Cinturu
-
అడవి నుంచి అంతరిక్షానికి..!
చింతూరు: ఎంతో సాహసోపేతమైన అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు ఓ అడవిబిడ్డ ఆరాట పడుతున్నాడు. అంతరిక్షయానానికి వెళ్లడం ద్వారా దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం తనకు అనుమతితో పాటు ఆర్థికసాయం చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. మండలం కొత్తపల్లికి చెందిన దూబి భద్రయ్య మన రాష్ట్రం నుంచి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి వ్యక్తిగా కీర్తి గడించాడు. ఆ స్ఫూర్తితో అతడు అంతరిక్ష యానానికి వెళ్లాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. గిరిబిడ్డలకు శిక్షణ 2016లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భద్రయ్య 2017–18లో 17 మంది గురుకుల విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణనివ్వడం ప్రారంభించాడు. భద్రయ్య శిక్షణలో రాటుదేలిన వారిలో వీఆర్ పురం మండలానికి చెందిన కుంజా దుర్గారావు, అడ్డతీగల మండలానికి చెందిన భానుప్రకాష్‌లు ఎవరెస్టును అధిరోహించారు. ప్రస్తుతం భద్రయ్య అరకు స్పోర్ట్స్ పాఠశాలలో స్పోర్ట్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అంతరిక్షయానానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి, ఆర్థికసాయం కోసం ప్రయతి్నస్తున్నాడు. గతంలో నాసా ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లిన మన దేశానికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్ఫూర్తితో తానుకూడా అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు భద్రయ్య తెలిపాడు. గిరిబిడ్డల ప్రతిభను ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నానని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అవకాశం కలి్పంచాలని అతను కోరాడు. ఈ మేరకు చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణను కలసి తన లక్ష్యాన్ని వివరించాడు. అంతరిక్షయానం నా స్వప్నం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సమయంలోనే అంతరిక్ష యాత్ర చేయాలని స్వప్నంగా పెట్టుకున్నా. ఇది ఆర్థికంగా, ప్రయాసతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వ సాయం కోసం వేచిచూస్తున్నా. ప్రభుత్వం ఆదుకుంటే గిరిబిడ్డల సత్తా ప్రపంచానికి చాటి చెబుతా. ఎవరెస్టు అధిరోహించిన సమయంలో గత ప్రభుత్వం రూ.10 లక్షలతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. – దూబి భద్రయ్య కుటుంబ నేపథ్యమిది.. కొత్తపల్లికి చెందిన దూబి భీమయ్య, కన్నమ్మల ముగ్గురు సంతానంలో పెద్దవాడు దూబి భద్రయ్య. భార్య బుచ్చమ్మ గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబంలో జని్మంచిన భద్రయ్య తొలి నుంచి పర్వతారోహణపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుని 2016లో ఆ కల నెరవేర్చుకున్నాడు. -
తూర్పుగోదావరిలో దారుణ హత్య
సాక్షి, చింతూరు: తూర్పుగోదావరి ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడినే అన్న హత్య చేయించిన ఘటన చింతూరు మండలం తుమ్మల గ్రామంలో జరిగింది. సోదరులైన సోడే ముత్తయ్య, నాగిరెడ్డిల మధ్య పొలం వివాదం నడుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎలాగైనా తమ్ముడిని చంపాలని అన్న సోడే ముత్తయ్య నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కిరాయి వ్యక్తులతో తమ్ముడు నాగిరెడ్డిని హత్య చేయించాడు. మృతదేహాన్ని నిందితులు వాగులో పూడ్చిపెట్టారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మావోయిస్టులకు వరుస దెబ్బలు
భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తం మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగుతారని అంచనా గ్రామాలను జల్లెడ పడుతున్న కూంబింగ్ పార్టీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆదివాసీలు చింతూరు :ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. మన జిల్లా సరిహద్దులకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీని ప్రభావం విలీన మండలాలపై పడే అవకాశముండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సాక్లేర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న , తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి హరిభూషణ్ భార్య సోనీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజుతో కలిపి మొత్తం 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందని భావిస్తున్న పోలీసులు అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు జిల్లా సరిహద్దుల వైపు వచ్చే అవకాశముందని భావిస్తున్న పోలీసులు పొరుగు రాష్ట్రాల సహకారంతో అదనపు బలగాలను మోహరించినట్టు సమాచారం. మావోయిస్టులకు వరుస దెబ్బలు ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులకు ఇటీవల వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2015-16లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో సుమారు 70 మంది వరకు మావోయిస్టులు మృతిచెందారు. గతేడాది ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్లో విలీన మండలాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న శబరి ఏరియా కమిటీ అప్పటి కార్యదర్శి మొప్పు మొగిలి అలియాస్ నరేష్, అతని గన్‌మెన్ తెల్లం రాములు హతమయ్యారు. ఇటీవల చింతూరు మండలం మల్లంపేట సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రస్తుత శబరి ఏరియా కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ మృతిచెందాడు. విశాఖ, తూర్పు సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంగళవారం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. 2014లో ఇదే ప్రాంతంలో జరిగినఎన్కౌంటర్లో అప్పటి కేకేడబ్ల్యూ(ఖమ్మం, కరీంనగర్, వరంగల్) కమిటీకి చెందిన 9 మంది మావోయిస్టులు మృతిచెందారు. నగేష్ ఎన్కౌంటర్ అనంతరం విలీన మండలాల్లో సుమారు రెండు నెలలపాటు స్తబ్ధుగా వున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే నేపథ్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగల నడుమ సోమవారం చెట్లను నరికి రహదారిని దిగ్బంధించారు. తద్వారా మావోయిస్టులు తిరిగి శబరి ఏరియా కమిటీని బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఖాళీగావున్న శబరి ఏరియా కమిటీ కార్యదర్శి బాధ్యతలను ఓ మహిళా నాయకురాలికి అప్పగించనున్నట్టు సమాచారం. మావోయిస్టులకు అత్యంత పట్టు కలిగినసరిహద్దుల్లోని పామేడు, గొల్లపల్లి ప్రాంతాల్లోనే ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడంతో పోలీసులు పైచేయి సాధించినట్టయింది. గతంలో తమ డిమాండ్ల సాధనకు సుక్మా జిల్లా కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఇదే ప్రాంతంలో దాచి ఉంచారు. హడలిపోతున్న ఆదివాసీలు తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ నిమిత్తం పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతుండడంతో ఆదివాసీలు హడలిపోతున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ఈ ఘటనపై పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశముండడంతో ఎవరిని టార్గెట్ చేస్తారోననే భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. -
కానలో కలవరం
చింతూరు / నెల్లిపాక : మన్యం గుబులుగుబులుగా ఉంది. రానున్న వారం రోజుల్లో ఎలాంటి కార్చిచ్చు రగులుతుందోనని కలవరపడుతోంది. మావోయిస్టులు మంగళవారం నుంచి వచ్చేనెల 3 వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహించనుండడమే ఇందుకు కారణం. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తూ మావోయిస్టులు వేసిన పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా కనిపిస్తున్నాయి. నెల్లిపాక మండలం మాధవరావుపేట, బండిరేవు గ్రామాల సమీపంలో జాతీయరహదారిపై కర్రలతో తాత్కాలిక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాయుద్ధంలో అమరులైన వీరుల ఆశయాలను సాధించాలని, వారి త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహించాలని పోస్టర్లు, బ్యానర్లలో పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేట్ కంపెనీలకు అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. విప్లవ విజయంతోనే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నా రు. ఎటపాకలోని పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే బ్యానర్లు కని పించడం, నిత్యం రద్దీగా ఉండే భద్రాచలం, చర్ల రహదారిలో రెండుచోట్ల బ్యానర్లు కట్టడం విశేషం. ఛత్తీస్‌గఢ్‌లో వరుస లొంగుబాట్లతో ఆందోళన చెందుతున్న మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా క్యాడర్‌ను భారీగా రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. దళాల్లో చేరిన వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో స్థానం కల్పించి భారీ దాడులకు వినియోగించే అవకాశముందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారోత్సవాల సమయంలో దాడులకు పాల్పడడం ద్వారా ఛత్తీస్‌గఢ్ పోలీసులకు సవాల్ విసరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు సమాచారం. గాలింపు ముమ్మరం వారోత్సవాల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలతో నిఘాను, అడవుల్లో గాలింపును ముమ్మరం చేశారు. పలుచోట్ల మావోయిస్టుల బ్యానర్లను, పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టులు దండకారణ్య సరిహద్దుల్లో భారీ ఘటనలకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. దండకారణ్యంలోని దట్టమైన అటవీప్రాంత గ్రామాల్లో వారోత్సవాల సభలు నిర్వహించే అవకాశముండడంతో వాటిని అడ్డుకోవాలని పోలీసులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు దంతెవాడ జిల్లా కిరండోల్ నుంచి విశాఖపట్నంకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తున్న గూడ్స్‌రైలును అడ్డుకున్న మావోయిస్టులు డ్రైవర్ నుంచి వాకీటాకీలు, బ్యాటరీలను తీసుకెళ్లారు. ఈ సంఘటన తో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును జగ్దల్పూర్ వరకు మాత్రమే నడుపుతున్నట్టు సమాచారం. కాగా వారోత్సవాల సందర్భంగా ఎలాంటి విపరిణామాలు చోటు చేసుకుంటాయో, అడకత్తెరలో పోకల్లా తాము ఎలాంటి అవస్థలు పడాల్సి వస్తుందోనని మన్యవాసులు గుబులు చెందుతున్నారు.