
రాజీవ్ లింక్‌కెనాల్ ద్వారా ఎన్‌ఎస్‌పీ కాల్వలోకి గోదావరి జలాలు
100 కి.మీ. ప్రయాణించి ఖమ్మం జిల్లాకు చేరిన నీరు
గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలకఘట్టం సాకారమైంది. ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్‌ల నుంచి 100 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు బుధవారం రాత్రి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా 52వ కి.మీ. వద్ద ఎన్‌ఎస్‌పీ (నాగార్జునసాగర్ ప్రాజెక్టు) కాల్వకు చేరాయి. ఈ సందర్భంగా జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పుష్పాభిషేకం చేశారు.
సాగర్ ఆయకట్టు స్థిరీకరణ: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందించేందుకు ప్రభుత్వం ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) నిర్మాణం చేపట్టింది. 8.6 కి.మీ. పొడవైన ఈ కెనాల్‌కు రూ.97 కోట్లు కేటాయించారు. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన పనులు పూర్తికావడంతో జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో 7,500 ఎకరాలు, వైరా ప్రాజెక్టు కింద 17 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గంలోని మిగతా ఆయకట్టుకు కూడా సీతారామ పనులు పూర్తికాగానే నీరు అందనుంది.
104 కి.మీ. మేర కాల్వల తవ్వకం
సీతారామ ప్రాజెక్టులో భాగంగా 104 కి.మీ. మేర కాల్వల త వ్వకం పూర్తయ్యింది. జూలూరుపాడు మండలం వరకు ప్రాజె క్టు పూర్తికాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమేరకు పెండింగ్‌లో ఉంది. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద, కూసుమంచి మండలం పాలేరు వద్ద టన్నెల్ నిర్మాణాలు కొన సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది.
పాలేరు వరకు ప్రధాన కాల్వ నిర్మా ణం పూర్తి కావడానికి సమయం పట్టనుండగా ఏన్కూరు వద్ద ఎన్నెస్పీ కాల్వకు గోదావరి జలాలు చేర్చేలా రాజీవ్ లింక్ కెనా ల్ నిర్మాణం చేపట్టారు. దీంతో వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాలకు తొలుత గోదావరి జలాలు అందుతున్నాయి.
1,500 క్యూసెక్కుల నీరు విడుదల
తొలిదశలో ఒక పంపుహౌస్‌లో ఒక మోటార్ నడిపించడం ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటకు మూడు కిలోమీటర్లు చొప్పున ప్రవహించిన నీరు జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్‌కు బుధవారం చేరింది.
ఇక్కడ నుంచి పరవళ్లు తొక్కుతూ 8.6 కి.మీ. ప్రవహించి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా వద్ద ఎన్నెస్పీ కాల్వలో బుధవారం రాత్రి కలిశాయి. ఆపై 12 కి.మీ. ప్రయాణించి 38వ కి.మీ. వద్ద యూటీ నుంచి వైరా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుతాయి. మధిర, సత్తుపల్లి మండలాలకు కూడా నీరు చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment