బాల్కొండ,న్యూస్‌లైన్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ (కాకతీయ కాలువ) పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ కాలువ ద్వారా జిల్లా ప్రజలకు స్వల్పంగా ప్రయోజనం చేకూరినా, కాలువ అవసరం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ నుంచి అధికారులు రబీ సీజన్‌లో ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేపడుతున్నారు. కాని నీటి ప్రవాహానికి కాలువ క్రమంగా కొన్ని చోట్ల కోతకు గురవుతోంది. ప్రాజెక్ట్ నుంచి 100 మీటర్ల దూరంలోనే కోతకు గురవడం గమనార్హం.
మండలంలోని మెండోరా, రెంజర్ల శివారులో కాలువ ప్రమాదకరంగా మారింది. ఏక్షణాన గండిపడుతుందోనని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు రెండు పక్కల చేసిన సిమెంట్ లైనింగ్ పూర్తిగా చెడిపోయింది. దీంతో గండి పడే ప్రమాదం పొంచిఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. దీంతో రోజురోజుకు సిమెంట్ లైనింగుకు పగుళ్లు వచ్చి లైనింగ్ పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది.
కాలువపై 9లక్షల 68 వేలఎకరాల ఆయకట్టు
కాకతీయ కాలువ పై సుమారు 9లక్షల 68 వేల ఎకరాల ఆయకట్టు ఆధార పడిఉంది. ఇంత ఆయకట్టు ఆధారపడి ఉన్న కాలువ ప్రథమార్థంలోనే ప్రాజెక్ట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కాలువ పూర్తి గా కోతకు గురై గండి పడే ప్రమాదం ఏర్పడింది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. దీనిపై మరో ప్రాజెక్ట్ కూడా ఆధారపడి ఉంది.
2006 లో సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. కాని కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల సిమెంట్ పూర్తిగా పెచ్చులూడి పోయింది. కాలువ నిర్మాణ క్రమంలో లైనింగ్ కు సిమెంట్ బిల్లలు వేశారు. కాని ఈ బిల్లలను గుర్తుతెలియని దుండగులు కాలువ కట్ట నుంచి ప్రతి ఏడాది ఎత్తుకెళుతున్నారు. దీంతో నీరు ప్రవహించినప్పుడు కట్ట కోతకు గురవుతూ గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది.
ఏడువేల క్యూసెక్కుల కంటే దాటని పరిస్థితి
కాకతీయ కాలువ పూర్తి నీటి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. కాని కాలువ లైనింగ్ పనులు శిథిలావస్థకు చేరడంతో గత రెండేళ్లు గా ఏడు వేల క్యూసెక్కుల కు మించి నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నా ఎక్కడ గండి పడుతుందోనని ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి కి తీరని నష్టం వాటిల్లుతుంది. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు.
ఎస్సారెస్పీ కాలువల పనుల మరమ్మతులంటేనే ప్రభుత్వాలకు ఒకింత నిర్లక్ష్యం మనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కాలువ పనులకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా కాకతీయ కాలువ
Published Thu, Jan 30 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement