భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తం
మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగుతారని అంచనా
గ్రామాలను జల్లెడ పడుతున్న కూంబింగ్ పార్టీలు
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆదివాసీలు
చింతూరు :ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. మన జిల్లా సరిహద్దులకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీని ప్రభావం విలీన మండలాలపై పడే అవకాశముండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సాక్లేర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఈ ఎన్‌కౌంటర్లో వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న , తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి హరిభూషణ్ భార్య సోనీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజుతో కలిపి మొత్తం 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందని భావిస్తున్న పోలీసులు అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులు జిల్లా సరిహద్దుల వైపు వచ్చే అవకాశముందని భావిస్తున్న పోలీసులు పొరుగు రాష్ట్రాల సహకారంతో అదనపు బలగాలను మోహరించినట్టు సమాచారం.
మావోయిస్టులకు వరుస దెబ్బలు
ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులకు ఇటీవల వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2015-16లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో సుమారు 70 మంది వరకు మావోయిస్టులు మృతిచెందారు. గతేడాది ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో
ఎన్‌కౌంటర్లో విలీన మండలాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న శబరి ఏరియా కమిటీ అప్పటి కార్యదర్శి మొప్పు మొగిలి అలియాస్ నరేష్, అతని గన్‌మెన్ తెల్లం రాములు హతమయ్యారు. ఇటీవల చింతూరు మండలం మల్లంపేట సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో ప్రస్తుత శబరి ఏరియా కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ మృతిచెందాడు. విశాఖ, తూర్పు సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా మంగళవారం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. 2014లో ఇదే ప్రాంతంలో జరిగినఎన్‌కౌంటర్‌లో అప్పటి కేకేడబ్ల్యూ(ఖమ్మం, కరీంనగర్, వరంగల్) కమిటీకి చెందిన 9 మంది మావోయిస్టులు మృతిచెందారు. నగేష్ ఎన్‌కౌంటర్ అనంతరం విలీన మండలాల్లో సుమారు రెండు నెలలపాటు స్తబ్ధుగా వున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే నేపథ్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగల నడుమ సోమవారం చెట్లను నరికి రహదారిని దిగ్బంధించారు.
తద్వారా మావోయిస్టులు తిరిగి శబరి ఏరియా కమిటీని బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఖాళీగావున్న శబరి ఏరియా కమిటీ కార్యదర్శి బాధ్యతలను ఓ మహిళా నాయకురాలికి అప్పగించనున్నట్టు సమాచారం. మావోయిస్టులకు అత్యంత పట్టు కలిగినసరిహద్దుల్లోని పామేడు, గొల్లపల్లి ప్రాంతాల్లోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో పోలీసులు పైచేయి సాధించినట్టయింది. గతంలో తమ డిమాండ్ల సాధనకు సుక్మా జిల్లా కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఇదే ప్రాంతంలో దాచి ఉంచారు.
హడలిపోతున్న ఆదివాసీలు
తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ నిమిత్తం పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతుండడంతో ఆదివాసీలు హడలిపోతున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ఈ ఘటనపై పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశముండడంతో ఎవరిని టార్గెట్ చేస్తారోననే భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
మావోయిస్టులకు వరుస దెబ్బలు
Published Wed, Mar 2 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement