అరుదైన ఘనత సాధించిన స్విమ్మర్ శ్యామల
వైజాగ్‌లో ప్రారంభం.. కాకినాడలో ఒడ్డుకు
కాకినాడ రూరల్ : సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది ఆసియాలోనే అరుదైన ఘనతను సాధించారు స్విమ్మర్ శ్యామల గోలి. గత నెల 28న విశాఖపట్నం ఆర్‌కే బీచ్ వద్ద సముద్రంలో ఈత ప్రారంభించిన ఆమె ఏడో రోజైన శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కాకినాడ బీచ్‌కు చేరుకున్న శ్యామలకు కాకినాడ నగర కమిషనర్ భావన, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు స్వాగతం పలికారు.
ఐదు పదుల వయసులో అలవోకగా సముద్రాలు ఈదుతూ సాహస యాత్రతో అబ్బుర పరుస్తున్న శ్యామలను చూసేందుకు, ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పట్నుంచీ స్విమ్మర్‌ను కాదని చెప్పారు. జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల మేర స్విమ్ చేసేలా తనను కోచ్ జాన్ సిద్ధిక్ తీర్చిదిద్దారన్నారు.
2021లో శ్రీలంక – ఇండియా మధ్య రామ్‌సేతును ఈదానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానని గుర్తు చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు సముద్రంలో దిగి.. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒడ్డుకు వచ్చానని.. ఈ లెక్కన ఆరు రోజుల్లోనే లక్ష్యం చేరానన్నారు. స్విమ్మింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, మహిళల్లో గైనిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment