ఒక్కసారే గేట్లెత్తిమొనగాళ్లమనుకుంటే ఎలా?
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ రూరల్ : జిల్లాలోని ప్రాజెక్టుల గేట్లెత్తి తమకు చేతులు నొప్పి పుట్టాయని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ నేతలు ఒక్కసారి గేట్లెత్తి మొనగాళ్లమనుకుంటే ఎలా అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగర్‌లో డెడ్ స్టోరేజీ లెవల్‌లో నీరున్నప్పటికీ తాము ఏఎమ్మార్పీకి, సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేశామన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే 6వేల కూసెక్కుల నీరు జిల్లాకు వస్తుందని, ఇందులో 4వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా, మరో 2వేల క్యూసెక్కులు డిండి దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చన్నారు.
సొరంగమార్గం విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ జెడ్పీ సమావేశంలో ప్రశ్నిస్తే పనికిమాలిన ప్రాజెక్టు అని..పక్కకు పెట్టేస్తామని చెప్పడం మంత్రి జగదీష్‌రెడ్డికి ఉన్న అవగాహన అర్థమవుతుందని పేర్కొన్నారు. సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలన్నారు. తాము అనేకసార్లు నీటివిడుదల చేసేందుకు గేట్లు తిప్పి అలసిపోయామన్నారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు.
1983 నుంచి 2000 వరకు కేసీఆర్ ఆంధ్రాపార్టీ కింద పనిచేయలేదా, 2004లో కేసీఆర్‌లో మంత్రిగా ఉండలేదా, ఇప్పుడున్న కొందరు నేతలు వైఎస్‌ఆర్ కింద మంత్రులుగా కొనసాగలేదా అని ప్రశ్నించారు. తానుగ్రామస్థాయి నుంచే నాయకుడిగా ఎదిగినప్పటికీ అనేక విషయాలను ఇప్పటికీ తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జేఏసీ పుట్టింది జానారెడ్డి ఇంట్లోనని, తెలంగాణ ఉద్యమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకపోరాటం చేశారన్నారు. ఇటీవల గెలిసిన టీఆర్‌ఎస్ నాయకులు ఉద్యమంలో వెనుకనుంచి నాలుగు రాళ్లు వేశారో లేదో వారికే తెలియాలన్నారు. అలాంటి వారికి తమను విమర్శించేస్థాయి లేదన్నారు.
టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారో..
వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారో అర్థం కావడం లేదని, ఆ పార్టీలో మొదటినుంచి పనిచేసిన వారే బాధపడుతున్నారని గుత్తా అన్నారు. టీఆర్‌ఎస్ అంటే ఒక హిస్టీరియా లాగా వ్యాపించిందన్నారు. ఆదరించి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని, మీరెందుకు వస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు వున్నారు.