ఆరు నెలల్లోనే 5,021.58 టీఎంసీలు కడలిపాలు
జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సముద్రంలోకి 4,130.25 టీఎంసీల గోదావరి జలాలు
కృష్ణా జలాలు 869.72 టీఎంసీలు... వంశధార నీరు 21.61 టీఎంసీలు కూడా..
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021.58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. రాష్ట్రంలో ఆయా నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లలో వినియోగించుకున్న, రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటి కంటే నాలుగు రెట్లు అధికంగా కడలిలో కలిశాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి.
కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్‌ల పరిధిలోని రాష్ట్రాల్లోను విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో ఈ నదులు వరద నీటితో పోటెత్తాయి. నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై... మే 31వ తేదీన ముగుస్తుంది. కేవలం ఆరు నెలల్లోనే 5,021.58 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలవడం విశేషం.
నదుల వారీగా నీటి వినియోగం.. సముద్రంలోకి వదిలిన జలాల వివరాలు...
ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,266.53 టీఎంసీల ప్రవాహం రాగా... గోదావరి డెల్టాలో పంటల సాగుకు 136.28 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 4,130.25 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గరిష్టంగా గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది.
కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీకి 1,006.36 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు 136.64 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 869.72 టీఎంసీలను బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–) కేటాయించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ నీరు సముద్రంలో కలవడం గమనార్హం.
వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 41.49 టీఎంసీలు వచ్చాయి. ఆయకట్టు పంటల సాగుకు 19.88 టీఎంసీలను వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 21.61 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన వంశధార ట్రిబ్యునల్... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం కేటాయించింది. వంశధార ట్రిబ్యునల్ అంచనా వేసిన దాని కంటే 73.51 టీఎంసీలు తక్కువగా వచ్చాయి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు కింద వంశధార జలాలను పూర్తి స్థాయిలో ఒడిసి పట్టాలంటే నేరడి బ్యారేజ్ లేదా వంశధార ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment