రామన్నగూడెం వద్ద 6.59 మీటర్లకు చేరిన వరద నీరు
ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద వరద నీరు క్రమేపీ పెరుగుతోంది. బుధవారం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 6.59 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు గోదావరమ్మ పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తోంది. గత నెలలో ఏడారిగా మారిన గోదావరి నది.. ఇప్పుడు జలకళను సంతరించుకుంది. గోదావరిలో నీరు క్రమేపీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 8.50 మీటర్లుకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
ధర్మసాగర్‌కు చేరిన గోదావరి జలాలు
ధర్మసాగర్ : దేవాదుల పైపులైన్ ద్వారా గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరాయి. బుధవారం ఉదయం ఏటూరునాగారంలోని దేవాదుల వద్ద జె. చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఇన్‌టేక్‌వెల్ నుంచి మోటార్లను ఆన్ చేయటంతో తొలుత భీంఘన్‌పూర్ రిజర్వాయర్ చేరుకొగా, అక్కడి నుంచి పులుకుర్తి పంప్ హౌజ్ కు అనంతరం బుధవారం రాత్రి 8.10 గంటలకు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి.
భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు కూడా పంపింగ్
వరంగల్ అర్బన్ : దేవాదుల నుంచి గోదావరి జలాలలను ధర్మసాగర్ రిజర్వాయర్‌తోపాటు భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు సామర్థ్యం మేరకు పంపింగ్ చేసే అవకాశం ఉంటుందని బల్దియా ఇంజినీర్లు తెలిపారు. దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద నుంచి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేస్తే మూడు జలాశయాలు జలకళ సంతరించుకుంటాయని, దీంతో మరో ఆరు నెలల పాటు నగర వాసులకు తాగునీటికి ఢోకా ఉండదని పేర్కొంటున్నారు. కాగా, కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి నీటి విడుదలకు బ్రేక్ పడింది. వారం రోజుల పాటు కాకతీయ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేసిన ఎల్‌ఎండీ ఇంజినీర్లు.. మరమ్మతుల పేరుతో నీటి విడుదలను ఈనెల 20న నిలిపివేశారు. ప్రస్తుతం కాకతీయ కెనాల్‌లో ఉన్న నీటి నిల్వలను ఫిల్టర్‌బెడ్‌ల ద్వారా శుద్దీకరణ చేసి పంపింగ్ చేస్తున్నారు.
పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
Published Thu, Jul 24 2014 2:31 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement