నగరానికి నీటికష్టం | Water Problems Starts In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నగరానికి నీటికష్టం

Published Tue, Nov 13 2018 7:52 AM | Last Updated on Sat, Nov 17 2018 1:46 PM

Water Problems Starts In Visakhapatnam - Sakshi

అడుగంటిన ముడసర్లోవ జలాశయం

మహా నగరానికి మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రేటర్‌ పరిధిలో నీటికష్టాలు తరుముకొస్తున్నాయి. విశాఖ వాసులకు తాగునీటిని సరఫరా చేస్తున్న రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీకి చేరుకోవడంతో.. ఏలేరు నుంచి వచ్చే గోదావరి జలాలపైనే ఆశలున్నాయి. దీంతో వేసవి నాటికి నగర ప్రజలకు తాగునీటి కష్టాలు మరింత ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ముందు జాగ్రత్తగా డిసెంబర్‌ నుంచి పరిశ్రమలకు అందించే నీటిలో 25 శాతం కోత విధించాలని జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ తరహాలో బల్క్‌ కనెక్షన్లకు నీటి సరఫరాలో కోత విధించడం తొలిసారి కావడం చూస్తుంటే.. పరిస్థితి ఎంత దుర్భిక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశాఖ సిటీ: అంతర్జాతీయ నగరంగా, ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెబుతున్న పాలకులు.. నగరానికి కావాల్సిన నీటి వనరులను పెంపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పాతికేళ్లుగా అదనపు నీటి వనరులు సమకూర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. ఫలితంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు తలకిందులవుతున్నారు.

8 లక్షల జనాభా ఉన్నప్పుడు ఉన్న వనరులతోనే సుమారు 24 లక్షల జనాభా ఉన్న నేటి నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కురవాల్సిన దానికంటే కనిష్ట స్థాయిలో వర్షాలు కురవడంతో ఆయా వనరుల్లో నీటి నిల్వలు పెరగలేదు. ఫలితంగా వేసవి రాకముందే అవన్నీ ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఏలేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం కాల్వల ద్వారా నగరానికి తాగునీటి అవసరాలకు 80 ఎంజీడీలు అవసరం ఉండగా.. నీటి వనరుల లభ్యత బట్టి కేవలం 67.3 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది.
ఇందులో శివారు ప్రాంతాలైన ఆరిలోవ, విశాలాక్షినగర్, తోటగరువు, ముడసర్లోవ, చినగదిలి తదితర ప్రాంతాలకు నీటిని అందించే ముడసర్లోవ రిజర్వాయర్‌ నీటిమట్టం కనిష్ట స్థాయికి సమీపిస్తోంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌ నుంచి రోజుకి 0.5 ఎంజీడీ నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ గరిష్ట నీట మట్టం 169 అడుగులు కాగా.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా 157 అడుగులకు పడిపోయింది. ఈ నీటి వనరులు ఏప్రిల్‌ నెలాఖరు వరకు సరిపోతాయి. ఆ తర్వాత శివారు గ్రామాల పరిస్థితి ఏమిటన్నది అంతు చిక్కడంలేదు.

అన్ని రిజర్వాయర్లలో అదే పరిస్థితి
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒక్క ముడసర్లోవే కాకుండా మిగిలిన కెనాల్స్‌ పరిస్థితీ అదే మాదిరిగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ప్రకారం ఏప్రిల్‌ నెలాఖరు వరకు నెట్టుకొచ్చేయ్యొచ్చు. ఆ తర్వాత పరిస్థితేంటన్నది అగమ్యగోచరంగా మారనుంది. వీటిలో ఒక్క ఏలేరు కాల్వ నుంచే 80 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా అవుతోంది. అయితే.. మార్గమధ్యంలో రైతుల దారిమళ్లింపు, లీకుల వల్ల దాదాపు 20 ఎంజీడీల నీరు వృథా అయిపోతుండగా.. కేవలం 65 ఎంజీడీలు మాత్రమే అందుతున్నాయి. ఇందులో 35 ఎంజీడీలు స్టీల్‌ ప్లాంట్‌కు, 10 ఎంజీడీలు ఏపీఐఐసీ, గంగవరం పోర్టు, ఎన్‌టీపీసీ వంటి పరిశ్రమలకు అందిస్తున్నారు. మిగిలిన 20 ఎంజీడీలు నగర ప్రజల తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. దీంతోపాటు రైవాడ నుంచి 25 ఎంజీడీలు, మేఘాద్రిగడ్డ నుంచి 8.5, గోస్తనీ నుంచి 3.5, తాటిపూడి నుంచి 11 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను చూస్తుంటే.. త్వరలోనే ఈ సరఫరా పూర్తిగా తగ్గిపోయే ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఒక్క ఏలేశ్వరంలో తప్ప.. మిగిలిన రిజర్వాయర్లన్నీ అథమ స్థితికి చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఏలేరులో 85.97 మీటర్ల గరిష్ట నీటిమట్టం ఉంది. రోజుకు 80 ఎంజీడీల చొప్పున సరఫరా చేస్తే.. 2019 డిసెంబర్‌ వరకూ ఈ నీటి నిల్వలు సరిపోతాయి. ఈలోపు వర్షాలు కురిస్తే తప్ప.. ఇందులో నుంచి సరఫరా మహా కష్టమనే చెప్పవచ్చు. మిగిలిన రిజర్వాయర్ల పరిస్థితీ దారుణంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో.. నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. ఏలేరు తర్వాత ఎక్కువ శాతం నీటిని సరఫరా చేసే రైవాడ కూడా కనిష్టమట్టానికి చేరువై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రైవాడ రిజర్వాయర్‌ కనిష్ట నీటిమట్టం 99 మీటర్లు కాగా.. ప్రస్తుతం 103.50కి చేరుకుంది. రోజు వారీ సరాసరి సరఫరా చేస్తే.. జనవరి మొదటి వారంలోనే రైవాడ ఖాళీ అయిపోతుందని మహా విశాఖ నగర పాలక సంస్థ నీటి సరఫరా విభాగం అంచనా వేస్తోంది. ఇలా.. ప్రతి రిజర్వాయర్‌.. అట్టడుగు స్థాయికి చేరుకొని వచ్చే ఏడాది జనవరి నాటికే నగరంలో దాహం కేకలు వినిపించనున్నాయి.

రోజు విడిచి రోజు సరఫరా..25 శాతం కోతలు
వర్షాభావ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న నీటినిల్వలపై ఆందోళన చెందిన జీవీఎంసీ అధికారులు.. ముందస్తు చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బల్క్‌ కనెక్షన్లకు అందించే నీటి సరఫరాలో 25 శాతం కోత విధించాలని నిర్ణయించారు. తాటిపూడి నుంచి పరిశ్రమలకు అందించే నీటి సరఫరాలో డిసెంబర్‌ 1 నుంచి 2019 మే 20 వరకూ అంటే 171 రోజుల పాటు 25 శాతం చొప్పున తగ్గించి సరఫరా చేస్తే సుమారు 287 ఎంజీడీలు ఆదా చెయ్యవచ్చని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అదే మాదిరిగా.. జోన్‌–1లో 2019 మార్చి 1 నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా చెయ్యాలని నిర్ణయించింది. 1, 2, 3, 6 వార్డులకు ఒకరోజు, మరుసటి రోజున 4, 5 వార్డులకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాలకు గోస్తనీ నది నుంచి సరఫరా జరుగుతుంటుంది. ఒకవేళ ఈ సమయాల్లో గోస్తనీలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతే.. టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు రివర్స్‌ పంపింగ్‌ చేసి ఆయా వార్డులకు నీటిని అందించాలని జీవీఎంసీ ప్రణాళికలు రూపొందించింది.

నీటి కష్టాలు రాకుండాసిద్ధమవుతున్నాం
రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు ముందుగానే రూపొందించాం. తాగునీరు అందుబాటులో ఉండీ.. సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాం.  ఉదయం పూట నీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. నీటి సరఫరా సమయాలతోపాటు ఒకవేళ నీటిసరఫరా వేళల్ని మార్చినా వాటిని ప్రజలకు తెలియపరచాలని సిబ్బందిని సూచించాం. రానున్న వేసవి దృష్ట్యా అవసరమైన మరమ్మతులపై అప్రమత్తంగా ఉండాలని నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించాం. అదే విధంగా 32 విలీన గ్రామాల్లోనూ నీటి కొరత రాకుండా చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం.– హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement