సాక్షి, అమరావతి: గోదావరి – కావేరి నదుల అను సంధానంపై వాటి పరివాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. అనుసంధానం ప్రతిపాదనపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వచ్చే నెల 11న నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశం అజెండాలో గోదావరి – కావేరి అనుసంధానం ఒప్పందాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ చేర్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంద్రావతి సబ్ బేసిన్‌లో బచావత్ ట్రిబ్యునల్ తమకు చేసిన కేటాయింపుల్లో వాడుకోని నీటిలో 141.3 టీఎంసీలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే నిలదీసింది. తమను సంప్రదించకుండా తమ కోటా నీటిపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోకుంటే న్యాయస్థానంలో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది.
గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా నీటి లభ్యతను తేల్చాకే అనుసంధానాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఒప్పందాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం అజెండాలో చేర్చడంపై నీటి పారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నీటి లభ్యత తేల్చకుండానే
గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2019 ఫిబ్రవరిలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు 80 టీఎంసీల చొప్పున కేటాయించి ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను మిగిలిన నీటిని కర్ణాటకకు ఇవ్వాలని ప్రతిపాదించింది.
నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సూచించడంతో ఎన్‌డబ్ల్యూడీఏ 2021లో మరో ప్రతిపాదన చేసింది. కావేరికి గోదావరి జలాలను తరలించే ప్రాంతాన్ని అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి ఇచ్చంపల్లి (జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా)కి మార్చింది.
ఇచ్చంపల్లి వద్ద ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు అదనంగా 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. నాగార్జున సాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా ప్రతిపాదించింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. నికర జలాలు, వరద జలాలను ఎలా వర్గీకరిస్తారని ప్రశి్నంచాయి. తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని అభ్యంతరం చెప్పడంతో ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.
కనీసం ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించకుండానే
ఛత్తీస్‌గఢ్‌కు ఇంద్రావతి బేసిన్‌లో కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా సోమశిల, కండలేరుకు తరలించి అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లేలా తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది.
ఈ క్రమంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్‌్కఫోర్స్ కమిటీ ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను సంప్రదించకుండానే బేసిన్‌లోని మిగతా రాష్ట్రాలతో మార్చి 6న హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించకపోవడంపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఛత్తీస్‌గఢ్ సర్కారుతో ఈ అంశంపై చర్చిస్తారని టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరాం ఆ సమావేశంలో పేర్కొన్నారు.
కానీ.. ఇప్పటివరకూ ఛత్తీస్‌గఢ్‌ను కేంద్రం సంప్రదించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏకంగా అనుసంధానంపై ఒప్పందాన్ని అజెండాగా చేర్చుతూ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment