ఇప్పటికే ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
వ్యాప్కోస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న లైడార్ సర్వే
ప్రాజెక్టు పనులు ప్రారంభించే సన్నాహాల్లో ఏపీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోకుండా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే సిద్ధం చేయగా, పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఖరారు చేసేందుకు వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్(లైడార్) సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది.
మూడు విభాగాలు(సెగ్మెంట్స్)గా ప్రాజెక్టును విభజించి నిర్మించనుండగా, రెండు విభాగాలకు సంబంధించిన లైడార్ సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. మూడో సెగ్మెంట్‌కు సంబంధించిన లైడార్ సర్వే మరో ఒకటిరెండు రోజుల్లో పూర్తి కానుంది. లైడార్ సర్వే ద్వారా తీసిన త్రీడీ, పోటోగ్రఫిక్ చిత్రాల ఆధారంగా కాల్వలు/సొరంగాల అలైన్‌మెంట్‌తోపాటు లెవల్‌ను ఖరారు చేస్తారు. సర్వే పూర్తయితే ప్రాజెక్టు పనులను ఏపీ ప్రారంభిస్తుంది.
రెండు సెగ్మెంట్ల సర్వే పూర్తి
తొలి సెగ్మెంట్‌లో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధానకాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులను పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్‌లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ ప్రతిపాదించింది.
రెండో సెగ్మెంట్ కింద కృష్ణానది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో గుంటూరు జిల్లాలో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. ఈ సెగ్మెంట్‌లో భాగంగానే నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించిన లైడార్ సర్వే ఇప్పటికే పూర్తయ్యిందని అధికారవర్గాలు తెలిపాయి.
మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో నీటిని లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ క్రమంలో నల్లమల అటవీప్రాంతంలోని కొండల్లో 26.8 కి.మీల సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులకు సంబంధించిన లైడార్ సర్వే చివరి దశలో ఉంది.
‘సాగర్’లింక్‌పై సైతం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని ఈ ప్రాజెక్టు కింద ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది.
ఈ పనులకు సంబంధించిన సర్వే పనులను ఏపీ పూర్తి చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రూ.80వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీలు చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి తరలిస్తామని ఏపీ పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment