బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పడిపోతోంది. ప్రాజెక్ట్ నుంచి తాగు నీటి అవసరాల కోసమే నీటి విడుదల చేపడుతున్నారు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగులు తగ్గుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు రికార్డుల్లో పేర్కొంటున్నారు. ఈ లెక్కన పది రోజులకు ఒక అడుగు నీటి మట్టం తగ్గుతుంది. మరో రెండు నెలల్లో 6 అడుగుల నీటి మట్టం తగ్గుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. గత నాలుగు రోజుల క్రితం వరకు 130 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. నాలుగు రోజుల నుంచి పెరిగిన ఎండ తీవ్రత వలన 229 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు కూడ ఎక్కువగా ఆవిరవుతుంది. నీటి వినియోగం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం అతి తక్కువ నీటి వినియోగం జరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 142 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
మిగత ఏ కాలువల ద్వారా కూడ నీరు వినియోగించడం లేదు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం శర వేగంగా తగ్గుతోంది. డెడ్ స్టోరేజీకి చేరువలో.. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. డెడ్ స్టోరేజీకి 2.3 టీఎంసీల దూరంలో ప్రాజెక్ట్ నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్‌లో 2015 సంవత్సరంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాక పోవడంతో డెడ్‌స్టోరేజీ దిగువకు ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయింది. ప్రస్తుత సంవత్సరం కూడ డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్ట్ 55 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు రెండు మార్లు మాత్రమే డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయినట్లు ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1052.40 (7.3 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment