rainwater harvesting
-
చినుకు చినుకు ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి ఆవరణలో సపోటా, జామ.. ఇంకా
పన్నెండేళ్లుగా వర్షపు నీటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి వాసులైన ప్రమీల, రమేష్‌రావు దంపతులు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఇంటి ముందు పది వేల లీటర్ల సంపు కట్టారు ఇంటి అవసరాలకు ఈ నీటినే వాడుతుంటారు. పెద్దగా చదువుకోని వీరు వాటర్ హార్వెస్టింగ్ గురించి చేసిన ఆలోచన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తోటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది. వర్షపు నీళ్లు భూమిలో ఇంకితే భూగర్భజలం పెరుగుతుందని ఇతర రైతుల లాగే తానూ పొలం దగ్గర ఇంకుడు గుంత తవ్వుకున్నాడట రమేష్. ఊట బావితో ఎకరంన్నర భూమిలో పంటలు పండిస్తున్నాడు. అదే విధంగా ఇంటి దగ్గర వర్షపు నీరు వృథాపోకూడదని, ఇంటి అవసరాలకు వాడుకోవాలని ఆలోచన చేసి, ఆచరణలో పెట్టారు. ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీళ్లు వృథాగా పోకుండా ఓ పైపు ద్వారా ఆ నీటిని కొన్నాళ్లు బిందెలు, బకెట్లలో పట్టేవారట. ఆ తర్వాత సంపు ఏర్పాటు చేసి, ఆ నీటిని పైప్ ద్వారా మళ్లించాడు. ఆ నీరే ఇంటి అవసరాలు తీరుస్తోంది. తన ఇంటి పైకప్పు మీద ఓ పైపును అమర్చి అందులో ఓ డబ్బా పెట్టాడు. రాత్రి కురిసిన వర్షాన్ని తెల్లవారాక కొలత వేసి ఎన్ని మిల్లీమీటర్లు పడిందో చెప్పేస్తాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని వజ్జెపల్లి గ్రామానికి చెందిన రైతు కాట్యాడ రమేశ్‌రావ్. పంటలు సాగు చేయడంలో కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటాడు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుంటాడు. నీటి కరువుకు చెక్ వజ్జెపల్లిలో పన్నెండేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాడు రమేశ్. అప్పుడు గ్రామంలో నీటికి తీవ్ర కరువు ఉండేది. రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములు కావడంతో అక్కడ భూగర్భజలాలు పెద్దగా లేవు. ఎంత వర్షం పడినా భూగర్భజలమట్టం కొద్దికాలమే ఉంటుంది. ఆ తరువాత కరువు కాలమే. అలాంటి పరిస్థితుల్లో వర్షం కురిసినన్ని రోజులు నీటిని నిల్వ చేసుకోవాలంటే.. పెద్ద సంపు ఏర్పాటు చేయాలనుకున్నాడు. పది వేల లీటర్ల సామర్థ్యం గల సంపు నిర్మాణానికి రూ.30 వేల దాకా ఖర్చు చేశారు. వర్షపు నీరు పైపు ద్వారా సంపులోకి చేరేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వర్షం కురిసినన్ని రోజులు ఆ నీరు అంతా సంపులోకి చేరుతుంది. సంపు నిండితే బయటకు వెళ్లేలా ఏర్పాట్లున్నాయి. ప్రతీ రోజు బట్టలు ఉతకడం, స్నానాలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సంపు నుంచి నీటిని తోడుకుని వాడుకుంటారు. ఐదారు నెలల పాటు ఈ వర్షపు నీరే వీరి ఇంటి అవసరాలు తీరుస్తోంది. ఈ నీటి ఆధారంగా ఇంటి ఆవరణలో సపోటా, జామ, మామిడి చెట్లు పెంచారు. కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. ఒడిసిపట్టుకుంటేనే భవిష్యత్తు ‘వానాకాలంలో ఎంత వర్షం కురిసినా నీటికి ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొనేవాళ్లం. వాన నీటిని ఒడిసిపట్టుకోవడమే దీనికి పరిష్కారం అనుకున్నాం. ఇంటిపైన పడే ప్రతీ చినుకును పైపు ద్వారా సంపులోకి మళ్లించా. మధ్యలో నీరు ఫిల్టర్ అయ్యేలా ఇసుక వేశాం. ఈ విధానం వల్ల నీళ్లు ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటాయి. నీళ్లను ఇంత జాగ్రత్త చేస్తున్నాం కాబట్టి, వాడకంలోనూ పొదుపు పాటిస్తాం. ఆరునెలల పాటు ఈ నీళ్లనే వాడుకుంటాం’ ఎన్ని డబ్బులు వచ్చినా సరైన పొదుపు పద్ధతులు పాటించకపోతే ఎంత ఇబ్బంది పడతామో, నీటి విషయంలోనూ అంతే. ఎంత వర్షం కురిసినా నీటికి కష్టాలు ఎదుర్కొనేవాళ్లం. వృథాగా పోయే నీళ్లను జాగ్రత్త చేసుకోవాలనే ఆలోచనను అమలులో పెట్టాక సమస్యను అధిగమించాం. పొలం దగ్గర ఇంకుడు గుంత తవ్వుకోవడం వల్ల భూగర్భజలమట్టం పెరిగింది. మా సొంత ఆలోచనతోనే వర్షపు నీటిని కొలత వేస్తూ, దీని ఆధారంగా పంటలు సాగు చేయడం సులువవుతోంది. – కాట్యాడ ప్రమీల, రమేశ్‌రావ్, రైతు – ఎస్.వేణుగోపాల్‌చారి, సాక్షి, కామారెడ్డి చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
చేను కింద చెరువు
సాక్షి, సిద్దిపేట: వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. జలశక్తి అభియాన్‌లో భాగంగా నీటి వనరులను కాపాడుకోవడం, వాటి ని భూగర్భ జలాలుగా మల్చుకోవడం మొదలైన పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా చేను కింద చెరువు అన్నట్లుగా ప్రతీ రైతు చేను కింద కందకాలు తవ్వుతున్నారు. దీంతో సరి హద్దు ఇబ్బంది కాకుండా ఉండటంతో పాటు చెలకలో పడిన ప్రతీ వర్షపు చుక్క ఆ రైతు భూమిలోనే ఇంకి పోయే విధంగా కందకాలు తవ్వుతున్నారు. పూర్వకాలంలో ప్రతీ రైతు తన పొలంలో బావులు, పడావు పడిన గుంతలు ఉండేవి. వర్షం కురిసినప్పుడు చెలకలో పడిన నీరు బావులు, నీటి గుంతల్లోకి చేరేది. దీంతో అనూహ్యంగా భూగర్భ జలాలు పెరిగేవి. ప్రస్తుతం మారిన కాలంతో పాటు, టెక్నాలజీ పెరగడంతో అందరు బోర్లపై ఆధారపడి పోయారు. దీంతో బావులు, ఇతర నీటి గుంతలను పూడ్చివేశారు. దీంతో చెలకలో పడిన నీరు పల్లానికి ప్రవహించడంతో ఆయా భూముల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోర్లు నిలువునా ఎండిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ రైతు తమ చెలక కింది భాగంలో కందకాలు తవ్వలని, అలా తవ్వడంతో చెలకలో పడిన ప్రతీ నీటిబొట్టు అక్కడే ఇంకిపోవడం, కందకాల్లో నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు రుజువు చేశారు. భూగర్భ జలాలు పెంచే ఈ కార్యక్రమంపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించే పనిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిమగ్నమైంది. పది మండలాల్లో.. చెరువు కింద కందకాలు తవ్వే పనిలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు రూ.71.57 లక్షల పనులు చేపట్టి కూలీ రూపంలో డబ్బులు చెల్లించారు. రైతుల వారీగా భూ విస్తీర్ణం లెక్కలోకి తీసుకొని కందకాలు తవ్విన పనికి పని దినాల చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో పలువురు రైతు కూలీలు తమ పొలంలోనే తాము కందకాలు తవ్వితే కూలీ డబ్బులు వస్తున్నాయి. ఇలా జిల్లాలోని పది మండలాల్లో ఇప్పటి వరకు 260 పనులు చేపట్టారు. ఇందులో బెజ్జంకి మండలంలో 5 పనులకు గాను రూ. 71వేలు, చేర్యాల 16 పనులకు రూ. 3.42 లక్షలు, దౌల్తాబాద్ 4 పనులకు రూ. 42 వేలు, దుబ్బాక 69 పనులకు రూ. 18.19 లక్షలు, గజ్వేల్ 21 పనులకు రూ. 2.51 లక్షలు, కోహెడ 8 పనులకు రూ.1.57 లక్షలు, మద్దూరు 97 పనులకు రూ. 38.2 లక్షలు, సిద్దిపేట 29 పనులకు రూ. 6.57లక్షలు చెల్లించారు. అదేవిధంగా తొగుటలో 8 పనులు, మిరుదొడ్డిలో మూడు పనులు జరుగుతున్నాయి. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా మద్దూరు మండలంలో అత్యధికంగా కందకాలు తవ్వుకునేందుకు రైతులు మొగ్గు చూపడం విశేషం. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.. చేనులో పడిన వర్షం నీరు పల్లానికి పోవడం పరిపాటి. పొలంలో పడిన ప్రతీ చినుకును ఒడిసి పట్టి ఎక్కడ పడిన వర్షం నీరు అక్కడే ఇంకిపోయేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ప్రతీ రైతు చెలకలో కింది భాగాన కందకాలు తవ్వడం ప్రారంభించాం. దీంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులకు పని కల్పించడంతోపాటు, వారి వారి పొలంలో కందకాలు తవ్వితే భూగర్భ జలా పెంపునకు దోహదపడుతుంది. –గోపాల్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
రైల్వేలో వాననీటి సంరక్షణ కేంద్రాలు
న్యూఢిల్లీ: వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే చర్యల్లో భాగంగా భారత రైల్వే శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తం రైల్వే స్టేషన్లలోని 2,428 స్టేషన్ బిల్డింగుల్లో వర్షపు నీటి సంరక్షణ కేంద్రాలను స్థాపించింది. పలు చోట్ల పైకప్పు ద్వారా వర్షపు నీటిని సంరక్షించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారి చెప్పారు. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీటి శాతం, మట్టి రకం, గత గణాంకాలు, అలాగే 200 చదరపు మీటర్ల కన్నా పైకప్పు ఎక్కువగా ఉన్న రైల్వే బిల్డింగ్లు లాంటి ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.