వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్
సాక్షి. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టిన, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చిన ప్రాజెక్ట్ నుంచి చేపలు వెళ్లిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్‌కు జాలి గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ హైలెవల్‌లో ఉండటంతో నీటి విడుదల సమయంలో చేపలు, చేప పిల్లలు కాలువలో వెళ్లిపోతున్నాయి. దీంతో జలాశయంలో చేపలు, చేపపిల్లలు ఖాళీ అవుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద జాలి గేట్లు కావాలని ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మత్స్య కారులు అంటున్నారు. జాలి గేట్లు ఏర్పాటు చేస్తే 90 శాతం చేపలు, చేపపిల్లలు బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉండదంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు జాలి గేట్లు అమర్చుతామని పాలకులు వచ్చి సందర్శించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మోక్షం లభించలేదు. దీంతో వరద కాలువ ప్రవహించిన ప్రతిసారి మీనాలు కాలువలో పోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై చేపలు వేటాడుతు ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చేపల వేటకు వస్తుంటారు. కాకతీయ కాలువ, ఇతర కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పు డు చేపలు, చేపపిల్లలు చాలా తక్కువగా కాలు వల్లో కొట్టుకుపోతాయంటున్నారు. వీటికి జాలి గేట్లు ఉన్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వరద కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు జాలి గేట్లను అమర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
కాలువలో చేపల వేట
ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల జరిగినప్పుడు అధికంగా చేపలు బయటకు వెళ్తాయి. దీంతో కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద కొందరు చేపలు పడుతున్నారు. మత్స్యకారులే కాకుండా ఇతరులు కూడా చేపలను పట్టుకుంటారు. దీంతో మత్స్య సంపద తరలి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాలి గేట్లు నిర్మించాలి
వరద కాలువకు జాలీ గేట్లను నిర్మించాలి. లేదంటే నీటి విడుదల చేపట్టినా రోజులు వరద కాలువలో చేపలు అధికంగా బయటకు పోతాయి. దీంతో తీవ్రంగా నష్టపోతాం.
– కిషన్, మత్స్యకారుడు
లాభం ఉండటం లేదు
ప్రభుత్వం ప్రతి ఏటా ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదులుతుంది. కానీ వరద కాలువ ప్రవహిస్తే కాలువలోనే అనేక చేప పిల్లలు కొట్టుకు పోతున్నాయి. దీంతో లాభం ఉండటం లేదు. జాలి గేట్లు ఉంటే ఇంత నష్టం జరగదు.
– గణేశ్, మత్స్యకారుడు
మంత్రికి విన్నవించాం
వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద జాలి గేట్ల కోసం మంత్రి ప్రశాంత్‌రెడ్డికి విన్నవించాం. ఆయన సానూకూలంగా స్పందించారు. జాలీ గేట్లు పెడితే మత్స్యసంపద తరలిపోదు.
– గంగాధర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, బాల్కొండ
Comments
Please login to add a commentAdd a comment