
పాడైపోయిన వలలను సముద్రంలోకి విసిరేస్తున్న మత్స్యకారులు
వీటిలో చిక్కుకొని మృత్యువాత పడుతున్న చేపలు, తాబేళ్లు
4 ఏళ్లలో 5.5 టన్నుల వలలు సేకరించిన ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా
ఏపీ, ఒడిశా తీరంలో 15 ఘోస్ట్ ఫిషింగ్ హాట్ స్పాట్‌ల గుర్తింపు
జెట్టీలు, హార్బర్లలో రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, విశాఖపట్నం: ఘోస్ట్ ఫిషింగ్... ఇది మత్స్య సంపదను హరిస్తోంది. సముద్ర వాతావరణానికి విఘాతం కలిగిస్తోంది. పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తోంది. ఇంతలా హాని చేస్తున్న ఈ ఘోస్ట్ ఫిషింగ్ అంటే ఏమిటి..? దీనికి కారణమెవరు అని ఆలోచిస్తే.. గంగమ్మ ఒడిలో జీవనం సాగిస్తున్న మత్స్యకారులవైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. అందుకే.. వారిలో చైతన్యం తీసుకొచ్చి మత్స్య సంపదకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకునేందుకు ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఐ) నడుం బిగించింది.
ఘోస్ట్ ఫిషింగ్ అంటే..?
వేటకు వెళ్లిన మత్స్యకారులు పాడైపోయిన వలలను ఒడ్డుకు తీసుకురాకుండా సముద్రంలోనే పడేస్తుంటారు. వలలను ప్లాస్టిక్, నైలాన్‌తో తయారు చేయడం వల్ల వందల సంవత్సరాల వరకు మట్టిలో కలిసిపోవు. ఆ వలల్లో చేపలు, తాబేళ్లు, సముద్ర జీవులు చిక్కుకుంటాయి. అవి బయటికి రాలేక చివరికి మృత్యువాత పడుతున్నాయి. దీన్నే ఘోస్ట్ ఫిషింగ్ అని అంటారు.

ఎఫ్‌ఎస్‌ఐ ఏం చేసింది.?
విశాఖ కేంద్రంగా ఎఫ్‌ఎస్‌ఐ సముద్రంలో మత్స్య సంపదపై నిరంతరం పరిశోధనలు చేస్తుంది. తమ సర్వే వెసల్స్ మత్స్యషికారిపై పరిశోధనలకు వెళ్లినప్పుడు వలల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు... ముఖ్యంగా ఫిషింగ్ నెట్స్ పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. ఈ విషమ పరిస్థితిపై పరిశోధనలు ప్రారంభించింది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో వ్యర్థాల గుర్తింపు, వెలికితీత, మత్స్యరాశులపై వాటి ప్రభావం తదితర అంశాలపై 2021 ఏప్రిల్ నుంచి సర్వే ప్రారంభించింది. 2024 చివరి వరకు కొనసాగిన ఈ సర్వేలో ఏకంగా 5,562 కేజీల వ్యర్థాలు దొరికాయి.
ఇది చాలా ప్రమాదకరమని గ్రహించి.. అవి దొరికిన ప్రాంతాల్ని హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. అప్పటి నుంచి గ్లో లిట్టర్ పార్టనర్‌షిప్(జీఎల్‌పీ) కార్యక్రమానికి ఎఫ్‌ఎస్‌ఐ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సర్వే నౌకలు మెరైన్ ప్లాస్టిక్ లిట్టర్/అబాండన్డ్ లాస్ట్ లేదా డిస్కార్టెడ్ ఫిషింగ్ గేర్లు (ఏఎల్‌డీఎఫ్‌జీ) పేరుతో అధ్యయనం నిర్వహించాయి. మరో మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
మత్స్యకారులకు అవగాహన
సర్వేలో వెల్లడైన అంశాలను మత్స్యకారులు, బోటు ఆపరేటర్లకు తెలియజేసి వ్యర్థాలను సముద్ర జలాల్లో పడేయవద్దంటూ ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి, శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ కలిసి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సర్వే చేసినప్పుడు దొరికిన వలల వ్యర్థాలు చేస్తున్న కీడుకు సంబంధించిన వీడియోలను మత్స్యకారులకు చూపిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు.
రీసైక్లింగ్ యూనిట్లకు ప్రణాళికలు
ఎఫ్‌ఎస్‌ఐ చేపట్టిన జీఎల్‌పీ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. సముద్ర అధ్యయనం, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి ప్రశంసలు లభించడమేకాకుండా.. ఈ ప్రాజెక్టుని సీరియస్‌గా అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వలలో పడిన ప్లాస్టిక్ వ్యర్థాల్ని మత్స్యకారులు బయటకు తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించడమే కాకుండా.. ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఫిషింగ్ హార్బర్‌లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల వద్ద రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ఘోస్ట్ ఫిషింగ్ తగ్గితేనే మత్స్య సంపదకు మనుగడ
చేపల వేట సమయంలో తెగిన వలలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర సామగ్రిని సముద్రంలో మత్స్యకారులు పడేస్తున్నారు. వాటిల్లో చిక్కుకుని చిరు చేపలు, పీతలు, రొయ్యలు, తాబేళ్లు వంటివి చనిపోతున్నాయి. మా అంచనా ప్రకారం సముద్ర జలాల్లో వ్యర్థాల కారణంగా 3 నుంచి 5 శాతం మేర మత్స్య దిగుబడులు తగ్గే ప్రమాదముంది. ఉపరితలంపై తేలియాడే పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, తెగిపోయిన వలల ముక్కలు తదితర అధిక సాంద్రత కలిగిన వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి.
అందుకే జీఎల్‌పీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. మేం చేపట్టిన అవగాహన సదస్సులతో మత్స్యకారుల్లో క్రమంగా చైతన్యం వస్తోంది. వారు తీసుకొస్తున్న వ్యర్థాలతో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి మత్స్యకార మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – భామిరెడ్డి, ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ జోన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment