కాకతీయ కాల్వకు గండి
మల్యాల/పెగడపల్లి/గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాల్వకు మంగళవారం ఉదయం భారీ గండిపడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు రావటంతో రాకపోకలు స్తంభించాయి. మానాల గ్రామం దమ్మక్క చెరువులోకి నీళ్లు వెళ్లే తూము డీ-65 వద్ద కాకతీయ ప్రధాన కాల్వకు ఈ గండిపడింది.
దీంతో దమ్మక్క చెరువు నిండి సమీప పొలాలు నీటమునిగాయి. మానాల, మ్యాడంపల్లిల్లో వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దమ్మక్క చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి చేరాయి. ఈ కాలనీకి చెందిన 300 కుటుంబాలను అధికారులు తక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసి న శిబిరానికి తరలించారు. ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ గేట్లు మూసివేయడంతోపాటు నీటి ఉధృతి తగ్గించేందుకు పలుచోట్ల తూముగేట్లు తెరిచారు.
సాయంత్రం మ్యాడంపల్లిలోని కల్వర్టు తెగి.. గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గండి పూడ్చే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. పెగడపల్లి మండలం సుద్దపల్లి కోయ చెరువు నిండి గండి పడింది.
ఆదుకుంటాం: ఈటల, చీఫ్‌విప్ కొప్పుల
ఎస్సారెస్పీ కాల్వకు గండి పడటంతో పంటలు నష్టపోరుున రైతులతోపాటు ఇతరత్రా నష్టపోరుున బాధితులను ఆదుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ కాలువ డీ-65 తూము గండిని ఆయన పరిశీలించారు. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలో నీళ్లు చేరిన ఇళ్లను పరిశీలించారు. పునరావాస శిబిరంలో ఉన్న బాధితులను పరామర్శించారు. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో పరిస్థితిని సమీక్షించి, అధికారులను అప్రమత్తం చేశారు. రైతులను ఆదుకుంటామన్నారు.