తగ్గుతున్న గోదావరి | Assurance of public representatives to the victims in flood affected areas | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న గోదావరి

Published Wed, Aug 19 2020 3:11 AM | Last Updated on Wed, Aug 19 2020 10:13 AM

Assurance of public representatives to the victims in flood affected areas - Sakshi

తూర్పు గోదావరి జిల్లా ఎల్‌.గన్నవరంలో గోదావరి వరద నీటితో ముంపునకు గురైన ఇళ్లు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత రెండు రోజులుగా భారీ వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం రాత్రికి తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద 17.75 లక్షల క్యూసెక్కుల కంటే తగ్గనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటలకు 19.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో 22,40,194 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 150.7 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 702.07 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లోనూ అన్నిచోట్లా వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. 
తూర్పు గోదావరి జిల్లా పెదకందలపాలెంలో వరదనీటిలో పిల్లలను మోసుకెళ్తున్న దృశ్యం 

సహాయక చర్యలు ముమ్మరం
► వరద ప్రభావిత గ్రామాల్లో లాంచీలు, ఇంజన్‌ బోట్ల ద్వారా బాధితులకు పాలు, బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కొవ్వొత్తులు, ఇతర నిత్యావసరాలను యుద్ధప్రాతిపదికన అందిస్తున్నారు.
► తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని నాలుగు విలీన మండలాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలుగు మండలాల్లో 16 గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకోగా 74 గ్రామాల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో 3,846 కుటుంబాలకు చెందిన 11,036 మందిని 59 పునరావాస కేంద్రాలకు తరలించారు.  గర్భిణులతోపాటు అత్యవసర వైద్యసేవలు అవసరమైన 149 మందిని చింతూరు ఏరియా ఆస్పత్రి, కూనవరం పీహెచ్‌సీలకు పంపారు. 
► పశ్చిమగోదావరి జిల్లాలో 71 గ్రామాల్లో 10 వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని అధికారులు అంచనా వేశారు. వారి కోసం 26 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 5 వేల మందికి చోటు కల్పించారు. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. 
► ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు. 
► ముంపులో ఉన్న విలీన మండలాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా సరుకులను మోస్తూ అందజేశారు. 
► కమ్యూనికేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాటిలైట్‌ ఫోన్లు వినియోగిస్తూ వైద్యులు, పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. 
► ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు.. పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు.. చిర్ల జగ్గరెడ్డి, పొన్నాడ సతీశ్‌కుమార్, తెల్లం బాలరాజు, అధికారులు పర్యటించారు. 
► ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. 

శ్రీశైలంలోకి 3.63 లక్షల క్యూసెక్కులు
కృష్ణా, తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం చేరుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3,63,772 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ సీజన్‌లో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రికి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరుకోనుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 877.50 అడుగుల్లో 176 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రం ప్రాజెక్టు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు ఎత్తడానికి అధికారులు నిర్ణయించారు.
► తుంగభద్ర డ్యామ్‌ నిండిపోవడంతో 20 గేట్లను ఎత్తి 77 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 
► శ్రీశైలం నుంచి 42,378 క్యూసెక్కులు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 255.82 టీఎంసీలకు చేరుకుంది. 
► మూసీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వరద ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 13.32 టీఎంసీలకు చేరింది. 
► ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి 1.13 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టాకు వదలగా మిగిలిన 1.05 లక్షల క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement