సాక్షి, హైదరాబాద్: గోదావరి నది నికర జలాల్లో మిగులు లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి న నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఎలా చేపడతారని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖల అధికారులు నిలదీశారు. గోదావరి బేసిన్‌లో రెండు రాష్ట్రాల్లో పూర్తయిన, నిర్మాణం , ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకే 306 టీఎంసీల మేర నికర జలాల కొరత ఉందని సీడబ్ల్యూసీ తేల్చి న అంశాన్ని ఎత్తిచూపారు.
ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తరలిస్తే రాష్ట్రాల్లో ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ స్పందిస్తూ.. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేని మాట వాస్తవమేనని అంగీకరించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపడతామని చెప్పడంతో ఛత్తీస్‌గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మా కోటా నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని తేల్చిచెప్పారు.
కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 71వ పాలక మండలి సమావేశం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందరసింగ్ వోరా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్, సీఈ రమేశ్, అంతర్రాష్ట్ర విభాగం డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనుసంధానానికి సిద్ధమన్న ఎన్‌డబ్ల్యూడీఏ
గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీ లను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించడానికి రూపొందించిన గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు.
ఇందులో తెలంగాణకు 45, ఏపీకి 44, తమిళనాడుకు 40, కర్ణాటకకు 9.9, పుదుచ్చేరికి 2.1 టీఎంసీలు ఇస్తామని పేర్కొన్నా రు. దీనిపై ఇప్పటికే నాలుగుసార్లు రాష్ట్రాలతో సంప్రదింపు లు జరిపామని.. అనుసంధానం పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ చెప్పడంతో ఏపీ, తెలంగా ణ, ఛత్తీస్‌గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనుసంధానానికి అంగీకరించమన్న ఛత్తీస్‌గఢ్
కోటా నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతున్నామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మీరు ప్రాజెక్టులు కట్టేలోగా మహానది నుంచి గోదావరికి జలాలను తరలిస్తామని.. వాటిని కావేరికి తీసుకెళ్తామని ఛత్తీస్‌గఢ్ అధికారులకు ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ సర్దిచెప్పబోగా ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహానది నుంచి గోదావరికి జలాలను తెల్చి నా సరే.. రెండు రాష్ట్రాల అవసరాలు తీర్చాకే కావేరికి గోదావరిని తరలించాలని తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కల్పించేలా చేపట్టే గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు జారీ చేసిన తర్వాతే నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది.
ఛత్తీస్‌గఢ్ సమ్మతి తర్వాతే...
అన్ని రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి రాతపూర్వక సమ్మ తి తీసుకున్న తర్వాతే అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని, అనంతరం డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఖరారు చేసి సంబంధిత రాష్ట్రాలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment