నిధులు నీళ్లపాలు
-
నాసిరకంగా కాలువ పనులు
-
కాకతీయ’కు గండితో వెల్లడైన వైనం
-
పటిష్టతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
వరంగల్ :
జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందించే కాకతీయ ప్రధాన కాల్వల పటిష్టతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వల్లోకి నీరు రాగానే గండి పడడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌ఎండీలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా ఎస్సారెస్పీ స్టేజ్–1తో పాటు స్టేజ్–2కు నీరు అందించాలంటే కాల్వల్లో పూర్తి సామర్థ్యం మేరకు 5 వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేయాలి. గత పదేళ్లుగా జిల్లాలోని ప్రధాన కాల్వలు, మైనర్లు, సబ్‌మైనర్లు నిర్మించినప్పటికీ కాలువలు బలహీనంగా ఉండడంతో 3వేల క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేయలేదు. ఎల్‌ఎండీ నుంచి మన జిల్లా వరకు ఉన్న స్టేజ్–1లోని ప్రధాన కాలువ 294 కిలోమీటర్లు పటిష్టం చేస్తేనే స్టేజ్ –2కు నీరందించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జిల్లాలోని 201–875 నుంచి 234 కి.మీ. వరకు మట్టికట్టలు, లైనింగ్ కోసం రూ.60 కోట్లు మంజూరయ్యాయి. అయితే కాలువల పనులు నాసిరకంగా చేపట్టడంతో అదనంగా నీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. కోట్లు వ్యయం చేసినా ప్రభుత్వ లక్ష్యం నేరవేరక పోగా నిధులన్నీ నీళ్లులో పోసినట్టయింది. గత వారం రోజులుగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాం నుంచి విడుదల చేస్తున్న నీటి సరఫరాను అధికారులు తగ్గించారు. గత నెల 27న వరంగల్ జిల్లా పరిధిలోని కాకతీయ ప్రధాన కాలువకు పెద్దమ్మగడ్డ సమీపంలో గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధ, గురువారాల్లో కాలువకు బయట పక్క గండి పడిన ప్రాంతంలో మట్టితో పూడ్చారు. 4వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తేనే ఈ పరిస్థితి నెలకొనడంతో ఎస్సారెస్పీ అధికారులు నీటి సరఫరాను తగ్గించారు. ప్రస్తుతం 3500 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో స్టేజ్–2 ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది.
పరిశీలించిన ఈఎన్‌సీ...
అరెపల్లి బ్రిడ్జి సమీపంలోని కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని నీటి పారుద ల శాఖ ఈఎన్‌సీ విజయప్రకాశ్ గత శుక్రవారం పరిశీలించారు. కాలువ బెడ్ లెవల్‌లో నీటి ఊట ఎక్కువైనందున భారీగా నీరు విడుదల కావడంతో స్థానికులు అందోళనకు గురైనట్లు ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి ఆయనకు వివరించారు. దీంతో కాలువ లీకేజీ ప్రాంతంలో అదనంగా మట్టి పోయడంతో పాటు నీరు ప్రవహిస్తున్న చోట ఇసుకబస్తాలతో బండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలువ పనుల సమయంలో పర్యవేక్షణ సరిగా లేనందునే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. ఇప్పటికైనా బయటకు వస్తున్న నీటిని మళ్లించి పర్యవేక్షించాలని ఎస్‌ఈని ఆదేశించినట్లు సమాచారం.
మంత్రి హరీశ్ ఆరా..!
కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. గండిని పరిశీలించిన ఈఎన్‌సీ విజయప్రకాశ్ నుంచి మంత్రి పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం.
గండి స్థానంలో కొత్త కట్ట నిర్మాణం
కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడి వృథాగా నీరు లీక్ కావడంతో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. లీకేజీని అపేందుకు నాలుగు రోజులుగా శ్రమిస్తున్నారు. అయినా ప్రవాహం అగక పోవడంతో ఆ ప్రాంతంలోని మట్టి మొత్తం తీసి కొత్తగా కట్ట నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అదివారం నీరు లీకేజీ అయిన ప్రాంతంలోని కట్టను పూర్తిగా తొలగించి నాణ్యమైన మట్టితో కొత్తగా నిర్మిస్తున్నారు. కాకతీయ కాలువలో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తూ పనులు చేపట్టారు. దీంతో మరో వారం రోజుల పాటు నీటి సరఫరా జరగదని సమాచారం.