నీట మునిగిన పంట పొలాలు
గొల్లపల్లి (ధర్మపురి): కాకతీయ మెయిన్ కెనాల్‌కు బుధవారం భారీ గండి పడింది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 2 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కట్టలు తెగిపోయే ప్రమాదం నెలకొనడంతో అధికారులు ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమన్నగుడి వద్ద ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్ కెనాల్‌కు 88.66కి.మీల రాయి (యూటీ) వద్ద భారీ గండి పడింది. నీటి ప్రవాహం బీబీరాజ్‌పల్లి, శ్రీరాములపల్లి, శంకర్‌రావుపేట, మల్లన్నపేట, వెంగళాపూర్, నందిపల్లి గ్రామాలను ముంచెత్తింది.
నీటి ఉధృతికి శ్రీరాములపల్లి పెద్ద చెరువు, చిన్నచెరువు నిండి తెగిపోయే పరిస్థితికి చేరగా.. రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి ఇసుక బస్తాలతో పూడ్చి వేయించారు. చెరువు కట్టకు గండికొట్టారు. ఆ నీరు శంకర్‌రావుపేట చెరువునూ నింపేసింది. ఆ చెరువు కూడా నిండిపోవడంతో అధికారులు జేసీబీతో కట్టకు గండిపెట్టారు. అక్కడి నుంచి వరదనీటిని మల్లన్నపేట గుడి చెరువు మీదుగా.. వెంగళాపూర్, నందిపల్లి మధ్య బ్రిడ్జి నుంచి శెకల్లవాగుకు మళ్లించారు. శ్రీరాములపల్లి, బీబీరాజ్‌పల్లి, శంకర్‌రావుపేటకు రాకపోకలు నిలిచిపోయాయి.
మరమ్మతులు చేపట్టకపోవడంతోనే..
ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు చాలా ఏళ్లుగా మరమ్మతు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరింది. కరీంనగర్ శివారు ఎల్‌ఎండీని నింపేందుకు ఈ నెల 22న కాకతీయ కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. ఆ నీటి ఉధృతికి గండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment