కాకతీయ కెనాల్‌లో పడిన కారును బయటకు తీస్తున్న దృశ్యం.., మృతి చెందిన సహస్ర, రాధ, సత్యనారాయణరెడ్డి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని కాకతీయ కాలువలో ఓ కుటుంబం జలసమాధి అయింది. కారు కాలువలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. అయితే, సంఘటన జరిగిన 21 రోజుల తర్వాతే ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బైక్ కాలువలోకి దూసుకెళ్లి ఓ మహిళ గల్లంతయ్యారు. ఆమె కోసం గాలించేం దుకు నీటి ప్రవాహం తగ్గించడంతో ప్రమాదానికి గురైన కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా, అందులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతులను పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)గా గుర్తించారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం చేశారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను బట్టి దీనిని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌రెడ్డి తెలిపారు.
కుమార్తెను హైదరాబాద్ తీసుకెళ్దామని...
సత్యనారాయణరెడ్డి కరీంనగర్‌లో సాయితిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. బీటెక్ చదువుదున్న వారి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. త్వరలోనే చదువు పూర్తికానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు నెలలపాటు హౌస్‌సర్జన్ శిక్షణ ఇప్పించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనవరి 26న ఆయన హైదరాబాద్ వెళ్లి కుమార్తె కోసం కొంపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో కొన్ని సామాన్లు సర్ది ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటిరోజు సాయంత్రం 4 గంటల సమయంలో భార్య, కూతురుతో కలిసి బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి ఏపీ15బీఎన్ 3438 అనే నెంబర్ గల కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్లు స్విఛాప్ వచ్చాయి. దీంతో నాలుగైదు రోజుల తర్వాత వారి నివాసానికి వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురూ కలిసి కారులో వెళ్లినట్టు గుర్తించారు. అయినప్పటికీ అనుమానంతో ఇంటితాళం పగలగొట్టి లోపలకి వెళ్లి చూశారు. అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో ఏదైనా టూర్‌కి వెళ్లి ఉంటారని భావించి మరో తాళం వేసి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఓదారుస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి
టూర్ వెళ్తున్నానని చెప్పిన వినయశ్రీ..
జనవరి 26వ తేదీ కంటే ముందు వినయశ్రీ ఇంటికి వచ్చింది. తాము టూర్‌కు వెళ్తున్నట్టు తన స్నేహితురాళ్లకు చెప్పింది. నాలుగైదు రోజులు గడిచినా ఆమె రాకపోవడంతో వారు ఫోన్ చేశారు. అది స్విఛాఫ్ వచ్చింది. సుమారు వారం రోజులకు ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తెలియంతో ఆయన తన చెల్లెలి కుటుంబం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. పనిమనిషిని అడగ్గా.. పది పదిహేను రోజులు టూర్ వెళ్తున్నట్టుగా తనకు చెప్పారని ఆమె వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న కొంపల్లిలో విచారించగా అక్కడికి కూడా రాలేదని తెలిసింది. ఫోన్ ట్రాకింగ్ చేసి చూస్తే కరీంనగర్‌లోనే సిగ్నల్ చూపించింది. అయితే, తరచూ యాత్రలకు వెళ్లే అలవాటున్న చెల్లెలు కుటుంబం దుబాయ్ వెళ్లి ఉండొచ్చని ఎమ్మెల్యే భావించినట్లు ఆయన బంధువులు తెలిపారు. అయితే ఇంత జరిగినా పోలీసులకు మాత్రం ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సత్యనారాయణరెడ్డి స్నేహితుడు ఒకరు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పటికీ, సీఐ లేకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకుండానే తిరిగి వచ్చారు.
విషయం వెలుగుచూసింది ఇలా..
ఆదివారం రాత్రి పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన దంపతులు బైక్‌పై కరీంనగర్ నుంచి గన్నేరువరం బయల్దేరారు. అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బైక్ లైటు వెలుతురుకు భారీగా పురుగులు వచ్చాయి. అవి ప్రదీప్ కళ్లలో పడటంతో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వెళ్తున్న ఎల్‌ఎండీ పెట్రోలింగ్ పోలీసులు కాలువలో కొట్టుకుపోతున్న ప్రదీప్‌ను కాపాడారు. కీర్తన గల్లంతయ్యారు. దీంతో ఆమె కోసం గాలించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపివేయించారు. గజఈతగాళ్లు కీర్తన కోసం గాలించగా.. మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభించింది. కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో గతనెల 27న అందులో పడిపోయిన సత్యనారాయణరెడ్డి కారు బయట పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కారుని బయటకు తీయించారు. కారు నెంబర్ ఆధారంగా అది సత్యనారాయణరెడ్డి పేరున ఉన్నట్టు గుర్తించారు. ఆయన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా బావ అని తెలుసుకుని ఆయనకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చిన మనోహర్‌రెడ్డి.. కారును పరిశీలించి తన బావ కారుగా నిర్ధారించారు. అందులో ఉన్న మూడు మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. గతనెల 27న ఇంట్లో నుంచి వెళ్లారని, అప్పటినుంచి తెలిసినవారి ఇళ్లలో ఆరా తీస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ వెళ్తున్నట్టు పొరుగువారికి చెప్పారని, ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని పేర్కొన్నారు. సంఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించారు.
ఆత్మహత్యకు అవకాశం తక్కువే!
సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ఇరుకుగా ఉన్న వంతెనపైకి రాకముందే కారు పూర్తిగా ఎడమవైపు వచ్చి కాలువలో పడి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఒకవేళ రెయిలింగ్‌ను తాకి కారు ప్రమాదానికి గురై ఉంటే రోడ్డుపై వెళ్లేవారికి తెలిసేదని అంటున్నారు. జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొంచెం కూడా కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు అనామకులుగా చనిపోవాలని భావించరని, కారుతోపాటు కాలువలోకి వెళ్లాలనుకోరన్నది వారి వాదన. అక్కడ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది.
కారులో సామాన్లు సర్ది వచ్చాను
గతనెల 27న మా సార్లు వాళ్ళు ఊరెళుతున్నారని చెప్పడంతో బెడ్‌షీట్లు, రైస్‌కుక్కర్‌తోపాటు కొని సామాన్లు కారులో పెట్టి వచ్చాను. అదేరోజు సాయంత్రం సత్యనారాయణరెడ్డి సారు రాధ మేడం ఫోన్ నుంచి నుంచి కాల్ చేసి తన ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయిందని, రీచార్జి చేయించాలని చెప్పారు. నేను వెంటనే రీచార్జీ చేయించాను. మరుసటిరోజు ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చింది. నాలుగైదు రోజులు ఫోన్ కలవకపోవడంతో మా సార్ స్నేహితులు, బంధువుల షాప్‌కు వస్తున్నాడా అని నన్ను అడిగారు. ఇన్నిరోజులుగా మా సార్ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను.– నర్సింగ్, సత్యనారాయణరెడ్డి షాపులో పనిచేసే వ్యక్తి
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ నరెడ్డి సత్యనారాయణరెడ్డి కారు కాలువలో పడి, ఆయనతోపాటు భార్య రాధ, కుమార్తె వినయశ్రీ మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటనపై గతంలో మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఏ పోలీస్ స్టేషన్‌లోనూ మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుపుతాం. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఎలాంటి అనుమానాలు లేవని నిర్ధారించినందున ప్రమాదవశాత్తూ కారు కాలువలో పడి ఉంటుందని భావిస్తున్నాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ
ప్రమాదమేనని తేలింది
సత్యనారాయణరెడ్డి కుటుంబం చనిపోయిన ఘటన ప్రాథమిక విచారణలో ప్రమాదమే అని తేలింది. వీలైనంత తొందరగా విచారణ పూర్తిచేస్తాం. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయాలు దర్యాప్తులో బయటపడతాయి. – నితికాపంత్, ట్రైనీ ఐపీఎస్
Comments
Please login to add a commentAdd a comment