తెలంగాణకు తీవ్ర కరెంట్ కష్టాలు | power problems to telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు తీవ్ర కరెంట్ కష్టాలు

Published Mon, Jul 28 2014 1:26 AM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

తెలంగాణకు తీవ్ర కరెంట్ కష్టాలు - Sakshi

తెలంగాణకు తీవ్ర కరెంట్ కష్టాలు

 అసలే లోటు.. ఆపై పీపీఏల రద్దు పోటు

* తాజాగా జాతీయగ్రిడ్ కారిడార్‌లో దక్కని బుకింగ్
* ఉత్తరాది కరెంటును తన్నుకుపోయిన తమిళనాడు
* ఛత్తీస్‌గఢ్ కరెంటుకూ రెండున్నరే ళ్లు ఆగాల్సిందే
* ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే కొత్త ప్లాంట్లూ లేవు
* విభజన హడావుడిలో కొరవడిన ముందుచూపు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వరుసగా కరెంటు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒకదాని వెంట మరొక ఇబ్బంది వచ్చి పడుతోంది. రాష్ర్టం ఏర్పడిన పక్షం రోజుల్లోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏల) రద్దు రూపంలో తొలి దెబ్బ తగలగా.. జాతీయ గ్రిడ్ నుంచైనా అదనపు విద్యుత్‌ను పొందాలని ఆశిస్తే తాజాగా తమిళ తంబిలు దానికి గండికొట్టారు. మనకంటే ముందే ఆ కోటాను సొంతం చేసుకున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ వరకు ఏర్పాటైన లైను ద్వారా ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అవకాశమేర్పడిన సంగతి తెలిసిందే.
 
అయితే ఈ లైనును తమిళనాడు ఇప్పటికే బుక్ చేసుకోవడంతో తెలంగాణకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు ప్రస్తుతం లైన్లు లేవు. దీన్ని ఏర్పాటుకు రెండున్నరేళ్లకుపైగా సమయం పట్టే అవకాశముంది. మరోవైపు అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల ఏర్పాటుకూ కొంత సమయం పడుతుంది. మొత్తంమీద ఈ పరిస్థితి తెలంగాణకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. ఎటు చూసినా రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం వెన్నాడుతూనే ఉంది.
 
తమిళనాడు ముందుచూపు
ఒకవైపు రాష్ట్రంలో విభజన ప్రక్రియ జరుగుతూ పాలన స్తంభించగా.. మరోవైపు తమిళనాడు ముందుచూపుతో వ్యవహరించింది. షోలాపూర్-రాయచూర్ రెండో లైను ద్వారా సరఫరా అయ్యే సుమారు 1,250 మెగావాట్లలో.. సుమారు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను తమిళనాడు ముందుగానే ‘బుక్’ చేసుకుంది. నిజానికి మొదటి లైనును కూడా ఆ రాష్ర్టం ఇదే విధంగా బుక్ చేసుకుంది. రెండో లైను విషయంలోనైనా ముందు జాగ్రత్త వహించాలని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు అప్పుడే అభిప్రాయపడ్డాయి.
 
అయితే రాష్ర్ట విభజన ప్రక్రియ హ డావుడిలో పడిపోయి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెజారిటీ విద్యుత్‌ను తమిళనాడు ఎగరేసుకుపోవడంతో మిగిలిన 250 మెగావాట్ల కోసం మిగతా దక్షిణాది రాష్ట్రాలు (తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి) పోటీపడాల్సి వస్తోంది. దీంతో జాతీయ గ్రిడ్ ఆవిష్కృతమైనప్పటికీ రాష్ర్ట విద్యుత్ కష్టాలు తీరేందుకు అవకాశం లేకుండా పోయింది.
 
ఏపీ నుంచీ వచ్చే పరిస్థితి లేదు
ప్రస్తుతం తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల(ఎంయూ) డిమాండ్ ఉంది. సరఫరా మాత్రం 131 ఎంయూలకే పరిమితమైంది. దీంతో కోతలు అమలు చేయాల్సి వస్తోంది. ఈ లోటును ఇప్పటికిప్పుడు పూడ్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేద్దామంటే.. అక్కడ కూడా విద్యుత్ కోతలు రాజ్యమేలుతున్నాయి. ఆ రాష్ట్రానికి కూడా అదనపు విద్యుత్ వచ్చేది 2016 జూన్ తర్వాతే.
 
అది కూడా ఒడిశాలోని అంగుళ్ నుంచి శ్రీకాకుళం మీదుగా వేమగిరి వరకూ నిర్మితమవుతున్న 765 కేవీ సామర్థ్యం కలిగిన డబుల్ సర్క్యూట్(డీసీ) లైను అందుబాటులోకి వస్తేనే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అవకాశ ముంది. అంటే ఏపీ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు ఇప్పట్లో అవకాశం లేదు. పైగా ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ వల్ల సింగూర్ జల విద్యుత్ కేంద్రం ఆ రాష్ట్రానికే దక్కింది. ఈ రకంగానూ తెలంగాణకు నష్టం వాటిల్లింది.
 
ఛత్తీస్‌గఢ్ కరెంటూ ఇప్పుడే రాదు
ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఏపీఈఆర్‌సీకి తెలంగాణ డిస్కంలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఒప్పందం రూపంలో కాకుండా బిడ్డింగ్ రూపంలో ముందుకు వెళ్లాలని ఈఆర్‌సీ తేల్చిచెప్పింది. కానీ తెలంగాణ ఈఆర్‌సీ ఏర్పాటైన తర్వాత ఎంవోయూ రూపంలోనే ముందుకు వెళ్లాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ రావాలంటే ప్రత్యేక విద్యుత్ లైను అవసరం. దీన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే రెండున్నరేళ్లకు పైగానే పడుతుందని పవర్‌గ్రిడ్ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.
 
అదనపు ఉత్పత్తికీ ఆలస్యమే
రాష్ర్టంలో తీవ్ర కొరతను దృష్టిలో పెట్టుకుని రానున్న మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ జెన్‌కో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో పాల్వంచ వద్ద 800 మెగావాట్లు, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి వద్ద 800 మెగావాట్లు, మణుగూరులో 4 వేల మెగావాట్లు, రామగుండం వద్ద 800 మెగావాట్లు కలిపి మొత్తం 6,400 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ కేంద్రాలను వచ్చే మూడేళ్లలో నిర్మించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పాల్వంచ ప్లాంటుకు అవసరమైన భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ తంతునూ జెన్‌కో పూర్తిచేసింది.
 
ఈ ప్లాంటుకు పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) కూడా తయారైంది. అయితే, ఈ ప్లాంట్లన్నీ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం నాలుగేళ్లయినా పట్టే అవకాశం ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను తీసుకుంటే.. 600 మెగావాట్ల కేటీపీపీ మాత్రమే వచ్చే ఏడాదిలో వస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌కు ఇది ఏ మాత్రమూ సరిపోదు. పులిచింతల, జూరాల వంటి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరుగుతున్నా.. నీటి వనరుల లభ్యత ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి వీటిపై భరోసా పెట్టుకోలేము. మొత్తంమీద ఎటు చూసినా తెలంగాణలో ఇప్పుడప్పుడే విద్యుత్ కష్టాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు.
 
ముందుచూపు ఫలితం
తమిళనాడులో రెండేళ్ల క్రితం విద్యుత్ లోటు ఏకంగా 50 మిలియన్ యూనిట్లు ఉండేది. వారంలో మూడు రోజులపాటు పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలయ్యేవి. రాష్ర్ట రాజధానిలోనూ కనీసం ఐదారు గంటల పాటు సరఫరా ఆగిపోయేది. ఈ నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి షోలాపూర్-రాయచూర్ లైను ద్వారా ఉత్తరాది రాష్ట్రాల నుంచి లభ్యమయ్యే విద్యుత్‌లో ఏకంగా 2 వేల మెగావాట్లను ఇతర రాష్ట్రాలకంటే ముందే బుక్ చేసుకుంది. దాన్ని 25 ఏళ్లపాటు పొందేందుకు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది.
 
అలాగే రాష్ట్రంలోని అనేక ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ల నుంచి మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో రెండేళ్లలోనే లోటును అధిగమించింది. ఇప్పుడు రబీ, వేసవి కాలంలోనూ పెద్దగా కోతల్లేవు. పరిశ్రమలకు పవర్ హాలిడే నుంచి విముక్తి లభించింది. గృహాలకు నామమాత్రంగానే కోతలు పెడుతున్నారు. రాష్ర్టంలో 290 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంటే ఏకంగా 280 మిలియన్ యూనిట్లను ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement