బోరంచ వద్ద మంజీర నదీ పరీవాహకంలో అడుగంటిన నీటిని చూసి దిగాలుగా కూర్చున్న రైతు
రేగోడ్(మెదక్): భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు బోరుమంటున్నాయి. నీటిగండం తరుముకొస్తోంది. మంజీర ఎడారిని తలపిస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పీకి 16 టీఎంసీల నీటిని తరలించడంతో ఇటు తాగడానికి.. అటు వ్యవసాయానికి నీళ్లు కరువయ్యాయి. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని మంజీరా పరీవాహకం వద్ద నీళ్లు అడుగంటిపోయి బురద తేలుతోంది. సింగూరు ప్రాజెక్ట్ సైతం డెడ్ స్టోరేజీకి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఏప్రిల్ చివరి వరకు మాత్రమే నీటి సరఫరా అయ్యే అవకాశం ఉంది. సింగూరు, మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న వేలాది బోరుబావులు, బావులు ఎండుముఖం పట్టాయి.
లక్షలాది ఎకరాలు పడావుగా మారాయి. బీడు భూములను చూస్తూ రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు కొన్ని రోజులుగా రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చిన నీళ్లు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో తాగునీళ్లు వస్తాయా..? రావా..? అన్న ఆందోళన నెలకొంది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
బోర్లు ఎండిపోయాయి. రెండు రోజులకోసారి నీళ్లొస్తున్నాయి. నీళ్లు సరిపోక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి నీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
–పాపయ్య, రేగోడ్
బోర్లు లీజుకు తీసుకుంటున్నం
గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఇబ్బందులు ఎక్కడా రానీయకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
– లచ్చాలు, ఎంపీడీఓ రేగోడ్
Comments
Please login to add a commentAdd a comment