్‌ మిల్లీ లీటర్‌కు 4 నుంచి 7 వరకు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్‌ కోలీఫామ్‌ (బ్యాక్టీరియా) లీటర్‌ నీటికి 50 లోపు ఉండొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్‌ నీటికి 93 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.

బీఐఎస్‌ ప్రమాణాల ప్రకారం లీటర్‌ నీటిలో ఘనవ్యర్థాలు (టీడీఎస్‌) 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్‌ నీటిలో 8 గ్రాముల మేర ఘన వ్యర్థాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. అందువల్ల గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

బీఐఎస్‌ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు..
1.    పీహెచ్‌ (ఆమ్లత్వం) 6.5 నుంచి 8.5 శాతం లోపు 
2.     డీవో (డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌) లీటర్‌ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 
3.    బీవోడీ (బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) లీటర్‌ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 
4.    టోటల్‌ కోలీఫామ్‌ (బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 
5.    ఫీకల్‌ కోలీఫామ్‌ (ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు 
6.    టీడీఎస్‌ (టోటల్‌ డిజాల్‌్వడ్‌ సాలిడ్స్‌) లీటర్‌ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement