Dead storage level
-
డెడ్ స్టోరేజీ దిశగా నాగార్జున సాగర్
-
డెడ్ స్టోరేజ్‌కి చేరువలో..
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పడిపోతోంది. ప్రాజెక్ట్ నుంచి తాగు నీటి అవసరాల కోసమే నీటి విడుదల చేపడుతున్నారు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగులు తగ్గుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు రికార్డుల్లో పేర్కొంటున్నారు. ఈ లెక్కన పది రోజులకు ఒక అడుగు నీటి మట్టం తగ్గుతుంది. మరో రెండు నెలల్లో 6 అడుగుల నీటి మట్టం తగ్గుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. గత నాలుగు రోజుల క్రితం వరకు 130 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. నాలుగు రోజుల నుంచి పెరిగిన ఎండ తీవ్రత వలన 229 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు కూడ ఎక్కువగా ఆవిరవుతుంది. నీటి వినియోగం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం అతి తక్కువ నీటి వినియోగం జరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 142 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మిగత ఏ కాలువల ద్వారా కూడ నీరు వినియోగించడం లేదు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం శర వేగంగా తగ్గుతోంది. డెడ్ స్టోరేజీకి చేరువలో.. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. డెడ్ స్టోరేజీకి 2.3 టీఎంసీల దూరంలో ప్రాజెక్ట్ నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్‌లో 2015 సంవత్సరంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాక పోవడంతో డెడ్‌స్టోరేజీ దిగువకు ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయింది. ప్రస్తుత సంవత్సరం కూడ డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్ట్ 55 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు రెండు మార్లు మాత్రమే డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయినట్లు ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1052.40 (7.3 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
మం‘జీరబోయింది’..
రేగోడ్(మెదక్): భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు బోరుమంటున్నాయి. నీటిగండం తరుముకొస్తోంది. మంజీర ఎడారిని తలపిస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి 16 టీఎంసీల నీటిని తరలించడంతో ఇటు తాగడానికి.. అటు వ్యవసాయానికి నీళ్లు కరువయ్యాయి. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని మంజీరా పరీవాహకం వద్ద నీళ్లు అడుగంటిపోయి బురద తేలుతోంది. సింగూరు ప్రాజెక్ట్ సైతం డెడ్ స్టోరేజీకి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఏప్రిల్ చివరి వరకు మాత్రమే నీటి సరఫరా అయ్యే అవకాశం ఉంది. సింగూరు, మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న వేలాది బోరుబావులు, బావులు ఎండుముఖం పట్టాయి. లక్షలాది ఎకరాలు పడావుగా మారాయి. బీడు భూములను చూస్తూ రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు కొన్ని రోజులుగా రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చిన నీళ్లు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో తాగునీళ్లు వస్తాయా..? రావా..? అన్న ఆందోళన నెలకొంది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలి బోర్లు ఎండిపోయాయి. రెండు రోజులకోసారి నీళ్లొస్తున్నాయి. నీళ్లు సరిపోక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి నీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. –పాపయ్య, రేగోడ్ బోర్లు లీజుకు తీసుకుంటున్నం గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఇబ్బందులు ఎక్కడా రానీయకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – లచ్చాలు, ఎంపీడీఓ రేగోడ్ -
నగరానికి నీటికష్టం
మహా నగరానికి మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రేటర్ పరిధిలో నీటికష్టాలు తరుముకొస్తున్నాయి. విశాఖ వాసులకు తాగునీటిని సరఫరా చేస్తున్న రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో.. ఏలేరు నుంచి వచ్చే గోదావరి జలాలపైనే ఆశలున్నాయి. దీంతో వేసవి నాటికి నగర ప్రజలకు తాగునీటి కష్టాలు మరింత ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ముందు జాగ్రత్తగా డిసెంబర్ నుంచి పరిశ్రమలకు అందించే నీటిలో 25 శాతం కోత విధించాలని జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ తరహాలో బల్క్ కనెక్షన్లకు నీటి సరఫరాలో కోత విధించడం తొలిసారి కావడం చూస్తుంటే.. పరిస్థితి ఎంత దుర్భిక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ సిటీ: అంతర్జాతీయ నగరంగా, ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెబుతున్న పాలకులు.. నగరానికి కావాల్సిన నీటి వనరులను పెంపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పాతికేళ్లుగా అదనపు నీటి వనరులు సమకూర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. ఫలితంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ అధికారులు తలకిందులవుతున్నారు. 8 లక్షల జనాభా ఉన్నప్పుడు ఉన్న వనరులతోనే సుమారు 24 లక్షల జనాభా ఉన్న నేటి నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కురవాల్సిన దానికంటే కనిష్ట స్థాయిలో వర్షాలు కురవడంతో ఆయా వనరుల్లో నీటి నిల్వలు పెరగలేదు. ఫలితంగా వేసవి రాకముందే అవన్నీ ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఏలేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం కాల్వల ద్వారా నగరానికి తాగునీటి అవసరాలకు 80 ఎంజీడీలు అవసరం ఉండగా.. నీటి వనరుల లభ్యత బట్టి కేవలం 67.3 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది. ఇందులో శివారు ప్రాంతాలైన ఆరిలోవ, విశాలాక్షినగర్, తోటగరువు, ముడసర్లోవ, చినగదిలి తదితర ప్రాంతాలకు నీటిని అందించే ముడసర్లోవ రిజర్వాయర్ నీటిమట్టం కనిష్ట స్థాయికి సమీపిస్తోంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి రోజుకి 0.5 ఎంజీడీ నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ గరిష్ట నీట మట్టం 169 అడుగులు కాగా.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా 157 అడుగులకు పడిపోయింది. ఈ నీటి వనరులు ఏప్రిల్ నెలాఖరు వరకు సరిపోతాయి. ఆ తర్వాత శివారు గ్రామాల పరిస్థితి ఏమిటన్నది అంతు చిక్కడంలేదు. అన్ని రిజర్వాయర్లలో అదే పరిస్థితి వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒక్క ముడసర్లోవే కాకుండా మిగిలిన కెనాల్స్ పరిస్థితీ అదే మాదిరిగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ప్రకారం ఏప్రిల్ నెలాఖరు వరకు నెట్టుకొచ్చేయ్యొచ్చు. ఆ తర్వాత పరిస్థితేంటన్నది అగమ్యగోచరంగా మారనుంది. వీటిలో ఒక్క ఏలేరు కాల్వ నుంచే 80 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా అవుతోంది. అయితే.. మార్గమధ్యంలో రైతుల దారిమళ్లింపు, లీకుల వల్ల దాదాపు 20 ఎంజీడీల నీరు వృథా అయిపోతుండగా.. కేవలం 65 ఎంజీడీలు మాత్రమే అందుతున్నాయి. ఇందులో 35 ఎంజీడీలు స్టీల్ ప్లాంట్‌కు, 10 ఎంజీడీలు ఏపీఐఐసీ, గంగవరం పోర్టు, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలకు అందిస్తున్నారు. మిగిలిన 20 ఎంజీడీలు నగర ప్రజల తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. దీంతోపాటు రైవాడ నుంచి 25 ఎంజీడీలు, మేఘాద్రిగడ్డ నుంచి 8.5, గోస్తనీ నుంచి 3.5, తాటిపూడి నుంచి 11 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను చూస్తుంటే.. త్వరలోనే ఈ సరఫరా పూర్తిగా తగ్గిపోయే ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఒక్క ఏలేశ్వరంలో తప్ప.. మిగిలిన రిజర్వాయర్లన్నీ అథమ స్థితికి చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఏలేరులో 85.97 మీటర్ల గరిష్ట నీటిమట్టం ఉంది. రోజుకు 80 ఎంజీడీల చొప్పున సరఫరా చేస్తే.. 2019 డిసెంబర్ వరకూ ఈ నీటి నిల్వలు సరిపోతాయి. ఈలోపు వర్షాలు కురిస్తే తప్ప.. ఇందులో నుంచి సరఫరా మహా కష్టమనే చెప్పవచ్చు. మిగిలిన రిజర్వాయర్ల పరిస్థితీ దారుణంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో.. నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. ఏలేరు తర్వాత ఎక్కువ శాతం నీటిని సరఫరా చేసే రైవాడ కూడా కనిష్టమట్టానికి చేరువై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రైవాడ రిజర్వాయర్ కనిష్ట నీటిమట్టం 99 మీటర్లు కాగా.. ప్రస్తుతం 103.50కి చేరుకుంది. రోజు వారీ సరాసరి సరఫరా చేస్తే.. జనవరి మొదటి వారంలోనే రైవాడ ఖాళీ అయిపోతుందని మహా విశాఖ నగర పాలక సంస్థ నీటి సరఫరా విభాగం అంచనా వేస్తోంది. ఇలా.. ప్రతి రిజర్వాయర్.. అట్టడుగు స్థాయికి చేరుకొని వచ్చే ఏడాది జనవరి నాటికే నగరంలో దాహం కేకలు వినిపించనున్నాయి. రోజు విడిచి రోజు సరఫరా..25 శాతం కోతలు వర్షాభావ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న నీటినిల్వలపై ఆందోళన చెందిన జీవీఎంసీ అధికారులు.. ముందస్తు చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బల్క్ కనెక్షన్లకు అందించే నీటి సరఫరాలో 25 శాతం కోత విధించాలని నిర్ణయించారు. తాటిపూడి నుంచి పరిశ్రమలకు అందించే నీటి సరఫరాలో డిసెంబర్ 1 నుంచి 2019 మే 20 వరకూ అంటే 171 రోజుల పాటు 25 శాతం చొప్పున తగ్గించి సరఫరా చేస్తే సుమారు 287 ఎంజీడీలు ఆదా చెయ్యవచ్చని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అదే మాదిరిగా.. జోన్–1లో 2019 మార్చి 1 నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా చెయ్యాలని నిర్ణయించింది. 1, 2, 3, 6 వార్డులకు ఒకరోజు, మరుసటి రోజున 4, 5 వార్డులకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాలకు గోస్తనీ నది నుంచి సరఫరా జరుగుతుంటుంది. ఒకవేళ ఈ సమయాల్లో గోస్తనీలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతే.. టీఎస్ఆర్ రిజర్వాయర్ నుంచి ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు రివర్స్ పంపింగ్ చేసి ఆయా వార్డులకు నీటిని అందించాలని జీవీఎంసీ ప్రణాళికలు రూపొందించింది. నీటి కష్టాలు రాకుండాసిద్ధమవుతున్నాం రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు ముందుగానే రూపొందించాం. తాగునీరు అందుబాటులో ఉండీ.. సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. ఉదయం పూట నీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. నీటి సరఫరా సమయాలతోపాటు ఒకవేళ నీటిసరఫరా వేళల్ని మార్చినా వాటిని ప్రజలకు తెలియపరచాలని సిబ్బందిని సూచించాం. రానున్న వేసవి దృష్ట్యా అవసరమైన మరమ్మతులపై అప్రమత్తంగా ఉండాలని నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించాం. అదే విధంగా 32 విలీన గ్రామాల్లోనూ నీటి కొరత రాకుండా చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం.– హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
ఒక్కసారే గేట్లెత్తిమొనగాళ్లమనుకుంటే ఎలా?
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ రూరల్ : జిల్లాలోని ప్రాజెక్టుల గేట్లెత్తి తమకు చేతులు నొప్పి పుట్టాయని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి గేట్లెత్తి మొనగాళ్లమనుకుంటే ఎలా అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగర్‌లో డెడ్ స్టోరేజీ లెవల్లో నీరున్నప్పటికీ తాము ఏఎమ్మార్పీకి, సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేశామన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే 6వేల కూసెక్కుల నీరు జిల్లాకు వస్తుందని, ఇందులో 4వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా, మరో 2వేల క్యూసెక్కులు డిండి దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చన్నారు. సొరంగమార్గం విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ జెడ్పీ సమావేశంలో ప్రశ్నిస్తే పనికిమాలిన ప్రాజెక్టు అని..పక్కకు పెట్టేస్తామని చెప్పడం మంత్రి జగదీష్‌రెడ్డికి ఉన్న అవగాహన అర్థమవుతుందని పేర్కొన్నారు. సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలన్నారు. తాము అనేకసార్లు నీటివిడుదల చేసేందుకు గేట్లు తిప్పి అలసిపోయామన్నారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. 1983 నుంచి 2000 వరకు కేసీఆర్ ఆంధ్రాపార్టీ కింద పనిచేయలేదా, 2004లో కేసీఆర్‌లో మంత్రిగా ఉండలేదా, ఇప్పుడున్న కొందరు నేతలు వైఎస్ఆర్ కింద మంత్రులుగా కొనసాగలేదా అని ప్రశ్నించారు. తానుగ్రామస్థాయి నుంచే నాయకుడిగా ఎదిగినప్పటికీ అనేక విషయాలను ఇప్పటికీ తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జేఏసీ పుట్టింది జానారెడ్డి ఇంట్లోనని, తెలంగాణ ఉద్యమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకపోరాటం చేశారన్నారు. ఇటీవల గెలిసిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యమంలో వెనుకనుంచి నాలుగు రాళ్లు వేశారో లేదో వారికే తెలియాలన్నారు. అలాంటి వారికి తమను విమర్శించేస్థాయి లేదన్నారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారో.. వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారో అర్థం కావడం లేదని, ఆ పార్టీలో మొదటినుంచి పనిచేసిన వారే బాధపడుతున్నారని గుత్తా అన్నారు. టీఆర్ఎస్ అంటే ఒక హిస్టీరియా లాగా వ్యాపించిందన్నారు. ఆదరించి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని, మీరెందుకు వస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు వున్నారు.