మద్దూరు మండలంలో ఓ రైతు పొలం కింది భాగంలో తవ్విన కందకాలు
సాక్షి, సిద్దిపేట: వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. జలశక్తి అభియాన్‌లో భాగంగా నీటి వనరులను కాపాడుకోవడం, వాటి ని భూగర్భ జలాలుగా మల్చుకోవడం మొదలైన పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా చేను కింద చెరువు అన్నట్లుగా ప్రతీ రైతు చేను కింద కందకాలు తవ్వుతున్నారు. దీంతో సరి హద్దు ఇబ్బంది కాకుండా ఉండటంతో పాటు చెలకలో పడిన ప్రతీ వర్షపు చుక్క ఆ రైతు భూమిలోనే ఇంకి పోయే విధంగా కందకాలు తవ్వుతున్నారు. పూర్వకాలంలో ప్రతీ రైతు తన పొలంలో బావులు, పడావు పడిన గుంతలు ఉండేవి. వర్షం కురిసినప్పుడు చెలకలో పడిన నీరు బావులు, నీటి గుంతల్లోకి చేరేది. దీంతో అనూహ్యంగా భూగర్భ జలాలు పెరిగేవి.
ప్రస్తుతం మారిన కాలంతో పాటు, టెక్నాలజీ పెరగడంతో అందరు బోర్లపై ఆధారపడి పోయారు. దీంతో బావులు, ఇతర నీటి గుంతలను పూడ్చివేశారు. దీంతో చెలకలో పడిన నీరు పల్లానికి ప్రవహించడంతో ఆయా భూముల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోర్లు నిలువునా ఎండిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ రైతు తమ చెలక కింది భాగంలో కందకాలు తవ్వలని, అలా తవ్వడంతో చెలకలో పడిన ప్రతీ నీటిబొట్టు అక్కడే ఇంకిపోవడం, కందకాల్లో నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు రుజువు చేశారు. భూగర్భ జలాలు పెంచే ఈ కార్యక్రమంపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించే పనిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిమగ్నమైంది.
పది మండలాల్లో..
చెరువు కింద కందకాలు తవ్వే పనిలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు రూ.71.57 లక్షల పనులు చేపట్టి కూలీ రూపంలో డబ్బులు చెల్లించారు. రైతుల వారీగా భూ విస్తీర్ణం లెక్కలోకి తీసుకొని కందకాలు తవ్విన పనికి పని దినాల చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో పలువురు రైతు కూలీలు తమ పొలంలోనే తాము కందకాలు తవ్వితే కూలీ డబ్బులు వస్తున్నాయి. ఇలా జిల్లాలోని పది మండలాల్లో ఇప్పటి వరకు 260 పనులు చేపట్టారు. ఇందులో బెజ్జంకి మండలంలో 5 పనులకు గాను రూ. 71వేలు, చేర్యాల 16 పనులకు రూ. 3.42 లక్షలు, దౌల్తాబాద్ 4 పనులకు రూ. 42 వేలు, దుబ్బాక 69 పనులకు రూ. 18.19 లక్షలు, గజ్వేల్ 21 పనులకు రూ. 2.51 లక్షలు, కోహెడ 8 పనులకు రూ.1.57 లక్షలు, మద్దూరు 97 పనులకు రూ. 38.2 లక్షలు, సిద్దిపేట 29 పనులకు రూ. 6.57లక్షలు చెల్లించారు. అదేవిధంగా తొగుటలో 8 పనులు, మిరుదొడ్డిలో మూడు పనులు జరుగుతున్నాయి. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా మద్దూరు మండలంలో అత్యధికంగా కందకాలు తవ్వుకునేందుకు రైతులు మొగ్గు చూపడం విశేషం.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
చేనులో పడిన వర్షం నీరు పల్లానికి పోవడం పరిపాటి. పొలంలో పడిన ప్రతీ చినుకును ఒడిసి పట్టి ఎక్కడ పడిన వర్షం నీరు అక్కడే ఇంకిపోయేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ప్రతీ రైతు చెలకలో కింది భాగాన కందకాలు తవ్వడం ప్రారంభించాం. దీంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులకు పని కల్పించడంతోపాటు, వారి వారి పొలంలో కందకాలు తవ్వితే భూగర్భ జలా పెంపునకు దోహదపడుతుంది.
–గోపాల్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
Comments
Please login to add a commentAdd a comment