kakatiya canal
-
రైతన్నను ఆదుకుంటున్న కాకతీయ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా చేసే కాకతీయ కాలువలో నీరు నిల్వ ఉంచడంతో అన్నదాతలను ఆదుకుంటుంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువలో వేసవిలో కూడ నీటిని నిల్వ ఉంచడంతో రైతులు పంటలకు నీరు అందించుకున్నారు. కాలువ నీటి ఆధారంగా రైతులు ఎప్పుడో కరెంటు మోటార్లను బిగించుకున్నారు. కిలోమీటర్ల మేరా పైపులైన్లు వేసుకున్నారు. ప్రస్తుతం కాలువలో నీరు నిల్వ ఉండటం వల్ల రైతులు మందస్తుగానే పసుపు , మక్క పంటలను సాగు చేశారు. ప్రస్తుతం కాలువ నుంచి నీటి సరఫరా చేస్తున్న నీటి ద్వారానే పంటలు సాగవుతున్నాయి. పైపులైన్ల ద్వారా నీటి సరఫరా.. కాకతీయ, వరద కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు కాలువలకు మోటర్లు బిగుంచుకుని పైపులైన్ వేసుకున్నారు. పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకుంటూ పంటలకు నీరు అందిస్తున్నారు. కొందరు రైతులు నాలుగైదు కిలోమీటర్ల వరకు పైపులైన్ వేసుకుని నీటి సరఫరా చేసుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి పసుపు పంటను విత్తడంలో రైతులు బిజీగా ఉన్నారు. రెండు కాలువల్లో నీరు... కాకతీయ వరద కాలువల పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో రైతులు ముందస్తుగానే పంటలను విత్తుతున్నారు. సాధారణంగా మిరుగు కార్తే వరకు పంటలు విత్తకుండ తొలకరి కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం కాకతీయ కాలువలో, వరద కాలువల్లో భారీగా నీరు నిల్వ ఉండటం వల్ల ఎలాంటి నీటి భయం లేకుండా రైతులు ముందుగానే మక్క, పసుపు పంటను సాగు చేస్తున్నారు. కాకతీయ కాలువకు పరివాహక ప్రాంతాలుగా ఉన్న మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మండలాల రైతులు, వరద కాలువకు పరివాహక ప్రాంతాలుగా ఉన్న మోర్తాడ్, బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల రైతులు విత్తనాలు విత్తడం ఇప్పటికే 70 శాతం పూర్తయ్యయంటే నీటి భరోసా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లీకేజీ రూపంలో వస్తున్న నీటిని కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ వద్ద గేట్లు దించి కాలువలో నిల్వ ఉంచారు. వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించి కాలువలో నిల్వ ఉంచారు. దీంతో పంటలకు నీటి లోటు లేకుండ రైతులకు పూర్తి భరోసా లభిస్తుంది. రెండు కాలువల్లో నీరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కుటుంబం జలసమాధి : వీడిన మిస్టరీ
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్యనారాయణరెడ్డి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్‌లో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ పరిశీలన అనంతరం అది స్వయంగా సత్యనారాయణరెడ్డి రాసిందేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నాలుగు నెలల తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది.(చదవండి : కుటుంబం జలసమాధి : కొనసాగుతున్న విచారణ) కాగా, ఈ ఏడాది జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి నుంచి సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీలతో కలిసి కారులో బయలుదేరారు. అయితే అదే రోజు వారి కారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే ఈ ఘటన జరిగిన ఇరవై రోజుల తర్వాత కరీంనగర్ నుంచి గన్నేరువరం బయలుదేరిన ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అ ప్రమాదంలో మహిళ నీటిలో కొట్టుకుపోవడంతో.. ఆమె గాలింపు కోసం కాలువలోకి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో సత్యనారాయణరెడ్డి కారు కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్
-
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పరిధిలోని అల్గునూర్‌లో గల కాకతీయ కాలువలో జలసమాధి అయిన కుటుంబానికి సోమవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన చెల్లెలు రాధ మృతదేహంపై పుట్టింటి పట్టుచీరను కప్పి.. తోడబుట్టిన చెల్లెను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. రాధతో పాటు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పట్టుపంచ, కోడలు వినయశ్రీ మృతదేహంపై పట్టుచీర కప్పి చివరిసారి వీడ్కోలు పలుకుతూ విషాదంలో మునిగిపోయారు. కడసారిగా కన్నీటి వీడ్కోలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో బంధం, స్నేహం ఉన్న వారందరూ అలకాపూరికాలనీలోని శాంతినిలయంలో అంత్యక్రియలు జరగడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టుకొని ఏడ్చేందుకు మృతదేహాలు కుళ్లిపోవడంతో ఆప్యాయంగా కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుదామంటే కూడా అవకాశం లేదని బంధువులు రోదించారు. అందరితో అత్మీయంగా... సత్యానారయణరెడ్డి కుటుంబం అందరితో ఆత్మీయంగా కలుపుగోలుగా ఉండేదని బ్యాంక్‌కాలనీలో ఆయన ఇంటి వద్ద ఉండేవారు తెలిపారు. నవ్వుతూ పలకరించేవాడని ఇరుగుపొరుగు ఉన్న వారు, వారి స్థిరాస్తి వ్యాపారం చేసే స్నేహితులు గుర్తుచేసుకొని బాధపడ్డారు. తన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందనప్పటి నుంచి మనోవేదనకు గురై రాధ పాఠశాలకు ఎక్కువగా వెళ్లడం లేదని, దాదాపుగా 80 శాతం వరకు మెడికల్ లీవ్‌లోనే ఉందని, ఇప్పుడు కూడా జనవరి 7 నుంచి మెడికల్ లీవ్పెట్టినట్లు మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ముగ్గురు మృతిచెందారని వార్త తెలియడంతోనే బ్యాంకుకాలనీలో మృతుల ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చారు. తాళం వేసి ఉండడంతో ఘటనస్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం జరిగే వరకూ ఉండి అలకాపూరి శ్మశానంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆత్మహత్యేనని అనుమానం..? జనవరి 25 తేదీన సుల్తానాబాద్‌కు చెందిన వస్త్రవ్యాపారి శ్రీనివాస్‌గౌడ్– స్వరూప దంపతులు ఆసుపత్రి కని వచ్చి తిరిగి సుల్తానాబాద్ వెళ్లే క్రమంలో కాకతీయ కాలువ వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగివెళ్లే క్రమంలో కాలువలో పడి మృతి చెందారు. అది జరిగినా రెండో రోజే సత్యనారాయణరెడ్డి కారు కాకతీయ కాలువలో పడటంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా సత్యనారాయణరెడ్డి బంధువులు కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు వారికి లేవని, అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని పేర్కొంటున్నారు. బ్యాంకుకాలనీలో సత్యనారాయణరెడ్డి ఇల్లు సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. జనవరి 27న మధ్యాహ్నం ఆయన దుకాణంలో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకొని కారులో బట్టలు, రైస్ కుక్కర్, సిలిండర్, బెడ్షీట్లతో పాటు పలు వస్తువులు పెట్టించుకున్నాడు. తర్వాత 3.15 నిమిషాలకు సత్యానారయణరెడ్డి భార్య రాధ ఫోన్లో నుంచి నర్సింగ్కు ఫోన్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని రూ.599 ప్యాకేజ్ వెయించాలని చెప్పాడు. అదే నర్సింగ్‌తో మాట్లాడిన చివరికాల్ కాగా, దాదాపుగా 4 నుంచి 5గంటల సమయంలో కరీంనగర్ నుంచి బయలు దేరినట్లు తెలుస్తోంది. 27 తేదీన సీసీ కెమెరాలు కరీంనగర్ నుంచి కాకతీయ కాలువ వరకు పోలీసులు పరిశీలిస్తే అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉంటుందనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. పలువురి పరామర్శ.. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో వారి బంధువులను పలువురు పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాడే మోశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కొట్టెపెల్లి గంగరాజు, నీర్ల శ్రీనివాస్, ఎస్టీ సంఘాల నాయకులు కుతాడి శివరాజ్, కుతాడి శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మాతంగి రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు సముద్రాల శ్రీను, దండు అంజయ్య, మధు, మాట్లా శ్యాం తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో ఆరుగురి మరణవార్త.. 24 గంటల్లో మూడు ఘటనలకు సంబందించి మొత్తం ఆరుగురు మరణించారన్న వార్త విని కరీంనగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 16వ తేదీ ఉదయం కరీంనగర్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన దంపతులు శ్రీనివాస్, స్వరూప అల్గునూర్ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొట్టడంతో కారు బ్రిజ్జి కిందపడి శ్రీనివాస్ మృత్యువాతపడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనుకోకుండా జారీ పడి చనిపోయాడు. అది మరువక ముందే అదే రోజు రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తనలు కాకతీయ కాలువలో పడగా ప్రదీప్ ప్రమాదం నుంచి బయటపడగా, కీర్తన ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. వీరి ఆచూకీ కనుక్కునేందుకు కాలువ నీటి ప్రవాహం తగ్గించడంతో 17 తేదీన ఉదయం సత్యనారయాణరెడ్డి కుటుంబంతో సహా కారులోనే మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటం 24 గంటల్లో ఆరుగురు చనిపోయారని వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చర్చింకున్నారు. -
కుటుంబం జలసమాధి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని కాకతీయ కాలువలో ఓ కుటుంబం జలసమాధి అయింది. కారు కాలువలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. అయితే, సంఘటన జరిగిన 21 రోజుల తర్వాతే ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బైక్ కాలువలోకి దూసుకెళ్లి ఓ మహిళ గల్లంతయ్యారు. ఆమె కోసం గాలించేం దుకు నీటి ప్రవాహం తగ్గించడంతో ప్రమాదానికి గురైన కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా, అందులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతులను పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)గా గుర్తించారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం చేశారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను బట్టి దీనిని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరేష్‌రెడ్డి తెలిపారు. కుమార్తెను హైదరాబాద్ తీసుకెళ్దామని... సత్యనారాయణరెడ్డి కరీంనగర్లో సాయితిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. బీటెక్ చదువుదున్న వారి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. త్వరలోనే చదువు పూర్తికానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు నెలలపాటు హౌస్‌సర్జన్ శిక్షణ ఇప్పించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనవరి 26న ఆయన హైదరాబాద్ వెళ్లి కుమార్తె కోసం కొంపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో కొన్ని సామాన్లు సర్ది ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటిరోజు సాయంత్రం 4 గంటల సమయంలో భార్య, కూతురుతో కలిసి బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి ఏపీ15బీఎన్ 3438 అనే నెంబర్ గల కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్లు స్విఛాప్ వచ్చాయి. దీంతో నాలుగైదు రోజుల తర్వాత వారి నివాసానికి వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురూ కలిసి కారులో వెళ్లినట్టు గుర్తించారు. అయినప్పటికీ అనుమానంతో ఇంటితాళం పగలగొట్టి లోపలకి వెళ్లి చూశారు. అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో ఏదైనా టూర్‌కి వెళ్లి ఉంటారని భావించి మరో తాళం వేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఓదారుస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి టూర్ వెళ్తున్నానని చెప్పిన వినయశ్రీ.. జనవరి 26వ తేదీ కంటే ముందు వినయశ్రీ ఇంటికి వచ్చింది. తాము టూర్‌కు వెళ్తున్నట్టు తన స్నేహితురాళ్లకు చెప్పింది. నాలుగైదు రోజులు గడిచినా ఆమె రాకపోవడంతో వారు ఫోన్ చేశారు. అది స్విఛాఫ్ వచ్చింది. సుమారు వారం రోజులకు ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తెలియంతో ఆయన తన చెల్లెలి కుటుంబం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. పనిమనిషిని అడగ్గా.. పది పదిహేను రోజులు టూర్ వెళ్తున్నట్టుగా తనకు చెప్పారని ఆమె వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న కొంపల్లిలో విచారించగా అక్కడికి కూడా రాలేదని తెలిసింది. ఫోన్ ట్రాకింగ్ చేసి చూస్తే కరీంనగర్‌లోనే సిగ్నల్ చూపించింది. అయితే, తరచూ యాత్రలకు వెళ్లే అలవాటున్న చెల్లెలు కుటుంబం దుబాయ్ వెళ్లి ఉండొచ్చని ఎమ్మెల్యే భావించినట్లు ఆయన బంధువులు తెలిపారు. అయితే ఇంత జరిగినా పోలీసులకు మాత్రం ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సత్యనారాయణరెడ్డి స్నేహితుడు ఒకరు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పటికీ, సీఐ లేకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకుండానే తిరిగి వచ్చారు. విషయం వెలుగుచూసింది ఇలా.. ఆదివారం రాత్రి పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన దంపతులు బైక్‌పై కరీంనగర్ నుంచి గన్నేరువరం బయల్దేరారు. అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బైక్ లైటు వెలుతురుకు భారీగా పురుగులు వచ్చాయి. అవి ప్రదీప్ కళ్లలో పడటంతో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వెళ్తున్న ఎల్ఎండీ పెట్రోలింగ్ పోలీసులు కాలువలో కొట్టుకుపోతున్న ప్రదీప్‌ను కాపాడారు. కీర్తన గల్లంతయ్యారు. దీంతో ఆమె కోసం గాలించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపివేయించారు. గజఈతగాళ్లు కీర్తన కోసం గాలించగా.. మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభించింది. కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో గతనెల 27న అందులో పడిపోయిన సత్యనారాయణరెడ్డి కారు బయట పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కారుని బయటకు తీయించారు. కారు నెంబర్ ఆధారంగా అది సత్యనారాయణరెడ్డి పేరున ఉన్నట్టు గుర్తించారు. ఆయన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా బావ అని తెలుసుకుని ఆయనకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చిన మనోహర్‌రెడ్డి.. కారును పరిశీలించి తన బావ కారుగా నిర్ధారించారు. అందులో ఉన్న మూడు మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. గతనెల 27న ఇంట్లో నుంచి వెళ్లారని, అప్పటినుంచి తెలిసినవారి ఇళ్లలో ఆరా తీస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ వెళ్తున్నట్టు పొరుగువారికి చెప్పారని, ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని పేర్కొన్నారు. సంఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించారు. ఆత్మహత్యకు అవకాశం తక్కువే! సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ఇరుకుగా ఉన్న వంతెనపైకి రాకముందే కారు పూర్తిగా ఎడమవైపు వచ్చి కాలువలో పడి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఒకవేళ రెయిలింగ్‌ను తాకి కారు ప్రమాదానికి గురై ఉంటే రోడ్డుపై వెళ్లేవారికి తెలిసేదని అంటున్నారు. జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొంచెం కూడా కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు అనామకులుగా చనిపోవాలని భావించరని, కారుతోపాటు కాలువలోకి వెళ్లాలనుకోరన్నది వారి వాదన. అక్కడ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. కారులో సామాన్లు సర్ది వచ్చాను గతనెల 27న మా సార్లు వాళ్ళు ఊరెళుతున్నారని చెప్పడంతో బెడ్షీట్లు, రైస్కుక్కర్తోపాటు కొని సామాన్లు కారులో పెట్టి వచ్చాను. అదేరోజు సాయంత్రం సత్యనారాయణరెడ్డి సారు రాధ మేడం ఫోన్ నుంచి నుంచి కాల్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని, రీచార్జి చేయించాలని చెప్పారు. నేను వెంటనే రీచార్జీ చేయించాను. మరుసటిరోజు ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చింది. నాలుగైదు రోజులు ఫోన్ కలవకపోవడంతో మా సార్ స్నేహితులు, బంధువుల షాప్‌కు వస్తున్నాడా అని నన్ను అడిగారు. ఇన్నిరోజులుగా మా సార్ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను.– నర్సింగ్, సత్యనారాయణరెడ్డి షాపులో పనిచేసే వ్యక్తి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ నరెడ్డి సత్యనారాయణరెడ్డి కారు కాలువలో పడి, ఆయనతోపాటు భార్య రాధ, కుమార్తె వినయశ్రీ మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటనపై గతంలో మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుపుతాం. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఎలాంటి అనుమానాలు లేవని నిర్ధారించినందున ప్రమాదవశాత్తూ కారు కాలువలో పడి ఉంటుందని భావిస్తున్నాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ ప్రమాదమేనని తేలింది సత్యనారాయణరెడ్డి కుటుంబం చనిపోయిన ఘటన ప్రాథమిక విచారణలో ప్రమాదమే అని తేలింది. వీలైనంత తొందరగా విచారణ పూర్తిచేస్తాం. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయాలు దర్యాప్తులో బయటపడతాయి. – నితికాపంత్, ట్రైనీ ఐపీఎస్ -
సెల్ఫీ మోజు; గల్లంతైన ఇద్దరు యువకులు
సాక్షి, జగిత్యాల : పండగ వేళ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెట్పల్లిలో సెల్ఫీ దిగడానికి కాలువలోకి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా అనుపాలెంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు రాంబాబు(20), రాజేష్(18) ఫోటో దిగడానికి కాకతీయ కెనాల్లోకి దిగారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కాకతీయ కాలువలో మహిళ గల్లంతు
మోర్తాడ్ (నిజామాబాద్): భర్తతో గొడవ పడిన ఓ యువతి కాకతీయ కాలువలో దూకి గల్లంతైన ఘటన ఆదివారం ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాల్కొండకు చెందిన మారుతి, జగిత్యాల్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రేణుకను వివాహం చేసుకున్నాడు. అయితే రెండు రోజుల కింద రేణుక తన తల్లిగారి ఇంటికి ఇబ్రహీంపట్నంకు వెళ్లింది. రేణుకను తమ ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన మారుతి బైకుపై తీసుకుని కాకతీయ కాలువ వెంబడి వస్తుండగా మార్గమధ్యంలో మూత్ర విసర్జన కోసం వాహనం ఆపాడు. అప్పుడు ఇరువురి మధ్య చిన్న వాదన జరిగింది. కాగా రేణుక అకస్మాత్తుగా కాలువలోకి దూకింది. కాలువ ప్రవాహం జోరుగా ఉండటంతో రేణుక కొట్టుకుపోయింది. దీంతో కంగారుపడిన ఆమె భర్త మారుతి ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కాకతీయ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. భీమ్‌గల్ సీఐ సైదయ్య, ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో రేణుక కోసం గాలిస్తున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాకతీయ కెనాల్‌కు భారీ గండి
గొల్లపల్లి (ధర్మపురి): కాకతీయ మెయిన్ కెనాల్‌కు బుధవారం భారీ గండి పడింది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 2 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కట్టలు తెగిపోయే ప్రమాదం నెలకొనడంతో అధికారులు ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమన్నగుడి వద్ద ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్ కెనాల్‌కు 88.66కి.మీల రాయి (యూటీ) వద్ద భారీ గండి పడింది. నీటి ప్రవాహం బీబీరాజ్‌పల్లి, శ్రీరాములపల్లి, శంకర్రావుపేట, మల్లన్నపేట, వెంగళాపూర్, నందిపల్లి గ్రామాలను ముంచెత్తింది. నీటి ఉధృతికి శ్రీరాములపల్లి పెద్ద చెరువు, చిన్నచెరువు నిండి తెగిపోయే పరిస్థితికి చేరగా.. రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి ఇసుక బస్తాలతో పూడ్చి వేయించారు. చెరువు కట్టకు గండికొట్టారు. ఆ నీరు శంకర్రావుపేట చెరువునూ నింపేసింది. ఆ చెరువు కూడా నిండిపోవడంతో అధికారులు జేసీబీతో కట్టకు గండిపెట్టారు. అక్కడి నుంచి వరదనీటిని మల్లన్నపేట గుడి చెరువు మీదుగా.. వెంగళాపూర్, నందిపల్లి మధ్య బ్రిడ్జి నుంచి శెకల్లవాగుకు మళ్లించారు. శ్రీరాములపల్లి, బీబీరాజ్‌పల్లి, శంకర్రావుపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతోనే.. ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు చాలా ఏళ్లుగా మరమ్మతు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరింది. కరీంనగర్ శివారు ఎల్ఎండీని నింపేందుకు ఈ నెల 22న కాకతీయ కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. ఆ నీటి ఉధృతికి గండిపడింది. -
తొమ్మిది గంటలే !
మోర్తాడ్/బాల్కొండ : కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఫీడర్లకు 24 గంటలకు బదులు తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేయా లని ఎన్పీడీసీఎల్ అధికారులు నిర్ణయించారు. భారీ నీటిపారుదల శాఖ అధికారులు, విద్యుత్ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రెండు రోజుల నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పగటి పూట తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్ అందిస్తున్నారు. రబీ సీజను కోసం శ్రీరాంసాగర్ ప్రాజె క్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి సరఫరా కొనసాగుతోంది. అయితే కాకతీయ కాలువ పరిసరాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీటిని అందించుకోవడానికి రైతులు కాలువకు పంపుసెట్లను అమర్చుకున్నారు. గతంలో షిఫ్టింగ్ విధానంలో వ్యవసాయానికి రోజు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. అలాంటి సమయంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కాకతీయ కాలువ నుంచి రైతులు నీటిని పంట పొలాలకు తరలించేవారు. ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో పంపుసెట్లు నిరంతరం పని చేస్తున్నాయి. కాలువకు దగ్గర ఉన్న పంట పొలాలకే కాకుండా దూరంగా ఉన్న పంట పొలాలకు కూడా పైప్‌లైన్‌ను వేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దీంతో ఎక్కువ నీరు స్థానికంగానే వినియోగం అవుతోంది. ఇటీవల నాలుగు టీఎంసీల నీటిని కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఒక్కటే టీఎంసీ నీరు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీరు చేరే సరికి పరిమాణం తగ్గిపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం కాకతీయ కాలువపై కొందరు రైతులు పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా నీటిని సరఫరా చేసుకోవడమే కారణం అని గుర్తించిన అధికారులు 24 గంటల విద్యుత్‌కు బ్రేక్ వేయాలని భావించారు. కాలువ వెంట రైతులు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లను తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. పంపుసెట్లను తొలగించడం కంటే విద్యుత్ సరఫరాను నియంత్రించడమే మేలు అని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. విద్యుత్ అధికారులతో చర్చించారు. జిల్లాలోని మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతాంగం కాకతీయ కాలువపై జీవీసీ–1 పరిధిలో సుమారు 2300 పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దాదాపు 20 విద్యుత్ ఫీడర్ల నుం చి విద్యుత్ సరఫరా అవుతోంది.ఈ ఫీడర్ల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను అధికారులు కుదించారు. ప్రస్తుత యాసంగిలో కాకతీయ ద్వార ఎల్ఎండీ వర కు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని అధి కారులు ప్రకటించారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగిన అన్ని రోజుల పాటు తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. రైతులు అంగీకారం తెలపడం విశేషం. పంపు సెట్లు ఎందుకు... కాకతీయ కాలువకు పంపు సెట్లను అమర్చుకునే అవకాశం రైతులకు ఎందుకు ఇచ్చారంటే... కాలువ నిర్మాణంలో ఆయా గ్రామాలకు చెందిన చెరువులు రెండు వైపులా చీలి పోయాయి. దీంతో ఆయకట్టుకు నీటి వనరుల సౌకర్యం లేకుండా పోయింది. అంతే కాకుం డా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి లిప్టులను నిర్మిస్తుంది. ఇక్కడ ఎలాంటి లిప్టులు అవసరం లేకుండానే రైతులు స్వచ్ఛందంగా పంపు సెట్లు నిర్మించుకుని ఆయకట్టుకు నీటి సరఫరా చేసుకుంటున్నారు. పంపు సెట్లకు నిరంతరం నీటి సరఫరా కోసం కాకతీయ కాలువ ద్వార నిరంతరం లీకేజీ నీటి సరఫరా చేయాలని గతంలో ప్రత్యేక జీవో కోసం రైతులు ధర్నాలు చేశారు. అప్పటి పాలకులు ప్రత్యేక కృషి చేశారు. 50 క్యూసెక్కుల నీరు నిరంతరం నీటి సరఫరా చేయడానికి జీవో కూడ జారీ అయినట్లు అప్పటి పాలకులు ప్రచారం సైతం చేశారు. అధికారుల ఆదేశాల మేరకే .. కాకతీయ కాలువ వెంట ఉన్న ఫీడర్లకు రోజుకు తొమ్మిది గంటల పాటు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అధికారుల ఆదేశాలను పాటించి విద్యుత్ సరఫరా కుదించాం. రైతులు కూడా సహకరిస్తున్నారు. – బాబా శ్రీనివాస్, ఏఈ, ఎన్పీడీసీఎల్ ఏర్గట్ల సెక్షన్ -
కాకతీయ కాల్వల సామర్థ్యం పెంపు
- 9 వేల డిశ్చార్జి సామర్థ్యానికి తేవాలని సీఎం ఆదేశం - కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీకి ఒక టీఎంసీ నీటి తరలింపునకు ఆమోదం - రూ.1,076 కోట్లతో ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ పరిధిలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చేందుకు వీలుగా కాకతీయ కాల్వలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాకతీయ కాల్వలను పూర్తి స్థాయి డిశ్చార్జి సామర్థ్యానికి తెచ్చేందుకు ఆదేశాలిచ్చారు. దీంతో కాల్వ బెడ్‌ను అర మీటర్ పెంచాలన్న నీటి పారుదల నిపుణుల కమిటీ సూచనకు ఆమోదం దక్కినట్లైంది. కాకతీయ కాల్వల పూర్తి ప్రవాహ సామర్థ్యం 9వేల క్యూసెక్కులు కాగా అందులో 50 శాతం కూడా ప్రవాహం ఉండటం లేదు. దీంతో కాకతీయ ప్రధాన కాల్వ లోయర్ మానేరు డ్యామ్ కింద ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2లోని 8.63 లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోతోంది. గత ఏడాది స్వల్ప మరమ్మతులు చేయడంతో 5వేల క్యూసెక్కుల వరకు గరిష్ట ప్రవాహం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించ గా, కాల్వ బెడ్‌ను 0.50 మీటర్ లోతుగా తవ్వితే చాలని, ఇలా తవ్వడం వల్ల 8వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం ఉంటుం దని తెలిపింది. నీటిపారుదల శాఖ అధికా రులతో సోమవారం సమీక్షించిన సీఎం, దీనికి ఓకే చేశారు. కాల్వల సామర్థ్యం పెంపునకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రూ.1,076 కోట్లతో లింక్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కాల్వ (ఎఫ్ఎఫ్సీ) ద్వారా ఒక టీఎంసీ నీటిని తరలించే ప్రక్రియకు సైతం ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని తరలించేందుకు ఓకే చేశారు. అయితే అధికారులు వేసిన అంచనా ఎక్కువగా ఉండటంతో దాన్ని తగ్గించాలని సూచించగా, ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ కలిపి రూ.70 కోట్ల మేర తొలగించి రూ.1,076 కోట్లతో తుది ప్రణాళిక ఖరారు చేశారు. తొమ్మిది నెలల్లో ఈ లింక్‌ను పూర్తి చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ అంచనాలకు ఆమోదం తెలపాలని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు విన్నవించింది. అక్కడ ఆమోదం దక్కగానే దీనికి టెండర్లు పిలవనున్నారు. -
నిధులు నీళ్లపాలు
నాసిరకంగా కాలువ పనులు కాకతీయ’కు గండితో వెల్లడైన వైనం పటిష్టతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు వరంగల్ : జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందించే కాకతీయ ప్రధాన కాల్వల పటిష్టతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వల్లోకి నీరు రాగానే గండి పడడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఎండీలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా ఎస్సారెస్పీ స్టేజ్–1తో పాటు స్టేజ్–2కు నీరు అందించాలంటే కాల్వల్లో పూర్తి సామర్థ్యం మేరకు 5 వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేయాలి. గత పదేళ్లుగా జిల్లాలోని ప్రధాన కాల్వలు, మైనర్లు, సబ్మైనర్లు నిర్మించినప్పటికీ కాలువలు బలహీనంగా ఉండడంతో 3వేల క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేయలేదు. ఎల్ఎండీ నుంచి మన జిల్లా వరకు ఉన్న స్టేజ్–1లోని ప్రధాన కాలువ 294 కిలోమీటర్లు పటిష్టం చేస్తేనే స్టేజ్ –2కు నీరందించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జిల్లాలోని 201–875 నుంచి 234 కి.మీ. వరకు మట్టికట్టలు, లైనింగ్ కోసం రూ.60 కోట్లు మంజూరయ్యాయి. అయితే కాలువల పనులు నాసిరకంగా చేపట్టడంతో అదనంగా నీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. కోట్లు వ్యయం చేసినా ప్రభుత్వ లక్ష్యం నేరవేరక పోగా నిధులన్నీ నీళ్లులో పోసినట్టయింది. గత వారం రోజులుగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాం నుంచి విడుదల చేస్తున్న నీటి సరఫరాను అధికారులు తగ్గించారు. గత నెల 27న వరంగల్ జిల్లా పరిధిలోని కాకతీయ ప్రధాన కాలువకు పెద్దమ్మగడ్డ సమీపంలో గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధ, గురువారాల్లో కాలువకు బయట పక్క గండి పడిన ప్రాంతంలో మట్టితో పూడ్చారు. 4వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తేనే ఈ పరిస్థితి నెలకొనడంతో ఎస్సారెస్పీ అధికారులు నీటి సరఫరాను తగ్గించారు. ప్రస్తుతం 3500 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో స్టేజ్–2 ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. పరిశీలించిన ఈఎన్సీ... అరెపల్లి బ్రిడ్జి సమీపంలోని కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని నీటి పారుద ల శాఖ ఈఎన్సీ విజయప్రకాశ్ గత శుక్రవారం పరిశీలించారు. కాలువ బెడ్ లెవల్లో నీటి ఊట ఎక్కువైనందున భారీగా నీరు విడుదల కావడంతో స్థానికులు అందోళనకు గురైనట్లు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి ఆయనకు వివరించారు. దీంతో కాలువ లీకేజీ ప్రాంతంలో అదనంగా మట్టి పోయడంతో పాటు నీరు ప్రవహిస్తున్న చోట ఇసుకబస్తాలతో బండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలువ పనుల సమయంలో పర్యవేక్షణ సరిగా లేనందునే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. ఇప్పటికైనా బయటకు వస్తున్న నీటిని మళ్లించి పర్యవేక్షించాలని ఎస్ఈని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హరీశ్ ఆరా..! కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. గండిని పరిశీలించిన ఈఎన్సీ విజయప్రకాశ్ నుంచి మంత్రి పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. గండి స్థానంలో కొత్త కట్ట నిర్మాణం కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడి వృథాగా నీరు లీక్ కావడంతో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. లీకేజీని అపేందుకు నాలుగు రోజులుగా శ్రమిస్తున్నారు. అయినా ప్రవాహం అగక పోవడంతో ఆ ప్రాంతంలోని మట్టి మొత్తం తీసి కొత్తగా కట్ట నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అదివారం నీరు లీకేజీ అయిన ప్రాంతంలోని కట్టను పూర్తిగా తొలగించి నాణ్యమైన మట్టితో కొత్తగా నిర్మిస్తున్నారు. కాకతీయ కాలువలో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తూ పనులు చేపట్టారు. దీంతో మరో వారం రోజుల పాటు నీటి సరఫరా జరగదని సమాచారం. -
కాకతీయ కాల్వపై మినీ రిజర్వాయర్లు
నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించండి రిటైర్డ్ ఇంజనీర్లను కోరిన మంత్రి ఈటల నాలుగు జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాలకు ఎల్‌ఎండీయే ఆధారం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : దిగువ మానేరు జలాశయం నుంచి మూసీ వరకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే ఒక్క జలాశయాన్ని కూడా గత పాలకులు నిర్మించకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని దాదాపు 9.5 లక్షల ఎకరాలకు ఎల్‌ఎండీయే ప్రాణాధారమైందన్నారు. డ్యాం నిండితే ఆయా జిల్లాలకు సాగునీరందుతుందని, లేకుంటే లేదని అన్నారు. కాకతీయ కాల్వపై ఒక టీఎంసీ నుంచి 5టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసేలా మినీ రిజర్వాయర్లు నిర్మిస్తే తద్వారా ఆయా జిల్లాల్లోని నిర్దేశిత ఆయకట్టుకు సాగునీందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం నేతలను మంత్రి ఈటల రాజేందర్ కోరారు. భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం నేత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఇంజనీర్ల బృందంతో మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మంగళవారం ఎల్ఎండీ అతిథిగృహంలో సమావేశమయ్యారు. మిడ్‌మానేరు ఆనకట్ట 130 మీటర్ల మేరకు కోతకు గురవడంతోపాటు మానాలవద్ద కాకతీయ కాల్వకు గండిపడిన అంశంపై చర్చించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద పడిన గండిని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పకడ్బందీ సూచనలివ్వాలని కోరారు. మంత్రి సూచనల మేరకు కాకతీయ కాలువపై మరిన్ని రిజర్వాయర్లు నిర్మించే అంశంపై అధ్యయనం చేస్తామని రిటైర్డు ఇంజనీర్ల బృందం నేత శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అనంతరం వారు భారీ వర్షాలు, వరదలతో గండిపడిన మిడ్‌మానేరు, కాకతీయ కాలువలను సందర్శించారు. మిడ్‌మానేరు ఆనకట్టకు గండిపడటంతోపాటు 130 మీటర్ల మేరకు కోతకు గురికావడాన్ని పరిశీలించారు. మానాల వద్ద కాకతీయ కాలువకు గండిపడటానికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. మానాలవద్ద ఏర్పాటు చేసిన స్లూయీస్‌ను మరో 150 మీటర్ల దిగువన ఏర్పాటు చేస్తే గండిపడే అవకాశం ఉండేది కాదని రిటైర్డు ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. వీటిపై త్వరలోనే తాము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 10 లక్షల ఎకరాలకు లాభమైంది : ఈటల భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో వెయ్యి ఎకరాలకు నష్టం జరిగితే దాదాపు పది లక్షల ఎకరాలకు లాభం జరిగిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎల్ఎండీని సందర్శించారు. వరదలతో డ్యాంలో నీరు చేరి కళకళలాడుతుండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టడం చేయడంతోపాటు డ్యాం పొడువునా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు పడిపోయిన వారిని రక్షించేందుకు బోట్స్, లైవ్‌జాకెట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. 72 గంటలుగా నిరంతరాయంగా పర్యవేక్షించడంవల్ల భారీ నష్టం వాటిల్లకుండా కాపాడగలిగామని తెలిపారు. జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనాలు వేసి రైతులను ఆదుకుంటామన్నారు. జిల్లాలో 5,500 చెరువులుంటే 132 చెరువులు తెగిపోయాయన్నారు. మిషన్ కాకతీయ చెరువులు మాత్రం చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చే యాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
శ్రీపాదఎల్లంపల్లికి వరద పోటు
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుంచి 5,27,662 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థాయిలో 40 గేట్లు ఎత్తి దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. లోయర్ మిడ్‌మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 7 గంటల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం 21.87 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 18167 క్యూసెక్కులు ఉండగా 5000 క్యూసెక్కులు కాకతీయ కాలువకు వదులుతున్నారు. -
కాకతీయ కాల్వకు గండి
-
కాకతీయ కాల్వకు గండి
మల్యాల/పెగడపల్లి/గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాల్వకు మంగళవారం ఉదయం భారీ గండిపడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు రావటంతో రాకపోకలు స్తంభించాయి. మానాల గ్రామం దమ్మక్క చెరువులోకి నీళ్లు వెళ్లే తూము డీ-65 వద్ద కాకతీయ ప్రధాన కాల్వకు ఈ గండిపడింది. దీంతో దమ్మక్క చెరువు నిండి సమీప పొలాలు నీటమునిగాయి. మానాల, మ్యాడంపల్లిల్లో వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దమ్మక్క చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి చేరాయి. ఈ కాలనీకి చెందిన 300 కుటుంబాలను అధికారులు తక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసి న శిబిరానికి తరలించారు. ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ గేట్లు మూసివేయడంతోపాటు నీటి ఉధృతి తగ్గించేందుకు పలుచోట్ల తూముగేట్లు తెరిచారు. సాయంత్రం మ్యాడంపల్లిలోని కల్వర్టు తెగి.. గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గండి పూడ్చే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. పెగడపల్లి మండలం సుద్దపల్లి కోయ చెరువు నిండి గండి పడింది. ఆదుకుంటాం: ఈటల, చీఫ్‌విప్ కొప్పుల ఎస్సారెస్పీ కాల్వకు గండి పడటంతో పంటలు నష్టపోరుున రైతులతోపాటు ఇతరత్రా నష్టపోరుున బాధితులను ఆదుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ కాలువ డీ-65 తూము గండిని ఆయన పరిశీలించారు. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలో నీళ్లు చేరిన ఇళ్లను పరిశీలించారు. పునరావాస శిబిరంలో ఉన్న బాధితులను పరామర్శించారు. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో పరిస్థితిని సమీక్షించి, అధికారులను అప్రమత్తం చేశారు. రైతులను ఆదుకుంటామన్నారు. -
కాకతీయ కాలువలో పడి యువకుడి మృతి
బాల్కొండ: ప్రమాదవశాత్తూ కాకతీయ కాలువలో పడి సులేమాన్ ఖాన్(19) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఎస్సారెస్పీ వెలుగు’లకు 26 ఏళ్లు
* ఆదివారం నుంచి 27వ వసంతంలోకి.. ‘జల విద్యుదుత్పత్తి కేంద్రం’ * 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యం * నాలుగు సార్లు మాత్రమే చేరిన వైనం బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 26 వసంతాలు పూర్తి చేసుకుని ఆదివారం 27వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1988 డిశంబర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా జల విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడి జల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ ప్రయోజనమే జల విద్యుతుత్పత్తి. దీంతో ప్రభుత్వం కాకతీయ కాలువ ప్రారంభంలో సెప్టెంబర్ ఒకటిన రూ. 23.5 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది. మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభించారు. రెండో దశలో నాల్గో టర్బయిన్ పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండవ టర్బయిన్ 1987 డిసెంబర్లో, మూడవ టర్బయిన్ 1988 జూలైలో పనులు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెంబర్లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పూర్తిచేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రంగా కొనసాగుతోంది. ఈ కేంద్రాన్ని స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు. టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది. ప్రతి టర్బయిన్‌కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కే.వీ సబ్ స్టేషన్ కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 24 గంటలకోసారి విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుతుత్పత్తి జరుగుతుంది. 26 ఏళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది. నాల్గు టర్బయిన్లతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాలుగు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడం లేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టినా, కాలువకు గండి పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జల విద్యుదుత్పత్తి కేంద్రంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. విద్యుదుత్పత్తికి ‘వరద’ గండం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి వరద కాలువ జల విద్యుదుత్పత్తికి గండంగా మారింది. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లాలోని లోయార్ మానేరు డ్యాం నింపే అవకాశం ఉండగా, వరద కాలువ ద్వారానే నీటి విడుదల చేపడుతున్నారు. దీంతో విద్యుదుత్పత్తికి తీవ్ర నష్టం కలుగుతోంది. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. -
మళ్లీ మొదటికే..!
తిమ్మాపూర్: కరీంనగర్ ఎల్ఎండీ నుంచి సాగునీరు తరలించే కాకతీయ కాలువ మరమ్మతు పనులు ప్రతీసారి అర్ధంతరంగానే ని లిచిపోతున్నాయి. మరమ్మతు పనులు చే పట్టిన కొన్ని రోజులకే ఏదో ఒక అవసరం తో నీటిని వదలాల్సి వస్తోంది. దీంతో ఆ పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నా యి. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఎప్పటిలాగే ఈసారి కాలువ లై నింగ్ పనులు చేపట్టగా.. ఆయకట్టుకు సాగునీరందించాలని నీటిని వదలడంతో పనులు మళ్లీ మొదటికే వచ్చాయి. దీంతో రూ.14 లక్షలు నీటి పాలయ్యాయి. ముచ్చటగా మూడుసార్లు 2013లో కాలువకు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఆ సమయంలో సా గుకు నీరు విడుదల చేయడంతో అప్పటి కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశాడు. 2014లో సబ్ కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. వరంగల్‌కు తాగునీటిని వదిలినప్పుడు ఒకసారి.. వినాయక నిమజ్జనానికి మానకొండూర్ చెరువును నిం పేందుకు రెండోసారి... ప్రస్తుతం మూడోసారి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో మరమ్మతు పనులు నిలిపివేశారు. ఈ ఏడాదిలో మూడుసార్లు మరమ్మతు లు నిలిచిపోగా రూ.14 లక్షల నష్టం జరిగి ఉంటుందని సూపర్వైజర్లు తెలిపారు. నష్టాన్ని కాంట్రాక్టరే భరించుకుంటారని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. రూ.3 కోట్లు అటు ప్రభుత్వం, ఇటు ఇంజినీరింగ్ అధికారుల చర్యలతో కాలువ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఎల్ఎండీ దిగువన 147 కిలోమీటర్ వద్ద కాలువ లైనింగ్ ప నులు చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం రూ.3కోట్లతో టెండర్లు పూర్తి చేసిం ది. పనులు ప్రారంభించగా వర్షాలు పడడంతో మధ్యలోనే నిలిచిపోయాయి. కనీ సం నెల రోజుల వరకు నీరు వదలకపోతే పనులు పూర్తిచేయగలమని కాంటాక్టర్ పేర్కొంటున్నారు. పనులు మొదలు పెట్టి న కొద్ది రోజులకే నీటిని విడుదల చేస్తుం డడంతో కాంట్రాక్టర్ ఆందోళనకు గురవుతున్నాడు. ఈసారి ఆశించిన మేరకు వ ర్షాలు లేకపోయిన ఎల్ఎండీలో తొమ్మిది టీఎంసీల నీరు ఉండగా ఆయకట్టుకు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు నీటిని విడుదల చేయగా ప్రస్తుతం మరమ్మతు పనులు నిలిచిపోయాయి. అటు అధికారులు.. ఇటు కాంట్రాక్టర్ల చర్యలతో పనులు పూర్తి కాకపోతే నీటి విడుదల సామర్థ్యం తగ్గి తమకే నష్టం వాటిల్లుతుందని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
రామన్నగూడెం వద్ద 6.59 మీటర్లకు చేరిన వరద నీరు ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద వరద నీరు క్రమేపీ పెరుగుతోంది. బుధవారం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 6.59 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు గోదావరమ్మ పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తోంది. గత నెలలో ఏడారిగా మారిన గోదావరి నది.. ఇప్పుడు జలకళను సంతరించుకుంది. గోదావరిలో నీరు క్రమేపీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 8.50 మీటర్లుకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ధర్మసాగర్‌కు చేరిన గోదావరి జలాలు ధర్మసాగర్ : దేవాదుల పైపులైన్ ద్వారా గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరాయి. బుధవారం ఉదయం ఏటూరునాగారంలోని దేవాదుల వద్ద జె. చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఇన్‌టేక్‌వెల్ నుంచి మోటార్లను ఆన్ చేయటంతో తొలుత భీంఘన్‌పూర్ రిజర్వాయర్ చేరుకొగా, అక్కడి నుంచి పులుకుర్తి పంప్ హౌజ్ కు అనంతరం బుధవారం రాత్రి 8.10 గంటలకు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు కూడా పంపింగ్ వరంగల్ అర్బన్ : దేవాదుల నుంచి గోదావరి జలాలలను ధర్మసాగర్ రిజర్వాయర్‌తోపాటు భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు సామర్థ్యం మేరకు పంపింగ్ చేసే అవకాశం ఉంటుందని బల్దియా ఇంజినీర్లు తెలిపారు. దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద నుంచి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేస్తే మూడు జలాశయాలు జలకళ సంతరించుకుంటాయని, దీంతో మరో ఆరు నెలల పాటు నగర వాసులకు తాగునీటికి ఢోకా ఉండదని పేర్కొంటున్నారు. కాగా, కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీటి విడుదలకు బ్రేక్ పడింది. వారం రోజుల పాటు కాకతీయ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేసిన ఎల్ఎండీ ఇంజినీర్లు.. మరమ్మతుల పేరుతో నీటి విడుదలను ఈనెల 20న నిలిపివేశారు. ప్రస్తుతం కాకతీయ కెనాల్లో ఉన్న నీటి నిల్వలను ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్దీకరణ చేసి పంపింగ్ చేస్తున్నారు. -
నీటి పంపింగ్ ప్రారంభం
భద్రకాళి జలాశయానికి నీరు - పైపులైన్ లీకేజీతో వడ్డేపల్లి చెరువుకు బ్రేక్ - మరమ్మతులకు సన్నాహాలు కార్పొరేషన్ : కరీంనగర్ ఎల్ఎండీ నుంచి విడుదలైన మంచినీరు కాకతీయ కెనాల్ ద్వారా శుక్రవారం రాత్రి నగరానికి చేరుకోవడంతో శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ ఇంజినీర్లు సమ్మర్ స్టోరేజీల్లోకి పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు. దేశాయిపేట కెనాల్ ఆఫ్‌టెక్ పాయింట్ నుంచి భద్రకాళి చెరువులోకి రెండు మోటార్ల ద్వారా పంపింగ్ కొనసాగుతోంది. హన్మకొండ కేయూసీ ఫిల్టర్‌బెడ్ కెనాల్ ఆఫ్‌టెక్ పాయింట్ నుంచి వడ్డేపల్లి చెరువులోకి పంపింగ్ చేసే క్రమంలో నీటి ఉధృతికి సమ్మయ్యనగర్ వద్ద 1000 ఎంఎం డయా పైపులైన్ లీకుకావడంతో పంపింగ్ నిలిపివేశారు. పైపులైన్ మరమ్మతు కోసం హైదరాబాద్ జలమండలి నిపుణులను రప్పిస్తున్నామని, ఆదివారం మధ్యాహ్నంలోగా వెల్డింగ్ పనులు పూర్తి చేసి పంపింగ్ ప్రారంభిస్తామని బల్దియా ఎస్ఈ ఉపేంద్రసింగ్ తెలిపారు. మరోవైపు వరంగల్‌లోని దేశాయిపేట, కేయూ, వడ్డేపల్లిలో మూడు చొప్పున ఉన్న మొత్తం తొమ్మిది ఫిల్టర్బెడ్లు రన్ అవుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఆదివారం నుంచి తాగునీరు సరఫరా చేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం మోటార్లు, గేట్లు, వాల్వ్‌లను ఇంజినీర్లు సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎండీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా వస్తున్న నీటిని మళ్లించకుండా నిఘా కొనసాగుతోంది. రోజుకు 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే 20 రోజుల పాటు విడుదల చేయాలని బల్దియా ఎస్ఈ ఉపేంద్రసింగ్ ఎల్ఎండీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డిని ఫోన్ ద్వారా కోరారు. కమిషనర్ అందుబాటులో లేనందున ఆయన వచ్చాక లేఖ పంపనున్నట్లు తెలిపారు. -
ప్రమాదకరంగా కాకతీయ కాలువ
బాల్కొండ,న్యూస్‌లైన్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ (కాకతీయ కాలువ) పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ కాలువ ద్వారా జిల్లా ప్రజలకు స్వల్పంగా ప్రయోజనం చేకూరినా, కాలువ అవసరం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ నుంచి అధికారులు రబీ సీజన్లో ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేపడుతున్నారు. కాని నీటి ప్రవాహానికి కాలువ క్రమంగా కొన్ని చోట్ల కోతకు గురవుతోంది. ప్రాజెక్ట్ నుంచి 100 మీటర్ల దూరంలోనే కోతకు గురవడం గమనార్హం. మండలంలోని మెండోరా, రెంజర్ల శివారులో కాలువ ప్రమాదకరంగా మారింది. ఏక్షణాన గండిపడుతుందోనని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు రెండు పక్కల చేసిన సిమెంట్ లైనింగ్ పూర్తిగా చెడిపోయింది. దీంతో గండి పడే ప్రమాదం పొంచిఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. దీంతో రోజురోజుకు సిమెంట్ లైనింగుకు పగుళ్లు వచ్చి లైనింగ్ పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది. కాలువపై 9లక్షల 68 వేలఎకరాల ఆయకట్టు కాకతీయ కాలువ పై సుమారు 9లక్షల 68 వేల ఎకరాల ఆయకట్టు ఆధార పడిఉంది. ఇంత ఆయకట్టు ఆధారపడి ఉన్న కాలువ ప్రథమార్థంలోనే ప్రాజెక్ట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కాలువ పూర్తి గా కోతకు గురై గండి పడే ప్రమాదం ఏర్పడింది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. దీనిపై మరో ప్రాజెక్ట్ కూడా ఆధారపడి ఉంది. 2006 లో సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. కాని కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల సిమెంట్ పూర్తిగా పెచ్చులూడి పోయింది. కాలువ నిర్మాణ క్రమంలో లైనింగ్ కు సిమెంట్ బిల్లలు వేశారు. కాని ఈ బిల్లలను గుర్తుతెలియని దుండగులు కాలువ కట్ట నుంచి ప్రతి ఏడాది ఎత్తుకెళుతున్నారు. దీంతో నీరు ప్రవహించినప్పుడు కట్ట కోతకు గురవుతూ గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఏడువేల క్యూసెక్కుల కంటే దాటని పరిస్థితి కాకతీయ కాలువ పూర్తి నీటి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. కాని కాలువ లైనింగ్ పనులు శిథిలావస్థకు చేరడంతో గత రెండేళ్లు గా ఏడు వేల క్యూసెక్కుల కు మించి నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నా ఎక్కడ గండి పడుతుందోనని ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి కి తీరని నష్టం వాటిల్లుతుంది. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఎస్సారెస్పీ కాలువల పనుల మరమ్మతులంటేనే ప్రభుత్వాలకు ఒకింత నిర్లక్ష్యం మనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కాలువ పనులకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.