సాక్షి, కందుకూరు: గ్రామ సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణ శివారు లుంబినీవనం వద్ద శనివారం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండికందుకూరుకు చెందిన పిర్ల మాలకొండయ్య రెండో కుమారుడు రాఘవ (32) ప్రస్తుతం మండలంలోని కోవూరు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సచివాలయ కార్యదర్శికి ఫోన్ చేసిన రాఘవ తాను విధులకు రావడం లేదని, సెలవు కావాలని కోరాడు. సెలవు చీటీ పంపాలని కార్యదర్శి సూచించారు. ఆ తర్వాత రాఘవ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తనకు వాంతులు అవుతున్నాయని, ఆస్పత్రికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన రాఘవ కందుకూరు పట్టణానికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. రాత్రి అంతా ఎదురు చూసిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడం, పోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ కందుకూరు వైపు బయల్దేరారు. తండ్రి మాలకొండయ్య పట్టణ శివారు ప్రాంతం లుంబినీవనం కాలనీకి వచ్చే సరికి రాఘవ ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పడి ఉండటం గమనించాడు. ద్విచక్ర వాహనం ఆధారంగా వెతుకుతూ వెళ్లిన మాలకొండయ్యకు కొద్ది దూరంలో జామాయల్ తోటలో రాఘవ నిర్జీవంగా పడి ఉండటం గమనించాడు.
చనిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవది ఆత్మహత్యా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారం కోణంలోనూ అనుమానాలున్నాయి. అదే గ్రామానికే చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంలో పలుమార్లు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు కుటుంబ సభ్యులు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం వంటి కారణాల ఆధారంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కండే శ్రీనివాసులు
తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సచివాలయ ఉద్యోగి మృతి వార్త తెలుసుకున్న డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి సమాచారం తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా హాస్పటల్‌కు తరలించారు. సచివాలయ ఉద్యోగి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment